ఐదుగురు ఎంవీఐలపై సస్పెన్షన్‌ వేటు | Suspension of five MVIs | Sakshi
Sakshi News home page

ఐదుగురు ఎంవీఐలపై సస్పెన్షన్‌ వేటు

Published Tue, Aug 8 2017 3:28 AM | Last Updated on Mon, Sep 11 2017 11:31 PM

Suspension of five MVIs

వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్‌లపై సర్కార్‌ కొరడా  
 
సాక్షి, హైదరాబాద్‌: వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్‌లకు పాల్పడిన ఐదుగురు మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్ల(ఎంవీఐ)పై సోమవారం ప్రభుత్వం సస్పెన్షన్‌ వేటు వేసింది. మోటారు వాహన చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించి విజయవాడ ఆటోనగర్‌లో నిర్మాణ దశలో ఉన్న ఆయిల్‌ ట్యాంకర్‌లకు నగరంలోని ఖైరతాబాద్, ఉప్పల్, బండ్లగూడతో పాటు వికారాబాద్, ఖమ్మం రవాణా కార్యాలయాల్లో అక్రమంగా రిజిస్ట్రేషన్‌లు జరిగాయి. ఇందుకు బాధ్యులైన కె.చంద్రశేఖర్‌(ఖైరతాబాద్‌), షకీల్‌ అహ్మద్‌(బండ్లగూడ), ఎం.సురేశ్‌రెడ్డి(ఉప్పల్‌), ప్రవీణ్‌కుమార్‌రెడ్డి(వికారాబాద్‌), బి.శంకర్‌(ఖమ్మం) అనే ఐదుగురు ఎంవీఐలపైన ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

నగరానికి చెందిన సుమారు 50కి పైగా ఆయిల్‌ ట్యాంకర్లను పరిశీలించకుండా విజయవాడలో ఉన్న వాటికి కేవలం డాక్యుమెంట్‌ల ఆధారంగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను చేపట్టడం సంచలనమైంది. ఏప్రిల్, మే నెలల్లో చోటుచేసుకున్న ఈ అక్రమ రిజిస్ట్రేషన్‌లపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా ఉపరవాణా కమిషనర్‌ ప్రవీణ్‌రావు నేతృత్వంలో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. అన్ని కోణాల్లో కమిటీ సమగ్ర దర్యాప్తు చేపట్టింది. విజయవాడలో నిర్మాణ దశలో ఉన్న వాహనాల ఫొటోలతో సహా ప్రభుత్వానికి నివేదికను అందజేసింది. భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు పునరావృతం కాకుండా వాహనాల ఇంజిన్, చాసీస్‌ నంబర్లను స్కానింగ్‌ చేయాలని సూచించింది. తెల్ల కాగితంపైన ఈ నంబర్‌లను పెన్సిల్‌తో నమోదు చేసే పద్ధతికి స్వస్తి చెప్పాలని పేర్కొంది. కమిటీ అందజేసిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement