
‘కోటి’ ఆశల యజ్ఞం
కోటి ఎకరాలకు సాగునీరిచ్చే ప్రణాళికను ఆవిష్కరించిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: లక్ష కోట్ల ఖర్చు.. కోటి ఎకరాలకు పైగా సాగునీరు.. ఈ బృహత్తర లక్ష్యాన్ని చేరుకునేందుకు అనుసరించబోతున్న కార్యాచరణను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా వెల్లడించింది. గురువారం శాసనసభకు సమర్పించిన నివేదికల్లో పలు కీలక అంశాలను ప్రస్తావించింది. ప్రస్తుతం నిర్మాణంలోని ప్రాజెక్టుల పరిధిలో ఆయకట్టు ఎంత? కొత్త ప్రాజెక్టులతో సాగులోకి వచ్చేది ఎంత? ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్.. తదితర అంశాలను అందులో పొందుపరిచారు. ఆ వివరాలివీ..
1.13 కోట్ల ఎకరాల ఆయకట్టు లక్ష్యం
రాష్ట్రంలో ఇప్పటికే నిర్మించిన భారీ, మధ్యతరహా ప్రాజెక్టులతో పాటు కొత్తగా చేపడుతున్న ప్రాజెక్టుల ద్వారా మొత్తంగా 1.13కోట్ల ఎకరాలను సాగులోకి తేవాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. ఇందులో నిర్మాణం పూర్తయిన ప్రాజెక్టుల కింద 48.22 లక్షల ఎకరాలు ఉండగా, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల ద్వారా మరో 65.32 లక్షల ఎకరాలను సాగులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకుంది.