సాక్షి, హైదరాబాద్: కృష్ణా నది బేసిన్ పరిధిలోని ప్రాజెక్టుల నిర్వహణపై బోర్డుకే పెత్తనం ఇవ్వాలని కోరుతూ కృష్ణా బోర్డు కేంద్ర జల వనరుల శాఖకు పంపిన ముసాయిదా నోటిఫికేషన్‌పై తెలంగాణ గుర్రుగా ఉంది. ప్రాజెక్టులపై బోర్డు పెత్తనం అక్కర్లేదని ఇప్పటికే పలుమార్లు విన్నవించినా మళ్లీ పాత పాటే పాడటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుత ముసాయిదాను కేంద్ర జలవనరుల శాఖ నోటిఫై చేస్తే ప్రాజెక్టులపై పెత్తనమంతా బోర్డు చేతిలోకి వెళ్లనున్న నేపథ్యంలో దీనిపై తీవ్రంగా స్పందించింది.
బోర్డు లేఖ అంశమై శనివారం ప్రభుత్వ సీఎస్ ఎస్‌కే జోషి సచివాలయంలో అధికారులతో చర్చించారు. ఈ భేటీకి ఈఎన్‌సీలు మురళీధర్, నాగేంద్రరావు, అంతర్రాష్ట్ర విభాగం అధికారులు కోటేశ్వర్‌రావు, అజయ్‌కుమార్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బోర్డు పరిధిపై నోటిఫికేషన్ ఇవ్వడాన్ని భేటీలో ముక్తకంఠంతో వ్యతిరేకించారు.
ఎలాంటి నోటిఫై చేయరాదంటూ కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి ఉపేంద్ర ప్రసాద్‌సింగ్‌కు లేఖ రాశారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89(ఎ), (బి)ల ప్రకారం ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు లేవని, నీటి కేటాయింపులకు సంబంధించిన అంశాలు బ్రజేశ్ ట్రిబ్యునల్ పరిశీలనలో ఉన్నందున బోర్డు నియంత్రణ అన్న ప్రశ్నే ఉదయించదని స్పష్టం చేశారు.
ఇదే చట్టంలోని 85(8), 87(1) సెక్షన్‌ల ప్రకారం కృష్ణా బోర్డు కేవలం ట్రిబ్యునల్‌లు ఇచ్చిన నిర్ణయాన్ని మాత్రమే అమలుపరచాలి తప్ప నోటిఫికేషన్‌ను తయారు చేయలేదని ఆ లేఖలో వెల్లడించారు. బోర్డు వెలువరించిన నోటిఫికేషన్‌ను నోటిఫై చేయకుండా, రాష్ట్రాల అభిప్రాయాలు తెలుసుకున్నాకే స్పందించాలని కేంద్రానికి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.
బోర్డు అధికారాలపై ప్రధాన చర్చ..
ప్రాజెక్టులను తన నియంత్రణలోకి తెచ్చుకునే విషయమై కృష్ణా బోర్డు వర్కింగ్ మాన్యువల్ సిద్ధంచేసి, నోటిఫికేషన్ కోసం కేంద్రానికి పంపగా, దాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులు కేంద్రం దృష్టికి తీసుకెళ్లి బ్రజేశ్ ట్రిబ్యునల్ నిర్ణయం వచ్చేవరకు ఆమోదించరాదని కోరిన విషయాలని సీఎస్‌తో జరిగిన భేటీలో అధికారులు గుర్తు చేశారు.
బ్రజేశ్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి రానందున బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన నీటిని, ఉమ్మడి ఏపీలో చేసుకున్న తాత్కాలిక ఏర్పాట్ల మేరకు ఆయా రాష్ట్రాలు తమ సరిహద్దుల్లో తమ అవసరాల మేరకు ఎక్కడైనా వాడుకునేలా మాత్రమే చూడాలని, ప్రాజెక్టుల వారీగా ప్రత్యేక కేటాయింపులు చేయని పక్షంలో బోర్డు కేవలం నీటి వినియోగ అమలును మాత్రమే చూడాల్సి ఉంటుందని తెలిపారు. అవే అంశాలపై కేంద్రానికి లేఖ రాశారు.
Comments
Please login to add a commentAdd a comment