EAMCET-2016
-
మాకొద్దంటే మాకొద్దు
ఎంసెట్ కన్వీనర్ బాధ్యతలు తీసుకునేందుకు సీనియర్ ప్రొఫెసర్ల వెనుకంజ ఇతర సెట్లదీ అదే పరిస్థితి 2016 ఎంసెట్ లీకేజీ నేపథ్యంలో కొత్త కన్వీనర్ల ఎంపికలో జాగ్రత్తలపై దృష్టి సాక్షి, హైదరాబాద్: ఎంసెట్–2016 లీకేజీ నేపథ్యంలో ఎంసెట్–2017 కన్వీనర్ బాధ్యతలు స్వీకరించేందుకు సీనియర్ ప్రొఫెసర్లే జంకుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా లీకేజీ ఎక్కడ ఎలా జరుగుతుందో తెలియని పరిస్థితుల నేపథ్యంలో.. కష్టపడి పని చేసి, అభాసుపాలు కావడమెందుకన్న ధోరణి ప్రొఫెసర్లలో ఏర్పడింది. అందుకే ఈసారి ఎంసెట్ కన్వీనర్‌గా బాధ్యతలు స్వీకరించేందుకు సీనియర్ ప్రొఫెసర్లు అంతగా సానుకూలత వ్యక్తం చేయడం లేదని తెలిసింది. ఎంసెట్‌ను నిర్వహించే జేఎన్టీయూహెచ్లోని ఏ ప్రొఫెసర్‌కు ఎంసెట్ నిర్వహణ బాధ్యతలు అప్పగించాలన్న విషయంలో వర్సిటీ కూడా తర్జనభర్జన పడుతోంది. ఎంసెట్–2017 నిర్వహణ బాధ్యతలను జేఎన్టీయూహెచ్కు అప్పగిస్తూ ఇటీవల తెలంగాణ ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇపుడు ఎంసెట్ కన్వీనర్‌గా బాధ్యతలు అప్పగించేందుకు ముగ్గురి పేర్లను జేఎన్టీయూహెచ్ ఉన్నత విద్యా మండలికి సిఫారసు చేయాల్సి ఉంది. అయితే ఈ విషయంలో గతంలో ఎంసెట్‌ను నిర్వహించిన ప్రొఫెసర్లు, ఇతర ప్రొఫెసర్లతో జేఎన్టీయూ హెచ్ సంప్రదింపులు జరుపుతోంది. అయితే గతంలో కన్వీనర్లుగా వ్యవహరించిన ప్రొఫెసర్ ఎన్వీ రమణరావు, ప్రొఫెసర్ యాదయ్య ఈ విషయంలో పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలిసింది అయితే యూనివర్సిటీ మాత్రం వారిద్దరితోపాటు మరొకరి పేరును సిఫారసు చేసే అవకాశం ఉందని వర్సిటీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకటీ రెండు రోజుల్లో ఎంసెట్ కన్వీనర్ ఎవరన్న విషయంలో స్పష్టత రానుంది. మరోవైపు ఈసారి ఎంసెట్ నిర్వహణ విషయంలో గతంలో కంటే మరింత పకడ్బం దీ చర్యలు చేపట్టాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. ఆ దిశగా యూనివర్సిటీకి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ప్రస్తుత జేఎన్టీయూహెచ్ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి ఎంసెట్–2017కు చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఈసారి సెట్స్‌కు కొత్త కన్వీనర్లే! మరోవైపు ఇతర ప్రవేశ పరీక్షల నిర్వహణ విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొన్నట్లు తెలిసింది. దీంతో మొత్తానికి ఈసారి సెట్స్‌కు పాత వారికంటే కొత్త కన్వీనర్లే ఎక్కువ మంది ఉండే అవకాశం ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించే ఎడ్‌సెట్, పీజీఈసెట్, పీఈసెట్‌కు కొత్త కన్వీనర్లే వచ్చే అవకాశం ఉంది. గత ఏడాది ఎడ్‌సెట్ నిర్వహించిన ప్రొపెసర్ ప్రసాద్, పీఈసెట్ నిర్వహించిన ప్రొఫెసర్ ప్రభాకర్ రావు పదవీ విరమణ పొందారు. గత ఏడాది పీజీఈసెట్ నిర్వహించిన ప్రొఫెసర్ రామచంద్రం ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ అయ్యారు. దీంతో ఆ మూడు సెట్ల నిర్వహణ బాధ్యతలను కొత్తవారికే అప్పగించే అవకాశం ఉంది. కాకతీయ యూనివర్సిటీకి అప్పగించిన ఐసెట్, లాసెట్, పీజీలాసెట్‌ను గత ఏడాది నిర్వహించిన ప్రొఫెసర్ ఓంప్రకాశ్, ప్రొఫెసర్ రంగారావులకే అప్పగించే అవకాశం ఉంది. -
తెలంగాణ ఎంసెట్ మెడికల్ పరీక్ష ప్రారంభం
హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్-2016 మెడికల్ పరీక్ష ఆదివారం మధ్యాహ్నం ప్రశాంతంగా ప్రారంభమైంది. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు పరీక్ష జరగనుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ పరీక్షకు మొత్తం 190 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటుచేశారు. మొత్తం 1,01,005 మంది విద్యార్థులు మెడికల్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. మెడికల్ సెట్ కోడ్ 'ఎస్' ప్రశ్నాపత్రాన్ని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి ఎంపిక చేశారు. తొలిసారిగా ఎంసెట్ పరీక్షకు బయో మోట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నారు. నిమిషం నిబంధనను అధికారులు పటిష్టంగా అమలుజేశారు. పలు సెంటర్లలో ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను అధికారులు పరీక్ష సెంటర్లలోనికి అనుమతించలేదు. -
ఇంజినీరింగ్‌కు 92.34 శాతం మంది హాజరు
హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్-2016 ఇంజినీరింగ్ ప్రవేశపరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 1,43,524 మంది విద్యార్థులు ఇంజినీరింగ్ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా అందులో 92.34 శాతం మంది విద్యార్థులు ఆదివారం ఉదయం పరీక్షకు హాజరయ్యారు. 11,068 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైయారు. తొలిసారిగా బయో మోట్రిక్ విధానాన్ని అమలుచేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. ఎంసెట్ మెడికల్, అగ్రికల్చర్ పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు జరగనుంది. మెడికల్ పరీక్షకు సెట్ కోడ్ 'ఎస్' ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. -
తెలంగాణ ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్ష ప్రారంభం
హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్-2016 ఇంజినీరింగ్ పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ పరీక్షకు మొత్తం 276 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటుచేశారు. వీటికి అదనంగా ఆన్ లైన్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం హైదరాబాద్‌లో మూడు, వరంగల్‌లో ఒక పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 1,43,524 మంది విద్యార్థులు ఇంజినీరింగ్ పరీక్ష రాయనున్నారు. ఇంజినీరింగ్ సెట్ కోడ్ 'క్యూ' ప్రశ్నాపత్రాన్ని ఆదివారం ఉదయం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఎంపిక చేశారు. తొలిసారిగా బయో మోట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నారు. నిమిషం నిబంధనను అధికారులు పటిష్టంగా అమలుజేశారు. పలు సెంటర్లలో ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను అధికారులు పరీక్ష సెంటర్లలోనికి అనుమతించలేదు. కూకట్పల్లి జేఎన్టీయూలో కల్యాణ్ అనే విద్యార్థి రెండు నిమిషాలు ఆలస్యంగా వచ్చాడు. దీంతో అధికారులు అతన్ని పరీక్షకు అనుమతించపోవడంతో వెనుదిరిగాడు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు మెడికల్, అగ్రికల్చర్ పరీక్ష జరగనుంది. -
మే 2న తెలంగాణ ఎంసెట్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్-2016 పరీక్షను మే 2వ తేదీన నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ గురువారం అధికారికంగా విడుదలకానుంది. మే 2వ తేదీ ఉదయం 10 గంటల నుండి ఒంటి గంట వరకు ఇంజినీరింగ్ పరీక్ష, మధ్యాహ్నం 2.30 గంటల నుండి 5.30 వరకు మెడిసిన్, అగ్రికల్చర్ పరీక్ష జరగనుంది. ఈ నెల 28 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తు స్వీకరణకు మార్చి 28వ తేదీ చివరి తేదీగా ఉంది. ఎస్సీ, ఎస్టీలకు రూ.250 రూపాయలు, ఇతరులకు రూ.500 దరఖాస్తు రుసుము చెల్లించాలి. ఏప్రిల్ 3 నుంచి 13 వరకు ఆన్లైన్లో తప్పుల సవరణకు అవకాశం కల్పిస్తారు. రూ.500ల ఫైన్‌తో ఏప్రిల్ 3 వరకు, రూ.వెయ్యి ఫైన్‌తో ఏప్రిల్ 13, రూ.5వేల ఫైన్‌తో ఏప్రిల్ 22వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏప్రిల్ 24 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకొనే అవకాశం కల్పించనున్నారు. మే 3న ప్రాధమిక కీ విడుదల, మే 12న ఎంసెట్ ఫలితాలు విడుదల చేయనున్నారు. మే 12న ఈ సెట్-2016 మార్చి 4వ తేదీన తెలంగాణ ఈ సెట్-2016 నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 9 నుంచి ఏప్రిల్ 12 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 12న ఈ సెట్ పరీక్ష, మే 23న ఫలితాలు వెల్లడించనున్నారు. -
మే 2న తెలంగాణ ఎంసెట్!
నేడు లేదా రేపు సెట్స్ తేదీలను ప్రకటించే అవకాశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం నిర్వహించే ఎంసెట్-2016 పరీక్ష తేదీలపై ఉన్నత విద్యా మండలి కసరత్తు చేస్తోంది. ఏపీలో మే 5న ఎంసెట్ నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో.. అంతకన్నా ముందే మే 2న తెలంగాణలో ఎంసెట్ నిర్వహించాలన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఎంసెట్‌తోపాటు వివిధ ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) నిర్వహణ తేదీలపై మంగళవారం మండలి చైర్మన్ పాపిరెడ్డి అధ్యక్షతన వైస్ చైర్మన్లు వెంకటాచలం, మల్లేశ్, కార్యదర్శి శ్రీనివాసరావు, ఇతర అధికారులు సమావేశమై చర్చిం చారు. మే 5నే కర్ణాటకకు చెందిన ఓ ప్రవేశపరీక్ష ఉండటంతో ఏపీ ఉన్నత విద్యామండలి తమ పరీక్ష తేదీని మార్చే అవకాశముందని.. కాబట్టి మే 2న తెలంగాణ ఎంసెట్‌ను నిర్వహిస్తే బాగుంటుందని చర్చించినట్లు సమాచారం. దీనివల్ల రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు రెండు చోట్లా ఎంసెట్‌కు హాజరు కావచ్చనే భావన వ్యక్తమైంది. మే 2న వీలుకాని పరిస్థితి ఉంటే అదే నెల 9న పరీక్షను నిర్వహించే అంశాన్నీ పరిశీలించినట్లు తెలిసింది. ఏపీలో పలు ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేయగా... ఆ తేదీల్లో కాకుండా వేర్వేరు తేదీల్లో ఎడ్‌సెట్, ఐసెట్, ఈసెట్, లాసెట్, పీజీఈసెట్‌లను నిర్వహించాలని నిర్ణయించారు. దీనిపై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి బుధవారం లేదా గురువారం సెట్స్ తేదీలను ప్రకటించే అవకాశముంది.