కాలిఫోర్నియాతో తెలంగాణ ఎంఓయూ
► సంప్రదాయేతర ఇంధన రంగంలో పరస్పర సహకారం
► కాలిఫోర్నియా గవర్నర్ జెర్రీ బ్రౌన్‌తో కేటీఆర్ భేటీ
సాక్షి, హైదరాబాద్: సంప్రదాయేతర ఇంధన వనరుల రంగంలో పరస్పర సహకారం కోసం తెలంగాణ ప్రభుత్వంతో.. కాలిఫోర్నియా అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. అమెరికాలో పర్యటిస్తున్న రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కే తారక రామారావు గురువారం కాలిఫోర్నియా గవర్నర్ ఎడ్మండ్ జెర్రీ బ్రౌన్‌తో సమావేశమయ్యారు. ఇద్దరి సమక్షంలో జరిగిన ఒప్పంద కార్యక్రమంలో తెలంగాణ జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో క్లీన్ ఎనర్జీ మినిస్టీరియల్ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో ఇరు పక్షాలమధ్య ఈ ఒప్పందం కుదరడం ప్రాధాన్యం సంతరించుకుంది. మినిస్టీరియల్ సమావేశానికి ప్రపంచ వ్యాప్తంగా 13 ప్రాంతాలకు ఆహ్వానం అందగా.. భారత్ నుంచి కేవలం తెలంగాణకు మాత్రమే చోటు దక్కింది.
లింక్డ్‌ఇన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌కు ఆహ్వానం: లింక్డ్‌ఇన్ సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రీడ్ హాఫ్‌మెన్‌తో మంత్రి కేటీఆర్ గురువారం భేటీ అయ్యారు. భారతదేశంలో లింక్డ్ ఇన్ విస్తరణ ప్రణాళికలపై ఆరా తీసిన మంత్రి.. కంపెనీ ప్రణాళికల్లో తెలంగాణకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ పర్యటనకు రావాల్సిందిగా హాఫ్‌మెన్‌ను ఆహ్వానించారు. దీనికి సానుకూలంగా స్పందించిన హాఫ్‌మెన్, వచ్చే ఏడాది తమ కంపెనీ ప్రతినిధి బృందంతో కలసి హైదరాబాద్ పర్యటనకు వస్తామని తెలిపారు.
అనంతరం కేటీఆర్, శాన్‌ఫ్రాన్సిస్కోలోని ప్రఖ్యాత సాఫ్ట్‌వేర్ కంపెనీ సేల్స్‌ఫోర్స్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. హైదరాబాద్‌లో ఐటీ కంపెనీల కార్యకలాపాల విస్తరణకు ఉన్న అవకాశాలను సేల్స్‌ఫోర్స్ ప్రతినిధులకు వివరించారు.