స్వైన్ కిల్లర్ | Swine Flu heavy in city | Sakshi
Sakshi News home page

స్వైన్ కిల్లర్

Published Thu, Jan 22 2015 12:16 AM | Last Updated on Sat, Sep 2 2017 8:02 PM

స్వైన్ కిల్లర్

స్వైన్ కిల్లర్

రోజురోజుకు పెరుగుతున్న బాధితులు ఈనెలలో 12 మంది బలి
బుధవారం 13 పాజిటివ్ కేసులు నేడు ‘గాంధీ’కి జాతీయ వైద్య బృందం
అప్రమత్తంగా వ్యవహరిద్దాం  వేగంగా వ్యాపిస్తున్న వైరస్
 

 స్వైన్ ఫ్లూ మహమ్మారి భాగ్యనగరాన్ని వణికిస్తోంది. ప్రజల ప్రాణాలను హరిస్తోంది. వందలాది మందిని ఆస్పత్రుల పాల్జేస్తోంది. చలి వాతావరణం కావడంతో ఈ వైరస్ త్వరగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తోంది. సరైన జాగ్రత్తలు  తీసుకుంటే భయపడాల్సిన పనిలేదు. అలాగని నిర్లక్ష్యం పనికి రాదు. కొద్దిపాటి జాగ్రత్తలతో ఈ మహమ్మారిని తరిమికొట్టొచ్చు. రండి... అందరం కలిసి స్వైన్‌ఫ్లూపై సమరం సాగిద్దాం... మహానగర ప్రజలంతా ఏకమై ఈ రక్కసిని అంతం చేద్దాం. - సాక్షి, సిటీబ్యూరో
 
దేశంలోనే తొలిసారిగా స్వైన్‌ఫ్లూ కేసు నగరంలోనే బయటపడిన విషయం విదితమే. 2009 మే 13న అమెరికా నుంచి వచ్చిన ఓ వ్యక్తికి హైదరాబాద్  నగరంలోనే స్వైన్‌ప్లూ ఉన్నట్లు తేలడం అప్పట్లో సంచలనం సృష్టించింది.
 
హైదరాబాద్‌లోనే అధికం... ఎందుకంటే..


►{పస్తుత వాతావరణ పరిస్థితులు, చలి వాతావరణం స్వైన్‌ఫ్లూ వైరస్ వృద్ధికి, ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తికి, దాని క్రియాశీలత పెరిగేందుకు దోహదం చేస్తోందని వైద్యనిపుణులు స్పష్టం చేస్తున్నారు.

►దేశ, విదేశాలకు చెందిన పర్యాటకులు, వృత్తి నిపుణులు, విద్యార్థులు, వ్యాపారులు నిత్యం వేలాదిగా నగరానికి వచ్చిపోతుండడం.
     
► ఎగ్జిబిషన్, వాణిజ్య సముదాయాలు, మాల్స్, సినిమాహాళ్లు, పార్కులు, దర్శనీయ స్థలాల వద్ద గుంపులుగా జనం సంచరిస్తుండడం... వారిలో స్వైన్‌ఫ్లూ రోగులు ఉండడంతో వ్యాధి త్వరగా వ్యాప్తి చెందుతోంది.
     
► బహిరంగ ప్రదేశాల్లో తినుబండారాల విక్రయం, జంక్‌ఫుడ్ వినియోగం అధికంగా ఉండడం, సరిగా ఉడికించని ఆహారం తీసుకోవడమూ వ్యాధి విజృంభణకు కారణమవుతోంది.
     
► ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలకు చెందిన స్వైన్‌ఫ్లూ కేసులకు సంబంధించి ఇక్కడి వివిధ డయాగ్నోస్టిక్ కేంద్రాల్లో పరీక్షలు చేసి నిర్ధారణ చేసున్నారు. దీంతో స్వైన్‌ఫ్లూ కేసులు నగరంలో ఎక్కువగా నమోదవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.
     
► రాజధాని నగరంలో మోటారు వాహనాల కాలుష్యం, కల్తీ ఇంధనాల వినియోగం వల్ల గాలిలో సూక్ష్మ, స్థూల ధూళి కణాల సాంద్రత పెరగడంతో అందులో చేరిన వైరస్ తేలికగా మనుషులకు వ్యాపిస్తోంది.
 
మరో పక్షం రోజులు జాగ్రత్త

నగరంలో శీతల వాతావరణం మరో 15 రోజుల పాటు ఉండే అవకాశం ఉంటుందని బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తరవాత కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఎండ తీవ్రత పెరిగిన పక్షంలో గాలిలో ఉన్న స్వైన్‌ఫ్లూ వైరస్ విజృంభణ... వ్యాధి వ్యాప్తి తగ్గుముఖం పడుతాయని వైద్యులు చెబుతున్నారు.
 
 గ్రేటర్‌లో స్వైన్‌ఫ్లూ మృత్యుఘంటికలు మోగి స్తోంది. రోజు రోజుకూ బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఏ రోజుకారోజు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అన్ని శాఖల అధికారులు రంగంలోకి దిగారు. కలెక్టర్‌తోపాటు జీహెచ్‌ఎంసీ, వైద్య శాఖ ఇలా అన్ని వర్గాలు ముందుకు కదిలాయి. కార్పొరేట్ ఆస్పత్రుల వారు కూడా స్వైన్‌ఫ్లూపై సమరానికి సిద్ధమయ్యాయి. ప్రజలు సైతం ముందుకు కదిలారు.     

నగరంలో కేవలం 21 రోజుల్లోనే 12 మందిని హెచ్1ఎన్1 వైరస్ పొట్టన పెట్టుకుంది.  బుధవారం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అజ్మత్‌సుల్తానా (55) ప్రాణాల ను బలితీసుకుంది. ఉస్మానియాలో మరో మహిళ చని పోయినట్టు సమాచారం. గాంధీలో ప్రస్తుతం 35 పాజిటివ్, 15 అనుమానిత కేసులుండగా, ఉస్మానియాలో ఓ మహిళ హౌస్‌సర్జన్(25) సహా మరో 11మంది చికిత్స పొందుతున్నారు. కేర్, అపోలో, యశోద, కామినేని, కాంటినెంటల్, అవేర్ గ్లోబల్, కిమ్స్, శ్రీయ, ఇష, రెయిన్‌బో, ఆదిత్య తదితర కార్పొరేట్ ఆస్పత్రుల్లో బుధవారం 13కొత్త కేసు లు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో ఇప్పటివ రకు 85, రంగారెడ్డిలో వంద పాజిటివ్ కేసులను గుర్తించారు.    
 
నేడు గాంధీకి జాతీయ వైద్య బృందం

 
స్వైన్‌ఫ్లూ తీవ్రత నేపథ్యంలో జాతీయ వైద్య బృందం బుధవారం మధ్యాహ్నం 2గంటలకు గాంధీ స్వైన్ ఫ్లూ నోడల్ కేంద్రాన్ని సందర్శించనుంది. ఆస్పత్రిలో మౌలిక సదుపాయాలు, ఐసోలేషన్ వార్డు, చికిత్స విధానాలు, అందిస్తోన్న మందులు తదితర అంశాలను జాతీయ వైద్యబృందం పరిశీలించి, సలహాలు, సూచనలు ఇవ్వనుంది.
 
కొంతకాలం ఇవి పాటించాలి..

 
 స్నేహితులు, పరిచితులను ఆలింగనం చేసుకోవ డం, షేక్ హ్యాండ్‌లు ఇవ్వడం వంటి ఆత్మీయ పలకరింపులను కొంతకాలం పక్కన పెట్టాలి. బయటికి వెళ్లి వచ్చిన ప్రతిసారి కాళ్లు, చేతులు శుభ్రం చేసుకోవాలి. 99 శాతం వైరస్‌ను స్వీయ జాగ్రత్తల వల్లే దూరం చేసుకోవచ్చు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, హృద్రోగులు, కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్న వారు, ఆస్తమా, హెచ్‌ఐవీ బాధితులు అప్రమత్తంగా ఉండాలి. జలుబు, దగ్గు, జ్వరం, ముక్కు నుంచి నీరు కారడం వంటిలక్షణాలు ఏ మాత్రం కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.  
 
పెరిగిన మాస్క్‌ల వినియోగం..

 
ఫ్లూ కారణంగా గాంధీ ఆసుపత్రిలో మాస్క్‌ల వినియోగం భారీగా పెరిగింది. అదే సమయంలో అమ్మకాలు జోరందుకున్నాయి.  మాస్క్‌లు కావాలంటూ వార్డుబాయ్స్, కాంట్రాక్ట్ సిబ్బంది కూడా అధికారులను కోరారు. రోగులను పరామర్శించేందుకు వచ్చేవారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది.
 
‘గాంధీ’ ఎనిమిదో అంతస్తులో ప్రత్యేక వార్డు..
 
ఆస్పత్రి ప్రధాన భవనంలోని 8వ అంతస్తులో స్వైన్‌ఫ్లూ బాధితుల కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. సరిగ్గా దానికి ఎదురుగానే నర్సింగ్ కళాశాల, స్కూలు, వసతిగృహాలు ఉన్నాయి. దీంతో నర్సింగ్ స్కూలు, కళాశాల విద్యార్థులు సైతం ఆందోళన చెందుతున్నారు. కొందరు ఇంటిబాట పడుతున్నారు. స్వెన్‌ఫ్లూ లక్షణాలతో ఆస్పత్రి వచ్చేవారికి అత్యవసర విభాగంలో మూడు పడకలతో ఇన్‌ఫ్లూయాంజా లైక్ ఇల్‌నెస్ (ఐఎల్‌ఐ)వార్డును ఏర్పాటు చేసినట్టు నోడల్ అధికారి నర్సింలు తెలిపారు. నమూనాల సేకరణ ఇతర వైద్య చికిత్సలు ఇక్కడ అందుబాటులో ఉంటాయన్నారు.
 
లక్షణాలు గుర్తించండిలా...
 
ఫ్లూ సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు  వైరస్ గాల్లోకి ప్రవేశిస్తుంది. ఇలా ఒకసారి వాతావరణంలోకి ప్రవేశించిన వైరస్ రెండు గంటలపాటు జీవిస్తుంది. సాధారణ ఫ్లూలో కన్పించే లక్షణాలన్నీ స్వైన్‌ఫ్లూ బాధితుల్లోనూ కనిపిస్తాయి. తీవ్ర జ్వరం, గొంతు నొప్పి, ఒంటి పై బొబ్బలు, ఉన్నట్టుండి వాంతులు వస్తాయి. తరచూ విరేచనాలు, భరించలేని ఒంటి నొప్పలు ఉంటాయి. ముక్కు దిబ్బడ, ముక్కు, కళ్ల నుంచి నీరు కారుతుంది. పైల క్షణాలు కన్పిస్తే దాన్ని హెచ్1ఎన్1 వైరస్‌గా అనుమానించాలి.      - డాక్టర్ నర్సింలు, నోడల్ ఆఫీసర్, స్వైన్‌ఫ్లూ  గాంధీ ఆస్పత్రి
 
ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరి...

 
సాధ్యమైనంత వరకు జనసమూహాలకు వెళ్లక పోవడమే ఉత్తమం. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయరాదు. ఇతరులకు షేక్‌హ్యాండ్ ఇవ్వడం, కౌగిలించుకోవడం చేయరాదు. చిన్న పిల్లలతో సహా ఎవరినీ ముద్దు పెట్టుకోకూడదు. కాళ్లు, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. - డాక్టర్ ధైర్యవాన్, సూపరింటెండెంట్, గాంధీ జనరల్ ఆస్పత్రి
 
నిమ్స్‌లో ప్రత్యేక వార్డు
 

పంజగుట్ట: నిమ్స్‌లో స్వైన్‌ఫ్లూ బాధితుల కోసం స్పెషాలిటీ బ్లాక్‌లో 40 పడకలతో కూడిన ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసినట్టు నిమ్స్ డెరైక్టర్ నరేంద్రనాథ్ తెలిపారు.  గతంలో స్వైన్‌ఫ్లూ విజృంభించినప్పుడు పది పడకలు అందుబాటులో ఉంచామని, ప్రస్తుతం మరో 30 పడకలను అదనంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. నిమ్స్‌కు ఇప్పటివరకు స్వైన్‌ప్లూ కేసులు రాలేవన్నారు. ఏ సమయంలో వచ్చినా యుద్ధప్రాతిపదికన చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మందులు, వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. ఆస్పత్రిలో పనిచేస్తోన్న ఉద్యోగులకు వైరస్ సోకకుండా ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేసి వ్యాక్సిన్ అందించాలని పారా మెడికల్ యూనియన్ అధ్యక్షుడు హరినాథ్‌బాబు డెరైక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.
 
నష్టపరిహారం చెల్లించాలి: టీడీపీ
 
గాంధీ ఆస్పత్రి : ప్రభుత్వ నిర్లక్ష్యవైఖరి వల్లే స్వైన్‌ఫ్లూ మరణాలు సంభవించాయని టీడీపీ నాయకులు ఆరోపించారు.  టీడీపీ గ్రేటర్ అధ్యక్షుడు సి.కృష్ణయాదవ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, నగర నాయకులు మేకల సారంగపాణి, నోముల ప్రకాశరావు తదితరులు బుధవారం గాంధీ ఆస్పత్రిని సందర్శించారు. ఐసోలేషన్‌వార్డులో చికిత్స పొందుతున్న స్వైన్‌ఫ్లూ బాధితులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ స్వైన్‌ఫ్లూ బారిన పడి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా, ప్రభుత్వం పట్టించుకోకుండా నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల కుంటుంబాలకు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
 
జీహెచ్‌ఎంసీ స్పెషల్ డ్రైవ్
 
సిటీబ్యూరో: స్వైన్‌ఫ్లూ నివారణకు జీహెచ్‌ఎంసీ కూడా రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా శానిటేషన్ డ్రైవ్, బస్తీల్లోని ప్రజలకు అవగాహన కార్యక్రమాలు, స్వైన్‌ఫ్లూ బాధితుల కోసం జీహెచ్‌ఎంసీ తరఫున చేయాల్సిన పనులు, బాధితులను గుర్తించిన వెంటనే సమాచారమిచ్చేలా కార్పొరేట్ ఆస్పత్రులతో ఒప్పందం చేసుకుంటోంది. ఈ వైరస్ బారిన పడిన వారితో సన్నిహితంగా ఉంటున్నవారి ఆరోగ్య పరిస్థితులు కూడా తెలుసుకుంటామని జీహెచ్‌ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. వీటితోపాటు మురికివాడలకు ప్రత్యేక బృందాలను పంపించి బాధితులను గుర్తించి తక్షణ చర్యలు చేపడతామన్నారు.
 
107 కేసులు పాజిటివ్
 
సిటీబ్యూరో: జిల్లాలో ఇప్పటివరకు 669 కేసులు నమోదు కాగా, అందులో 107 పాజిటివ్‌గా ఉన్నట్లు గుర్తించినట్టు కలెక్టర్ నిర్మల తెలిపారు. యాకుత్‌పురా, ఆసిఫ్‌నగర్ ప్రాంతాలకు చెందిన ఒక్కొక్కరు మరణించినట్టుగా నమోదైందన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ నగరానికి చెందిన సమాచారాన్ని వెల్లడించారు. పాఠశాలలు, హాస్టళ్లు, అంగన్‌వాడీ కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఫ్లూ సోకిన వారిని జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డుల్లో ప్రత్యేకంగా ఉంచి చికిత్స చేయిస్తున్నట్టు తెలిపారు. బుధవారం నగరంలో 42 కేసులు నమోదుకాగా ఇందులో 30 కేసులు కార్పొరే ట్ ఆస్పత్రుల్లో ఉన్నట్టు చెప్పారు. ఉస్మానియాలో 2, గాంధీ 10 కేసులు నమోదైనట్లు నిర్మల తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ బుద్ధప్రసాద్, వైద్య విధాన పరిషత్ కమిషన ర్లు, ఇన్‌చార్జి జేసీ సంజీవయ్య, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి వెంకటేశ్వరరావు, ఇమ్యూనైజేషన్ జిల్లా అధికారి శ్రీహర్ష తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement