పల్లె నుంచి పట్నం దాకా.. | Telangana formation day to be celebrated on june 2 | Sakshi
Sakshi News home page

పల్లె నుంచి పట్నం దాకా..

Published Sun, May 8 2016 2:30 AM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

పల్లె నుంచి పట్నం దాకా.. - Sakshi

పల్లె నుంచి పట్నం దాకా..

ఘనంగా రాష్ట్రావతరణ ఉత్సవాలు
వేడుకల నిర్వహణపై సమావేశంలో అధికారులకు సీఎస్ ఆదేశం
ట్యాంక్‌బండ్ వద్ద తెలంగాణ అమరవీరుల స్తూపం
శంకుస్థాపన చేయనున్న సీఎం కేసీఆర్
సంజీవయ్య పార్కులో అతిపెద్ద త్రివర్ణ పతాకం ఆవిష్కరణ
పరేడ్ గ్రౌండ్‌లో ఉత్సవాలు.. ప్రసంగించనున్న కేసీఆర్

 
సాక్షి, హైదరాబాద్: పల్లె నుంచి పట్నం దాకా జూన్ 2న రాష్ట్రావతరణ వేడుకలను ఘనంగా నిర్వహించాలని, ప్రజలంతా పెద్ద ఎత్తున పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్‌శర్మ అధికారులను ఆదేశించారు. రాష్ట్రావతరణ ఉత్సవాల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో శనివారం సచివాలయంలో సీఎస్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తొలుత గన్‌పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పిస్తారన్నారు. తర్వాత ట్యాంక్‌బండ్ వద్ద తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం నిర్మాణానికి శంకుస్థాపన చేసి సంజీవయ్య పార్కులో అతిపెద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారన్నారు.
 
 అనంతరం పరేడ్ గ్రౌండ్‌లో జరిగే ఉత్సవాల్లో జాతీయ పతాకాన్ని సీఎం ఆవిష్కరించి ప్రసంగిస్తారని రాజీవ్‌శర్మ వివరించారు. పురస్కార గ్రిహీతలకు సర్టిఫికెట్ల ప్రదానం, కంటింజెంట్ల మార్చ్ ఫాస్ట్ ఉంటుందన్నారు. ఉత్సవాల ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు చేయాలని సమాచారశాఖను ఆదేశించారు. హైదరాబాద్‌లోని ప్రధాన ప్రాంతాల్లో హోర్డిం గ్‌లు, బెలూన్లు, విద్యుదీకరణ, పరిశుభ్రత, మొబైల్ టాయిలెట్ల ఏర్పాటు, ట్రాఫిక్ నియంత్రణ, పోలీసు బందోబస్తు, నిరంతర విద్యుత్ సరఫరా, మంచినీటి సరఫరా, అంబులెన్స్‌లు, వైద్య బృందాలు, బారికేడింగ్, అగ్నిమాపక యంత్రాల ఏర్పాట్లు, పుష్పాలంకరణ పనులు చేపట్టాలని సంబంధితశాఖల అధికారులను సీఎస్ ఆదేశించారు. గ్రామ పంచాయతీలు, మండల కార్యాలయాలు, జిల్లా పరిషత్, మున్సిపాలిటీలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లా ప్రధాన కార్యాలయాలు, రాష్ట్ర కార్యాలయాల్లో భారీగా వేడుకలు నిర్వహించాలన్నారు.
 
 వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాల్లో దుస్తుల పంపిణీ, ఆస్పత్రుల్లో పండ్లు, అంధ విద్యార్థులకు పరికరాల పంపిణీ, రక్తదాన శిబిరాలు తదితర కార్యక్రమాలు చేయాలన్నారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంజీ గోపాల్, ముఖ్య కార్యదర్శులు రాజేశ్వర్ తివారీ, అధర్ సిన్హా, రామకృష్ణారావు, సునీల్ శర్మ, రాజీవ్ త్రివేది, అదనపు డీజీలు తేజ్‌దీప్ కౌర్ మీనన్, సుదీప్ లక్టాకియా, పర్యాటకశాఖ కార్యదర్శి బి. వెంకటేశం, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, హెచ్‌ఎండీఏ కమిషనర్ టి.చిరంజీవులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement