
ఎంసెట్-2 రద్దు!
► లీకేజీ నేపథ్యంలో పరీక్ష రద్దుపై నేడు ప్రకటన
► సెప్టెంబర్ 20 నాటికి ఎంసెట్-3
► ప్రత్యేక నోటిఫికేషన్ ఉండదు..
► ఎంసెట్-2కు దరఖాస్తు చేసుకున్న
► వారందరికీ మళ్లీ హాల్‌టికెట్ల జారీ
► ప్రశ్నలు కొందరికే లీక్ అయినా రద్దు తప్పదంటున్న న్యాయ నిపుణులు
► 72 మంది విద్యార్థులకే ఆ ప్రశ్నలు చేరాయా?
► ఇంకా ఎక్కువ మంది ఉన్నారా?...
► ఉన్నతాధికారులతో మంత్రి లక్ష్మారెడ్డి సమీక్ష
హైదరాబాద్: ఎంసెట్-2 పేపర్ లీకైందని సీఐడీ అధికారులు నిర్ధారించిన నేపథ్యంలో ఆ పరీక్షను రద్దు చేసి, ఎంసెట్-3 నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఎంసెట్-2 రద్దు తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని భావిస్తోంది. సీఐడీ విచారణలో 72 మంది విద్యార్థులకు ఎంసెట్-2 ప్రశ్నలు లీక్ అయినట్లు తేలింది. వీరేగాక ఇంకెంత మందికి ఆ ప్రశ్నలు చేరాయన్న సంగతి ఇంకా తేలాల్సి ఉంది. లీకేజీ ఐదారుగురు విద్యార్థులకే పరిమితమైతే వారి ర్యాంకులను తొలగించి, మిగతా విద్యార్థులకు కౌన్సెలింగ్ చేపట్టే వీలుండేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
అయితే 72 మందికి ప్రశ్నలు లీక్ అయిన నేపథ్యంలో వారందరినీ తొలగించి, మిగతా వారికి కౌన్సెలింగ్ కొనసాగించడం అసాధ్యమని అంటున్నారు. విచారణ పూర్తయితే తప్ప ప్రశ్నలు ఇంకా ఎందరికి లీక్ అయ్యాయన్న అంశంపై కచ్చితమైన నిర్ణయానికి వచ్చే పరిస్థితి ఉండదు. పైగా ఈ వ్యవహారంలో నిందితులపై కేసులు నమోదు చే సి కోర్టులో హాజరు పరచాల్సి ఉంది. అలాంటపుడు లీక్ అయిన ప్రశ్నలతో ర్యాంకులు పొందిన విద్యార్థుల పేర్లను తొలగించి, కౌన్సెలింగ్ నిర్వహించడం సాధ్యం కాదని, ఎంసెట్-3 పరీక్షను నిర్వహించాల్సి వస్తుందని చెబుతున్నారు. ఇదే అంశంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి బుధవారం అధికారులతో సమీక్షించారు. సీఐడీ పేర్కొన్న అంశాలపై చర్చించారు. ఎంసెట్-2ను రద్దు చేయడమే సరైందన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. దీనిపై గురువారం అధికారికంగా నిర్ణయం తీసుకొని ప్రకటన జారీ చేసే అవకాశం ఉంది.
45 రోజుల్లో ఎంసెట్-3
ఎంసెట్-2 పరీక్షను రద్దు చేస్తే ఎంసెట్-3 పరీక్ష నిర్వహణకు కనీసం 45 రోజుల సమయం పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఎంసెట్-2 రద్దు, ఎంసెట్-3 నిర్వహణపై ప్రభుత్వ నిర్ణయం తర్వాతే తదుపరి చర్యలు చేపడతామని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. పరీక్ష నిర్వహించాల్సి వస్తే మాత్రం సెప్టెంబర్ 20 నాటికి నిర్వహించే వీలుంటుందని, ఈలోగా మళ్లీ కన్వీనర్ నియామకం, ప్రశ్నపత్రాల రూపకల్పన, వాటి ముద్రణ, విద్యార్థులకు హాల్‌టికెట్ల జారీ తదితర పనులన్నీ చేపట్టాల్సి ఉంటుంది. ఎంసెట్-3 కోసం ప్రత్యేకంగా నోటిఫికేషన్ జారీ, దరఖాస్తుల ప్రక్రియ వంటివేవీ లేకుండానే.. ఎంసెట్-2కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులందరికి హాల్‌టికెట్లు జారీచేసి, పరీక్షను నిర్వహించనున్నారు.
పూర్తిస్థాయి నివేదిక వచ్చాకే నిర్ణయం: లక్ష్మారెడ్డి
ఎంసెట్-2 లీకేజీ వ్యవహారంపై సీఐడీ నివేదిక పూర్తిస్థాయిలో వచ్చాకే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని మంత్రి లక్ష్మారెడ్డి స్పష్టంచేశారు. విచారణ ఇంకా కొనసాగుతోందన్నారు. సీఐడీ నివేదిక గురువారం వచ్చే అవకాశం ఉందన్నారు. మెడికల్ అడ్మిషన్ల ప్రక్రియ సెప్టెంబర్ 30 లోగా పూర్తి కావాల్సి ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
జేఎన్‌టీయూ వీసీకి బాధ్యతలు
ప్రస్తుత వివాదం నేపథ్యంలో ఎంసెట్‌కు కన్వీనర్‌గా వ్యవహ రించిన రమణరావుకు కాకుండా జేఎన్‌టీయూహెచ్ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డికి ఎంసెట్-3 బాధ్యతలు అప్పగించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్ర కారం సెప్టెంబర్ 30 నాటికి మెడికల్ ప్రవేశాల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. లీకేజీ నేపథ్యంతో మరికొంత సమయం ఇవ్వాలని ఎంసీఐకి విజ్ఞప్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. విచారణలో జేఎన్‌టీయూహెచ్‌కు చెందిన ఓ ప్రొఫెసర్, సిబ్బంది పాత్రపై అనుమానాలున్నట్లు వెల్లడైంది. దీంతో వీసీ వేణుగోపాల్‌రెడ్డి అధికారులతో సమావేశమై విచారణ జరి పినట్లు తెలిసింది. తల్లిదండ్రులు మాత్రం ఎంసెట్-2ను రద్దు చేయకుండా నింది తుల పేర్లను, ర్యాంకులను తొలగించి, మిగతా వారికి కౌన్సెలింగ్ నిర్వహించాలని లక్ష్మారెడ్డికి విజ్ఞప్తి చేశారు.