రూ.1.51 లక్షల కోట్లు అప్పు కావాలి | telangana government asks to world bank Rs.1.51 lakh crores | Sakshi
Sakshi News home page

రూ.1.51 లక్షల కోట్లు అప్పు కావాలి

Published Fri, Aug 28 2015 1:34 AM | Last Updated on Sun, Sep 3 2017 8:14 AM

రూ.1.51 లక్షల కోట్లు అప్పు కావాలి

రూ.1.51 లక్షల కోట్లు అప్పు కావాలి

ఏడు కొత్త పథకాలకు రూ.1.50 లక్షల కోట్లు కావాలి
అందులో వీలైనంత మేర రుణం అందించండి
ప్రపంచ బ్యాంకు సాయం కోరిన తెలంగాణ సర్కారు
సీఎస్, ఉన్నతాధికారులతో వరల్డ్ బ్యాంక్ బృందంభేటీ
అన్ని పథకాలకు రుణం ఇవ్వలేమన్న బ్యాంకు
నిబంధనలకు లోబడి ఉన్న ప్రాజెక్టులకు రుణమిస్తామని వెల్లడి
బ్యాంకు రుణంతో కొనసాగుతున్న ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష
వాటర్ గ్రిడ్‌కు ప్రశంసలు
 
హైదరాబాద్: రాష్ట్రంలో అమలు చేస్తున్న భారీ పథకాలకు సుమారు రూ.1.50 లక్షల కోట్లు అవసరమవుతాయని తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుకు నివేదించింది. అందులో కొంత ఆర్థిక సాయం అందించాలని కోరింది. వరల్డ్ బ్యాంక్ కంట్రీ డెరైక్టర్ ఒన్నో రూల్ సారథ్యంలో 15 మంది ప్రతినిధుల బృందం గురువారం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు, వివిధ విభాగాల ఉన్నతాధికారులతో సమావేశమైంది. కేంద్ర ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీ రాజ్‌కుమార్ ఈ భేటీకి హాజరయ్యారు. సచివాలయంలో రెండు గంటలకుపైగా జరిగిన ఈ సమావేశంలో.. ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సాయంతో రాష్ట్రంలో అమలవుతున్న ప్రాజెక్టుల పురోగతి, కొత్త ప్రాజెక్టులకు కావాల్సిన రుణాలపై చర్చించారు. రాష్ట్రంలో కొత్తగా చేపట్టిన ఏడు పథకాలకు తగినంత ఆర్థిక సాయం అందించాలని ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందాన్ని కోరింది. ప్రధానంగా మిషన్ కాకతీయ, తెలంగాణ డ్రింకింగ్ వాటర్‌గ్రిడ్, ఈ-పంచాయతీలు, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై, హైదరాబాద్-వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్, ప్రభుత్వ హాస్టళ్లను రెసిడెన్షియల్ స్కూళ్లుగా మార్చటం, యాదాద్రి ప్లాంట్‌కు విద్యుత్తు లైన్లు, సౌర విద్యుత్తు ఉత్పత్తి ప్రాజెక్టులకు రుణం అందించాలని ప్రతిపాదించింది.

పరిశీలన తర్వాతే..
అన్ని పథకాలకు రుణం ఇచ్చే పరిస్థితి లేదని ప్రపంచ బ్యాంకు బృందం తేల్చి చెప్పింది. కొత్త పథకాలకు సంబంధించి విడివిడిగా ప్రతిపాదనలు పంపించాలని.. తమ కన్సల్టెన్సీ నిపుణులు వాటిని పరిశీలించాక, ఏయే ప్రాజెక్టులకు నిధులిచ్చే అవకాశముందో పరిశీలిస్తామని వెల్లడించింది. ప్రపంచ బ్యాంకు నిబంధనలకు లోబడి ఉన్న ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించే వీలుందని పేర్కొంది.

పాత ప్రాజెక్టులకు తగిన సాయం
ప్రస్తుతం మున్సిపల్ డెవలప్‌మెంట్, రోడ్డు సెక్టార్, సామూహిక చెరువుల అభివృద్ధి పథకం, ఆర్‌డబ్ల్యుఎస్- శానిటేషన్, తాగునీటి పథకాలు, తెలంగాణ ఇన్‌క్లూజివ్ గ్రోత్ ప్రాజెక్టు (తెలంగాణ పల్లె ప్రగతి) కార్యక్రమాలు ప్రపంచ బ్యాంకు సాయంతో అమల్లో ఉన్నాయి. ఎప్పట్లోగా ఈ పథకాలు పూర్తవుతాయి.. ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయన్న అంశంపై సమావేశంలో చర్చ జరిగింది. పురోగతిలో ఉన్న ప్రాజెక్టులకు కావాల్సినంత సహకారం అందిస్తామని వరల్డ్ బ్యాంక్ హామీ ఇచ్చింది. మిగులు నిధులుంటే వీటికి వాడుకునేందుకు అనుమతి ఇచ్చింది.

బ్రిక్స్, ఏఐఐబీ రుణం పొందవచ్చు
ఆరు దేశాలకు చెందిన బ్రిక్స్ బ్యాంక్, చైనాకు చెందిన ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్‌ల నుంచి రాష్ట్రాలు రుణాలు పొందే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక శాఖ జాయింట్ సెక్రెటరీ రాజ్‌కుమార్ తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. అన్నింటికీ ప్రపంచ బ్యాంకు రుణాలు తీసుకోవాల్సిన అవసరం లేదని.. వీటిని సైతం ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ బ్యాంకులు ఇటీవలే కొత్తగా వెలిశాయి. రుణం కావాలనుకునే రాష్ట్రాలు వీటిని ఆశ్రయించే వీలుందని ఇటీవలే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది. సంబంధిత ప్రాజెక్టు రిపోర్టులను తయారు చేసి పంపించాలని సూచించింది. తెలంగాణ ఆర్థిక శాఖ ఇప్పటికే ఈ లేఖను అన్ని విభాగాలకు పంపించింది.
 
వాటర్ గ్రిడ్‌పై ఆసక్తి..
వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు వివరాలను అడిగి తెలుసుకునేందుకు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ఆసక్తి ప్రదర్శించారు. ఈ ప్రాజెక్టు బాగుందని ప్రశంసించారు. కొత్త రాష్ట్రమైనప్పటికీ అన్ని రంగాల్లో అభివృద్ధికి, సంక్షేమానికి ప్రభుత్వం వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టిందని సీఎస్ రాజీవ్ శర్మ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో విశ్లేషించారు. రాష్ట్రంలో ఇంటింటికీ రక్షిత తాగునీటిని అందించే వాటర్ గ్రిడ్‌కు రూ.40 వేల కోట్లు అంచనా వ్యయమవుతుందన్నారు. హడ్కో రూ.20 వేల కోట్ల రుణం ఇస్తోందని, మరో రూ.20 వేల కోట్లు అవసరమవుతాయని వివరించారు. మిషన్ కాకతీయతో ఒక్కో నియోజకవర్గంలో లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే లక్ష్యం ఉందని, దీంతో సాగు విస్తీర్ణం పెరుగుతుందన్నారు.

కొత్తగా చేపట్టే ప్రాజెక్టులతో పాటు చెరువులు, కుంటల అభివృద్ధికి రూ.80 వేల కోట్లు అవసరమవుతాయన్నారు. నల్లగొండ జిల్లా దామరచెర్లలో నిర్మిస్తున్న యాదాద్రి పవర్ ప్లాంటు విద్యుత్తు లైన్లకు, సౌర విద్యుత్తు ఉత్పత్తికి రూ.5 వేల కోట్లు కావాలని కోరారు. గ్రామ పంచాయతీలను ఈ-పంచాయతీలుగా మార్చడం, ప్రభుత్వ హాస్టళ్లను రెసిడెన్షియళ్లుగా తీర్చిదిద్దేందుకు నిధులు కోరారు. హైదరాబాద్-వరంగల్ మధ్య ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి చేస్తే ఆయిల్ సీడ్స్, ధాన్యాల రవాణా పెరుగుతుందని, వ్యవసాయాధారిత పరిశ్రమలు వెలుస్తాయని విశ్లేషించారు. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్నందున హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లైకు నిధులు కావాలని ప్రతిపాదించారు.
 
పథకాలు.. అవసరాలు
-ఇరిగేషన్    రూ.80,000 కోట్లు
-తెలంగాణ వాటర్‌గ్రిడ్    రూ.20,000 కోట్లు
-హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై    రూ.14,000 కోట్లు
-యాదాద్రి ప్లాంట్‌కు విద్యుత్తు లైన్లు, సౌర విద్యుత్తు     రూ.5,000 కోట్ల్లు
-రెసిడెన్షియల్ స్కూళ్లు, ఈ పంచాయతీలు,
-హైదరాబాద్-వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్    రూ.30,000 కోట్లు (అంచనా).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement