టార్గెట్ ధూల్‌పేట | Target dhulpeta | Sakshi
Sakshi News home page

టార్గెట్ ధూల్‌పేట

Published Thu, May 19 2016 3:52 AM | Last Updated on Mon, Aug 20 2018 2:21 PM

టార్గెట్ ధూల్‌పేట - Sakshi

టార్గెట్ ధూల్‌పేట

♦ రాజధానిలో గుడుంబా అడ్డాపై ఆబ్కారీ శాఖ ప్రత్యేక దృష్టి
♦ తయారీదారులకు ప్రత్యామ్నాయ ఉపాధి కోసం కసరత్తు
 
 సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరంలోని ధూల్‌పేట నుంచి గుడుంబా మహమ్మారిని శాశ్వతంగా తరిమికొట్టే కార్యక్రమానికి ఆబ్కారీ శాఖ శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా గుడుంబా తయారీ, అమ్మకాలను నిషేధించే లక్ష్యంతో గత సంవత్సరం అక్టోబర్ నుంచి ‘గుడుంబా రహిత జిల్లాల ప్రక్రియ’ హైదరాబాద్, వరంగల్ జిల్లాల్లో మినహా పూర్తయింది. ఈ క్రమంలో రాజధాని అడ్డాగా దశాబ్దాలుగా ధూల్‌పేటలో పరిశ్రమగా సాగుతున్న గుడుంబా తయారీకి చెక్  పెట్టే అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఇందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇటీవల ఓ కమిటీని ఏర్పాటు చేసింది. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా గోషామహల్ ఎమ్మెల్యే, ఆబ్కారీ శాఖ డెరైక్టర్, ధూల్‌పేట ఈఎస్, హైదరాబాద్ డీసీ, ధూల్‌పేట, గోషామహల్, బేగంబజార్, జియాగూడ, మంగళ్‌హాట్, దత్తాత్రేయ నగర్, కార్వాన్ కార్పొరేటర్లతో కూడిన ఈ కమిటీ ప్రతిపాదనల ఆధారంగా తుది నిర్ణయం తీసుకోవాలని సర్కార్ భావిస్తోంది.

 వెయ్యి కుటుంబాలకు అదే ఆధారం...
 మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కొన్ని సామాజిక తెగలకు చెందిన వారు నిజాం సమయంలో ధూల్‌పేటకు వచ్చి స్థిరపడ్డారు. ప్రస్తుతం ఈ తెగలకు చెందిన సుమారు 5వేల కుటుంబాల్లో సగం గుడుంబా (నాటు సారా) తయారీపైనే ఆధారపడ్డాయి. గుడుం బాను ధూల్‌పేట నుంచి తరిమికొట్టాలని గతంలో ప్రభుత్వాలు చేసిన ప్రయత్నం విజయవంతం కాలేదు. ఈ పరిస్థితుల్లో దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఇక్కడ ప్రత్యామ్నాయ ఉపాధి కోసం నిధులు కేటాయించడమే కాకుండా, వారికి బ్యాంకు రుణాలు ఇప్పించే  ప్రయత్నం చేశారు.

తరువాత కాలంలో రుణాలు పొందిన సుమారు 500 మంది తిరిగి బ్యాంకర్లకు చెల్లించలేదు. 80 శాతం కుటుంబాలు అదే దందా సాగిస్తున్నాయి. వివిధ కారణాలతో చాలా మంది దీనికి దూరమైనా... ప్రస్తుతం 1000 కుటుంబాలు ఈ దందాపై ఆధారపడ్డట్టు ఆబ్కారీ శాఖ అంచనా వేస్తోంది. వీరిలో ఒక్కో కుటుంబం నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేసి, ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించే అవకాశాలను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఈ సంక్షేమ నిధి కింద ఉన్న రూ.4.5 కోట్లతో నైపుణ్య శిక్షణ ద్వారా ఉద్యోగావకాశాలు పెంపొందించాలని యోచిస్తున్నారు. జిల్లా కలెక్టర్‌తో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని, ధూల్‌పేటలో గుడుంబాను పూర్తిగా నిర్మూలించేందుకు కృషి చేస్తామని హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ వివేకానందరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. కాగా మద్య నిషేధం, గుడుంబా అరికట్టడంపై టెలీఫిల్మ్‌లను రూపొందించి వివిధ ప్రసార సాధనాల ద్వారా ప్రచారం చేయాలని ఆబ్కారీ కమిషనర్ నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement