హైదరాబాద్: రాజ్యాంగ విరుద్దంగా జరుగుతున్న పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని తెలంగాణ పీసీసీ నిర్ణయించింది. గాంధీభవన్‌లో గురువారం టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి న్యాయ నిపుణులతో సమావేశమయ్యారు. రాజ్యాంగబద్దంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వం అదే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నదని ఈ సందర్భంగా ఉత్తమ్ విమర్శించారు. ఇప్పటికే అన్ని ప్రజాస్వామిక వేదికలపైనా ఫిర్యాదులు చేసినా ఫలితం లేదన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లజ్జగా రాజకీయ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఆయన విమర్శించారు. సచివాలయం, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వేదికలుగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ, టీఆర్‌ఎస్ కండువాలను కప్పుతున్నారని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాలపై ఇప్పటికే రాజ్యాంగ బద్దంగా ఏర్పాటైన అన్ని వేదికలకు ఫిర్యాదులు చేశామని ఉత్తమ్ చెప్పారు.
రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి, యధేచ్చగా ఫిరాయింపులకు పాల్పడుతున్నారని, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న అంశాల ఆధారంగా తాము సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 28 వరకు సుప్రీంకోర్టుకు సెలవులు ఉన్నందున, సెలవులు పూర్తయిన వెంటనే సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామన్నారు.
ఇటీవల పార్టీ మారిన నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డిపై లోక్‌సభ స్పీకరుకు ఫిర్యాదు చేస్తామన్నారు. గుత్తాపైనా సుప్రీంకోర్టులో కేసు వేస్తామని ఉత్తమ్ ప్రకటించారు. రాజకీయ ఫిరాయింపులను అడ్డుకునే విధంగా న్యాయపోరాటం చేస్తామన్నారు. న్యాయనిపుణులతో జరిగిన ఈ సమావేశంలో శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ, పార్టీ సీనియర్లు డి.కె.అరుణ, సబితా ఇంద్రా రెడ్డి, సంపత్‌ఖుమార్, మర్రి శశిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.