ఈజ్ ఆఫ్ డూయింగ్ దరఖాస్తు కాపీపై తెలంగాణ ఫైర్
- అడ్డంగా దొరికిపోయి అడ్డదిడ్డంగా వాదిస్తోందని మండిపాటు
- తప్పు కప్పిపుచ్చుకోవడానికి వక్రభాష్యాలు చెబుతోందని స్పష్టీకరణ
- ఏపీ అధికారులకు నోటీసులు జారీ చేసిన పోలీసులు
- ఏమీ పట్టనట్లు వ్యవహరించిన ఏపీ అధికారులు!
- తామెవరికీ సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్ : సులభ వాణిజ్య విధానం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్-ఈవోడీబీ)లో దొడ్డిదారిన ర్యాంకు సాధించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినదంతా ముమ్మాటికీ దొంగ ప్రయత్నమేనని తెలంగాణ ప్రభుత్వం మండిపడింది. ఏపీ తీరును ప్రజల్లో ఎండగడతామని స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ పరిశ్రమల శాఖ బుధవారం ప్రకటన విడుదల చేసింది. గతేడాది ఈ ర్యాంకుల్లో తెలంగాణ 13వ ర్యాంకులో ఉందని, అలాంటి వారి సమాచారాన్ని ఎలా కాపీ కొడతామన్న ఏపీ వాదనను తెలంగాణ అధికారులు ఖండించారు.
ఈసారి డ్యాష్ బోర్డు (తాత్కాలిక) ర్యాంకుల్లో ఏపీ ఎప్పుడూ పై స్థానంలో లేదని... తెలంగాణే ప్రతిసారి మొదటి మూడు స్థానాల్లో నిలిచిందని గుర్తు చేశారు. ఈ ఏడాది ర్యాంకుల గురించి మాట్లాడకుండా, అధమస్థానంలో ఉన్న ఏపీ ఒక్కరోజులోనే టాప్-3లోకి ఎలా వచ్చిందో చెప్పకుండా.. వక్రభాష్యాలు చెబుతోందని మండిపడ్డారు. ఇక తమ ఈవోడీబీ సమాచారం తెలంగాణ అధికారులకు ఎలా అందిందంటూ ఏపీ చేస్తున్న వాదనను కూడా తెలంగాణ అధికారులు ఖండించారు. తాము తీసుకున్న చిత్రాలు ఆంధ్రప్రదేశ్ న్యాయశాఖ వెబ్‌సైట్లో ఉన్నాయని, అవి అందరికీ అందుబాటులో ఉంటాయని గమనించాలని స్పష్టం చేశారు. దీంతోనే తెలంగాణ సమాచారాన్ని ఏపీ చోరీ చేసిన విషయం ప్రజలందరికీ తెలిసిపోయిందని పేర్కొన్నారు.
దర్యాప్తు వేగవంతం..
ఈవోడీబీ దరఖాస్తు కాపీ అంశంలో ఏపీ వ్యవహారాన్ని పూర్తిగా బయటపెట్టేందుకు సీసీఎస్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇరు రాష్ట్రాల పరిశ్రమల శాఖ కమిషనర్లకు, వెబ్ అప్లికేషన్ సర్వీసు ప్రొవైడర్లకు నోటీసులు జారీ చేశారు. దీంతో తెలంగాణ పరిశ్రమల శాఖ జేడీ సురేశ్, సర్వీసు ప్రొవైడర్ ఫాక్స్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్ నిర్వాహకులు పోలీసుల ముందు హాజరయ్యారు. సాఫ్ట్‌వేర్ తయారు చేసిన తేదీలు, ఇతర సమాచారాన్ని అందించారు. అలాగే విచారణకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు సర్వీసు ప్రొవైడర్ వివరించారు.
మరోవైపు ఏపీ అధికారులు మాత్రం నోటీసులకు సమాధానం ఇవ్వకుండా ఏమీ పట్టనట్లు వ్యవహరించారని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఏపీ పరిశ్రమల శాఖ అధికారులకు నోటీసు ఇవ్వడంతో పాటు న్యాయశాఖ వెబ్‌సైట్ సర్వీసు ప్రొవైడర్ వివరాలను ఇవ్వాల్సిందిగా సీసీఎస్ పోలీసులు అడిగారు. అయితే ఏపీ పరిశ్రమల శాఖ కమిషనర్ కార్తికేయ మిశ్రాతో పాటు ఇతర అధికారులు మాత్రం.. ‘‘మేం ఎవరికీ సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. తెలంగాణ పోలీసులు మమ్మల్ని ప్రశ్నించలేరు..’’ అని వ్యాఖ్యానించారని పోలీసులు చెబుతున్నారు.
ఏపీ ముమ్మాటికీ దొంగే
Published Thu, Jul 7 2016 4:07 AM | Last Updated on Sat, Aug 18 2018 6:29 PM
Advertisement