‘స్వచ్ఛ హైదరాబాద్’కు సంఘటిత కృషి
‘స్వచ్ఛ హైదరాబాద్’లో గవర్నర్, సీఎం
మంత్రులు, అధికారుల భాగస్వామ్యం
{పజలు, ప్రజా సంఘాలు మమేకం
భాగ్య నగరం కదిలింది. ‘స్వచ్ఛ’ గీతిని ఆలపించింది. బంజారాహిల్స్ నుంచి బతుకమ్మ కుంట దాకా... గోల్కొండ ఖిల్లా నుంచి గోల్నాక బస్తీ దాకా...చిన్నాపెద్దా తేడా లేకుండా అందరినీ ఒక్క తాటిపైకి తెచ్చింది. మంత్రులు... ప్రజాప్రతినిధులు... ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి అధికారులు... సామాన్యులను కలసికట్టుగా ముందుకు నడిపించింది. బస్తీల వైపు అడుగులు వేయించింది. ఏళ్ల తరబడి ‘పరిశుభ్రత’కు దూరంగా... చెత్త కుప్పలు... ముసిరే దోమలు...ఈగలతో సహవాసం చేస్తూ... అనారోగ్యమే ఆస్తిపాస్తులుగా బతుకుతున్న మురుగువాడల జనాలకు ‘స్వచ్ఛ’మైన వాతావరణం కల్పించేందుకు శనివారం తొలి అడుగు వేయించింది.
స్పీకరూ.. స్వీపరూ.. సంపన్నులు.. ఆపన్నులు అనే తేడా లేకుండా అందరూ ఒక్కటై... చెత్త కుప్పలను తొలగించేలా చేసింది. అధికారులు క్షేత్ర స్థాయిలో శ్రామికులైన తీరు... శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతీకగా నిలిచింది. ‘స్వచ్ఛ హైదరాబాద్’ లక్ష్యంగా పడిన ఈ అడుగు... గమ్యం చేరేదాకా అప్రతిహతంగా సాగాలని దరూ కాంక్షించేలా కొత్త స్ఫూర్తిని నింపింది.
సికింద్రాబాద్/బౌద్దనగర్ ప్రజలు, అధికారులు సమష్టిగా, సంఘటితంగా పనిచేస్తే సాధ్యం కానిది ఏదీ ఉండదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. శనివారం ఆయన సికింద్రాబాద్ పరిధిలోని పార్శిగుట్ట ప్రాంతంలో ‘స్వచ్ఛ హైదరాబాద్’ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ స్థానిక సమస్యలను సమూలంగా పరిష్కరిస్తానని, అందుకు బస్తీవాసులు తనకు సహకరించాలని కోరారు. దాదాపు గంటపాటు సాగిన ముఖ్యమంత్రి ప్రసంగం కేవలం పార్శిగుట్ట ప్రాంత బస్తీలు సమస్యలు, పరిష్కార మార్గాలపైనే సాగింది. గతంలో అత్యంత సమస్యాత్మక నగరాలుగా ఉంటూ అనంతర కాలంలో ప్రపంచంలో పేరొందిన నగరాలుగా గుర్తింపు పొందిన జెనీవా, రియోడిజినీరో స్థాయిలో నగరాన్ని తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. బస్తీలో పార్కు, మార్కెట్ ఏర్పాటుకు ఖాళీ స్థలాల వివరాలు అందజేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం ముగిసేలోపు ఈ పని పూర్తి చేయాలని సూచించారు.
కళాశాల ఏర్పాటుకు హామీ
మారుమూల గ్రామాల్లో సైతం మంచి ప్రభుత్వ విద్యాసంస్థలు, జూనియర్ కళాశాలలు ఉండగా, సికింద్రాబాద్ నియోజకవర్గంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల లేకపోవడం విచారకరమన్నారు. పార్శిగుట్ట ప్రాంతంలోనే మంచి విద్యాలయంతోపాటు, జూనియర్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఏడు బస్తీలు... ఏడు సమావేశాలు
‘స్వచ్ఛ హైదరాబాద్’ కార్యక్రమంలో భాగంగా పార్శిగుట్ట యూనిట్ పరిధిలోని ఏడు బస్తీల సమస్యలను స్వయంగా తెలుసుకున్నానని, రేపటి నుంచి బస్తీల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసుకుందామన్నారు. బస్తీకి యాభై మంది చొప్పున ఆహ్వానించి స్థానిక సమస్యలపై చర్చించనున్నట్లు తెలిపారు. ఆదివారం ఉదయం 9 గంటలకు పార్శిగుట్టకు వస్తానని... తొలి సమావేశాన్ని వెంటనే ప్రారంభిస్తానన్నారు. మధ్యలో ఒకగంట పాటు సచివాలయానికి వెళ్లి ఫైళ్లు చూసుకుని తిరిగి వచ్చి రాత్రి పదిగంటల వరకైనా అన్ని బస్తీల సమావేశాలు నిర్వహించి సమస్యలకు పరిష్కారం కనుగొంటానన్నారు.
బంగ్లాదేశ్ ప్రొఫెసర్ ఆదర్శం కావాలి
లక్ష్యాన్ని ఎంచుకుని పట్టుదలతో పని చేస్తే జవాబు దొరకని సమస్య ఉండదని, పేదరిక నిర్మూలన ఉపాధి అవకాశాలపై బంగ్లాదేశ్‌కు చెందిన ప్రొఫెసర్ యూనెస్ మనకు ఆదర్శం కావాలన్నారు. ఆరుగురు మహిళల జీవితాలను అధ్యయనం చేసిన ఆయన వడ్డీ వ్యాపారుల కారణంగా మహిళలు నష్టపోతున్న తీరును గుర్తించి వారిని పొదుపు సంఘంగా తీర్చిదిద్దారని, అదే నేడు 17 వేల మహిళా సంఘాల ఏర్పాటుకు బీజం వేసిందన్నారు.
సమస్యలపై చర్చిద్దాం
ముఖ్యమంత్రిగా మీ దగ్గరకు రాలేదని, ఒక సామాన్య కార్యకర్తగా వచ్చానని కే సీఆర్ అన్నారు. అన్ని విభాగాల అధికారులు ఇక్కడే ఉన్నందున స్థానిక సమస్యలను ప్రశాంతంగా తనతో చర్చించేందుకు సమయం కేటాయించాలని కోరారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు...
నాలా స్థలాలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడమే ముంపు సమస్యకు కారణమని, కొద్ది మంది కోసం ఏటా అందరినీ నీటముంచడం మంచిది కాదని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారమార్గాలు ఆలోచిద్దామన్నారు. బస్తీ వాసులు ముందుకు వస్తే అదే ప్రాంతంలో డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
పార్శిగుట్ట నుంచి పాదయాత్ర
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పార్శిగుట్ట నుంచి మధురానగర్‌లోని రాఘవ ఫంక్షన్ ప్యాలెస్‌కు పాదయాత్రగా చేరుకున్నారు. అనంతరం ఆయన మంత్రి టి.పద్మారావుగౌడ్, జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ హరిచందన దాసరి, డిప్యూటీ కమిషనర్ ఈడీ విజయరాజు, నోడల్ అధికారి కార్తీక్, బిల్‌కలెక్టర్ నర్సింగరావుతో సమావేశమై స్థానిక సమస్యలపై చర్చించారు.ఈ సందర్భంగా ఉత్తర మండల డీసీపీ సుధీర్‌బాబు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
అందమైన నగరాన్ని నిర్మిద్దాం
సమశీతోష్ట వాతావరణ మండలాల మధ్య ఉన్న హైదరాబాద్ అత్యంత నివాసయోగ్య నగరం. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఎన్నికల సంఘ మాజీ ప్రధాన కమిషనర్ లింగ్డో కూడా ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకోవడం ఇందుకు ఒక ఉదాహరణ. భూకంపాల ముప్పు లేదు. మంచి పనులు చేస్తే భగవంతుడి ఆశీస్సులు ఉంటాయనే మన పెద్దల మాట నిజమవుతోంది. బండారు దత్తాత్రేయ, గవర్నర్, తదితరులు ఈ కార్యక్రమానికి ఎంతో సహకరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనికి రూ.200 కోట్లు ఖర్చు పెడుతోంది. భవిష్యత్ తరాలకు అందమైన నగరాన్ని అందిద్దాం. అందరం కలిసి మనవంతుగా కొంత చెత్తను తొలగిస్తే... నిత్యం నగర వీధులను శుభ్రం చేస్తున్న సఫాయీ కర్మచారులకు కొంత భారం తగ్గుతుంది. ఆ దిశగా కదులుదాం.. రండి..! - కె.చంద్రశేఖరరావు, ముఖ్యమంత్రి