సాక్షి, హైదరాబాద్
రాష్ట్రంలో వివిధ వృత్తి విద్య, సాంకేతిక కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యా మండలి ఖరారు చేసింది. 2018–19 విద్యా సంవత్సరంలో అన్ని ప్రవేశ పరీక్షలను ఆన్‌లైన్ విధానంలోనే నిర్వహించాలని నిర్ణయించింది. ఎంసెట్‌ను 2018 మే 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. రెండు దఫాలుగా 25 వేల మంది చొప్పున రోజుకు 50 వేల మందికి ఎంసెట్ పరీక్ష నిర్వహించేలా షెడ్యూల్ ఖరారు చేసినట్లు చెప్పారు. ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం దాదాపు 1.4 లక్షల మంది పరీక్షకు హాజరయ్యే అవకాశముందని, అగ్రికల్చర్ కోసం మరో 50 వేల మంది వరకు హాజరవుతారని వివరించారు. మిగతా సెట్స్ తేదీలను కూడా ప్రకటించారు.
ప్రాక్టీస్ కోసం మాక్ టెస్టులు
ప్రవేశ పరీక్షలను మొదటిసారిగా ఆన్‌లైన్ విధానంలో నిర్వ హిస్తున్నందున విద్యార్థులు ప్రాక్టీస్ చేసుకునేందుకు అవకా శాన్ని కల్పించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇబ్బంది పడ కుండా, ఎక్కువ రోజులు ప్రాక్టీస్ చేసుకునేందుకు వీలుగా.. వచ్చే నెల మొదటి లేదా రెండో వారం నుంచే ఆన్‌లైన్‌లో మాక్ టెస్టులను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఇక ఆన్‌లైన్ ప్రవేశ పరీక్షలను టీసీఎస్ సంస్థ సాంకేతిక సహకారంతో తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ (టీఎస్‌టీఎస్) నేతృత్వంలో నిర్వహించేలా ఇప్పటికే ఉన్నత విద్యా మండలి ఒప్పందం చేసుకుంది. సెట్స్ కన్వీనర్లను ప్రకటించాక ఆయా సెట్స్ కమిటీలు పరీక్షల నిర్వహణకు టీసీఎస్‌తో ఒప్పందాలు చేసుకుంటాయి. ఆ సమయంలో సెట్స్ ఫీజులు ఖరారు కానున్నాయి. అయితే ఆన్‌లైన్‌లో పరీక్షల నిర్వహణ, జీఎస్టీ నేపథ్యంలో.. ఫీజుల భారం కొంత ఎక్కువగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
పాత కన్వీనర్లకే బాధ్యతలు!
ఏయే యూనివర్సిటీల ఆధ్వర్యంలో ఏయే ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో.. సెట్స్ కన్వీనర్ల ఖరారుపై ఉన్నత విద్యా మండలి చర్యలు చేపట్టింది. కన్వీనర్‌గా నియామకం కోసం ముగ్గురితో కూడిన జాబితాలు ఇవ్వాలని ఆయా వర్సిటీలకు లేఖలు రాసింది. దీంతో ఒక్క ఐసెట్ మినహా మిగతా సెట్స్‌కు సంబంధించిన జాబితాలు ఇప్పటికే ఉన్నత విద్యా మండలికి చేరినట్లు తెలిసింది. అయితే గతంలో సెట్స్‌కు కన్వీనర్లుగా వ్యవహరించిన వారికే ఈసారి కూడా బాధ్యతలు అప్పగించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఈ లెక్కన ఎంసెట్‌కు జేఎన్టీయూ రిజిస్ట్రార్ యాదయ్య, పీఈసెట్‌కు వి.సత్యనారాయణ, ఈసెట్‌కు గోవర్ధన్, ఎడ్‌సెట్‌కు మధుమతి, పీజీఈసెట్‌కు సమీనా ఫాతిమా, లాసెట్‌కు ద్వారకానాథ్ కన్వీనర్లుగా బాధ్యత అప్పగించే అవకాశ ముంది. లాసెట్, ఐసెట్ లను నిర్వహించిన కన్వీ నర్లు రిటైరైన నేపథ్యంలో కొత్తవారికి బాధ్యత అప్ప గించే అవకాశముంది. దీనిపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో చర్చించాక నిర్ణయం తీసుకోవాలని మండలి భావిస్తోంది.
పేపర్ లీక్ సమస్యలకు చెక్
జాతీయ స్థాయి పరీక్షలకు అనుగుణంగా పరీక్షల నిర్వహణ విధానంలో మార్పులు తీసుకువచ్చినట్లు పాపిరెడ్డి తెలిపారు. జాతీయ స్థాయిలో నిర్వహించే పోటీ పరీక్షలను ఆన్‌లైన్ విధానంలోనే నిర్వహిస్తున్నందున రాష్ట్రంలోనూ అమలు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఈ విధానం వల్ల పేపర్ లీక్ వంటి ప్రధాన సమస్యలకు చెక్ పెట్టవచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment