మే 2న తెలంగాణ ఎంసెట్!
నేడు లేదా రేపు సెట్స్ తేదీలను ప్రకటించే అవకాశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం నిర్వహించే ఎంసెట్-2016 పరీక్ష తేదీలపై ఉన్నత విద్యా మండలి కసరత్తు చేస్తోంది. ఏపీలో మే 5న ఎంసెట్ నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో.. అంతకన్నా ముందే మే 2న తెలంగాణలో ఎంసెట్ నిర్వహించాలన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఎంసెట్‌తోపాటు వివిధ ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) నిర్వహణ తేదీలపై మంగళవారం మండలి చైర్మన్ పాపిరెడ్డి అధ్యక్షతన వైస్ చైర్మన్లు వెంకటాచలం, మల్లేశ్, కార్యదర్శి శ్రీనివాసరావు, ఇతర అధికారులు సమావేశమై చర్చిం చారు.
మే 5నే కర్ణాటకకు చెందిన ఓ ప్రవేశపరీక్ష ఉండటంతో ఏపీ ఉన్నత విద్యామండలి తమ పరీక్ష తేదీని మార్చే అవకాశముందని.. కాబట్టి మే 2న తెలంగాణ ఎంసెట్‌ను నిర్వహిస్తే బాగుంటుందని చర్చించినట్లు సమాచారం. దీనివల్ల రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు రెండు చోట్లా ఎంసెట్‌కు హాజరు కావచ్చనే భావన వ్యక్తమైంది. మే 2న వీలుకాని పరిస్థితి ఉంటే అదే నెల 9న పరీక్షను నిర్వహించే అంశాన్నీ పరిశీలించినట్లు తెలిసింది. ఏపీలో పలు ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేయగా... ఆ తేదీల్లో కాకుండా వేర్వేరు తేదీల్లో ఎడ్‌సెట్, ఐసెట్, ఈసెట్, లాసెట్, పీజీఈసెట్‌లను నిర్వహించాలని నిర్ణయించారు. దీనిపై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి బుధవారం లేదా గురువారం సెట్స్ తేదీలను ప్రకటించే అవకాశముంది.