ఆలోచనలకు పురుడు పోసే అద్భుత దీపం
టి-హబ్ భవనాన్ని ప్రారంభించిన రతన్ టాటా
దేశానికి ముఖచిత్రంగా మారనుందని ప్రశంస
పరిశ్రమలకు కావాల్సింది మంచి ఆలోచనలని వెల్లడి
గొప్ప ఆవిష్కరణలకు వేదిక కావాలి: గవర్నర్ నరసింహన్
గూగుల్, ఫేస్‌బుక్, ట్వీటర్ తర్వాత కొత్త ఆవిష్కరణ ఇక్కడ్నుంచే రావాలి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టి-హబ్ దేశానికి ముఖ చిత్రంగా మారనుందని టాటా సంస్థల గౌరవ చైర్మన్ రతన్ టాటా అన్నారు. రూ.40 కోట్ల వ్యయంతో గచ్చిబౌలిలోని ట్రిపుల్‌ఐటీ ప్రాంగణంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన టి-హబ్ భవనాన్ని గురువారం ఆయన ప్రారంభించా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘నవ భారత నిర్మాణానికి నూతన ఆలోచనలే ఆధారం. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను, సైంటిస్టులను ప్రభుత్వాలు ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.
పరిశ్రమలకు స్థాపనకు కావాల్సింది డాలర్లు కాదు. మంచి ఆలోచనలు ఉంటే చాలు’’ అని అన్నారు. టి-హబ్ భ వనంలోని అన్ని అంతస్థులను రతన్‌టాటా పరిశీలించారు. కార్యక్రమానికి హాజరైన స్టార్టప్స్ ప్రతి నిధులు, మీడియా ప్రతినిధులతో ముచ్చటిం చారు. ఏదైనా ఉత్పత్తిని విభిన ్నంగా తయారు చేయడం ద్వారానే అది ప్రజల మన్నన పొందుతుందని చెప్పారు. కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ.. కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించిన 17 నెలల కాలంలోనే తెలంగాణ టి-హబ్ వంటి గొప్ప ఆవిష్కరణను తేవడం అభినందనీయమన్నారు. ఎన్నో మంచి ఆలోచనలు ప్రోత్సాహం లేక కళాశాలల్లోనే మరణిస్తున్నాయని వ్యాఖ్యానించారు.
విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్‌లర్లు, కళాశాలల ప్రిన్సిపల్స్ టి-హబ్‌ను సందర్శించేలా చేసి, యువత ఆలోచనలకు ప్రోత్సాహం అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. పట్ట ణ ప్రాంతాలతో పాటు గ్రామీణుల నైపుణ్యాన్ని కూడా గుర్తించాలని, గ్రామీణ పరిశ్రమలకు కూడా ప్రోత్సాహం కల్పించాలని సూచిం చారు. యువత ఆలోచనల నుంచి గొప్ప ఆవి ష్కరణలను తెచ్చేందుకు టి-హబ్ ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. ఐటీతో పాటు తాగునీరు, ఇంధనం, ఆరోగ్య రంగాల్లో ఆవిష్కరణలు అవసరమన్నారు. సామాన్యుడికి ఉపకరించే సామాజిక ఆవిష్కరణలపైనా శ్రద్ధ చూపాలన్నారు. టి-హబ్ ప్రయోగం విజ యవంతమై ట్రెండ్ సెట్టర్‌గా నిలవాలన్నారు.
యువతకు సరైన వేదిక: కేటీఆర్
భారతీయులు వారి సామర్థ్యాలను వినియోగించి అనేక దేశాల్లో సేవలందిస్తున్నారని, దేశీయంగా మాత్రం వారికి సరైన అవకాశం కల్పించలేకపోయామని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. 60 లక్షల మంది యువత ఉన్న మన దేశంలో.. వారి ఆలోచనలను ఆవిష్కరించుకునే అవకాశాన్ని ఇప్పటివరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అందించలేదన్నారు. 29వ రాష్ట్రంగా కొత్తగా ఏర్పడిన తెలంగాణలో టి-హబ్ రూపంలో ప్రభుత్వం సరైన వేదికను యువతకు అందించిందన్నారు. కేవలం హైదరాబాద్, తెలంగాణ యువతకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న యంగ్‌మైండ్స్‌కు టి-హబ్‌లో అవకాశం కల్పిస్తున్నామన్నారు. గూగుల్, ఫేస్‌బుక్, ట్వీటర్ తర్వాత వచ్చే కొత్త ఆవిష్కరణ ఇండియా నుంచే కావాలన్నది త న అభిమతమని పేర్కొన్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ మాట్లాడుతూ.. యువతలోని ఆలోచనలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం టి-హబ్ నిర్మించిందన్నారు. టి-హ బ్ ప్రారంభం తెలంగాణకు శుభ పరిణామమని నాస్కామ్ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి చెప్పారు. ప్రపంచ స్థాయి సదుపాయాలతో 200 స్టార్టప్స్‌కు చెందిన 800 మందికి ఇక్కడ అవకాశం ఉందన్నారు. దేశంలో మిలియన్ల కొద్దీ ఆలోచనలు కలిగిన బిలియన్ మైండ్స్ ఉన్నాయని పేర్కొన్నారు. వివిధ టెక్నాలజీల సమ్మేళనంతో వినూత్న అవిష్కరణలకు టి-హబ్ దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఎ.గాంధీ, టి-హబ్ బోర్డ్ ఆఫ్ డెరైక్టర్లు శ్రీనిరాజు, అని త్‌రామ్, పీజే నారాయణన్, శశిరెడ్డి, వాణి కొల్లా తదితరులు పాల్గొన్నారు.
విలేకరులు, స్టార్టప్స్ ప్రతినిధులతో టాటా ముచ్చటించారు. విశేషాలివీ..
పశ్న: దేశంలో మత సామరస్యంపై మీ స్పందన ఏంటి? ఇటీవలి ఘటనలపై ఏమంటారు?
రతన్: దేశంలో అన్ని మతాల వారు కలసిమెలసి నివసిస్తున్నారు. శతాబ్దాలుగా మతసామరస్యం పరిఢవిల్లుతోంది. భవిష్యత్తులోనూ ఇది కొనసాగుతుంది. ఇటీవల జరిగిన ఘటనలపై స్పందించను.
ప్ర: భవిష్యత్తులో ఎలాంటి పరిశ్రమలకు అవకాశాలున్నాయి?
రతన్: ఈ కామర్స్, రిటైల్ రంగాలే కాకుండా మెడికల్, హెల్త్‌కేర్, లైఫ్ సెన్సైస్, త్రీడీ ప్రింటింగ్ రంగాల్లో మంచి అవకాశాలుంటాయి.
ప్ర: స్టార్టప్స్ ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నాయి?
రతన్: డబ్బు సంపాదన కోసమే వచ్చే స్టార్టప్స్ అన్నీ విజయవంతం కావు. సమాజంలో అందరికీ అన్ని వసతులు అందుబాటులో ఉండడం లేదు. ఈ అంతరాన్ని తగ్గించేలా స్టార్టప్స్ దృష్టి పెడితే మంచిది.
ప్ర: స్టార్టప్స్‌కు మీ వైపు నుంచి ఎలాంటి సహకారం లభిస్తుంది?
రతన్: దేశం పలు రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించినా ఎంటర్‌ప్రైన్యూర్ దేశంగా భారత్ నమోదు కాలేకపోయింది. స్టార్టప్స్ ద్వారా ఆ ఘనత సాధించేందుకు వీలు దొరుకుతుంది. స్టార్టప్స్‌కు నా తరపున సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నా. మన దేశం తన టైగర్ పవర్‌ను ప్రపంచానికి చూపే సమయం ఆసన్నమైంది.
ప్ర: ఇంత పెద్ద టాటా గ్రూప్‌ను ఎలా స్థాపించగలిగారు?
రతన్: నేను బాధ్యతలు చేపట్టే నాటికే టాటా గ్రూప్ పెద్ద కంపెనీ. దాన్ని మరికొంత అభివృద్ధి చేశానంతే!
ప్ర: నానో కారు ఎందుకు ఫెయిలైంది?
రతన్: ఇతర కార్లతో దాన్ని పోల్చిడం వల్ల. అందుకే అది పోటీలో నిలవలేదన్నట్లుగా అనిపిస్తోంది. కానీ భద్రతకు, అన్ని రకాల వాతావరణాలకు అది అనువైనదని నేను ఇప్పటికీ భావిస్తున్నాను.
ప్ర: టాటామోటార్స్ అభివృద్ధికి మీరేమైన సలహా ఇస్తారా?
రతన్: ప్రస్తుతం నేను అందులో లేను. కనుక సలహాలివ్వను
ప్ర: మిమ్మల్ని బాగా ఉత్తేజపరిచిన సంఘటన ఏమిటి?
రతన్: సారీ.. ఇంత పబ్లిగ్గా అడిగితే ఎలా చెప్పగలను!
ప్ర: టి-హబ్‌లో మీరేమైనా పెట్టుబడులు పెడుతున్నారా?
రతన్: ప్రస్తుతం ఇంకా అలాంటి ఆలోచనలు చేయలేదు