eamcet-2
-
'ఎంసెట్-3 రాసేందుకు అందరూ అర్హులే'
హైదరాబాద్ : ఎంసెట్-3 పరీక్ష రాసేందుకు అందరూ అర్హులేనని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. ఎంసెట్-2 రాసినవారంతా ఎంసెట్-3 పరీక్ష రాసేందుకు అర్హులేనన్నారు. పేపర్ లీక్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థులను ఎంసెట్-3 రాసేందుకు అనుమతిస్తామన్నారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ ఎంసెట్ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీలో విద్యార్థుల ప్రమేయం ఇంకా నిర్థారణ కాలేదన్నారు. అయితే తప్పు చేసినవారిపై చర్యలు తప్పవని కడియం శ్రీహరి హెచ్చరించారు. సీఐడీ నివేదిక రాగానే ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటారని ఆయన తెలిపారు. విద్యా వాలంటీర్ల నియామకం 80 శాతం పూర్తయిందని కడియం శ్రీహరి తెలిపారు. కాగా ఎంసెట్-3 సెప్టెంబరు 11న జరుగుతుంది. -
మాగ్నటిక్ సంస్థతో సంబంధం లేదు: పల్లా
ఎంసెట్-2 లీకేజీ వ్యవహారంలో ప్రతిపక్షాలు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను గందరగోళపరుస్తున్నాయని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎంసెట్ పరీక్ష నిర్వహించిన మాగ్నటిక్ సంస్థతో టీఆర్ఎస్ నేతలెవరికీ సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు ఉనికి చాటుకోవడానికి విమర్శలు చేస్తున్నారన్నారు. లీకేజీ వ్యవహారం బహిర్గతం కాగానే ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు చేపట్టిందని, చట్టప్రకారం ముందుకు వెళ్తుందని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వ్యాఖ్యానించారు. గతంలో కూడా చాలాసార్లు ప్రశ్నాపత్రాలు లీకయ్యాయని గుర్తు చేశారు. అసత్య ప్రచారాలతో ప్రతిపక్షాలు విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తున్నారని అన్నారు. ఎంసెట్ పేపర్ లీకేజీతో మంత్రులకు సంబంధం లేదని, రాజీనామా చేయాల్సిన అవసరం లేదని అన్నారు. -
కేసీఆర్‌తో డీజీపీ భేటీ
హైదరాబాద్: తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ శనివారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతో సమావేశమయ్యారు. ఎంసెట్-2 పేపర్ లీకేజ్ కేసుపై ముఖ్యమంత్రితో చర్చించారు. తెలంగాణ ఎంసెట్-2 పేపర్ లీక్ వ్యవహారంపై సీఐడీ విచారణను వేగవంతం చేసింది. ఈ కేసులో కీలక నిందితుడు ఇక్బాల్ అనుచరుడు రాజేష్‌ను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు కన్సల్టెన్సీ యజమాని రాజగోపాల్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టు సీఐడీ అధికారులు కాసేపట్లో ప్రకటించే అవకాశముంది. -
న్యూఢిల్లీ నుండే ఎంసెట్-2 పేపర్ లీక్ !
-
ఎంసెట్–2 లీకేజీపై సీబీఐతో విచారణ జరిపించాలి
పాపిరెడ్డి, కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డిలను బర్తరఫ్ చేయాలి టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు వరంగల్ : ఎంసెట్–2 పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించి అందుకు బాధ్యులను చేస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లకా్ష్మరెడ్డిలను వెంటనే పదవుల నుంచి బర్తరఫ్ చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు డిమాండ్ చేశారు. హన్మకొండ బాలసముద్రంలోని టీడీపీ జిల్లా కార్యాలయం లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో లక్షలా ది మంది విద్యార్థుల తల్లిదండ్రులతో కంటతడి పెట్టిస్తున్న ఎంసెట్ లీకేజీ కుంభకోణంలో అస లు ముద్దాయి ప్రభుత్వమే అని, ఇందుకు బా ధ్యులను కఠినంగా శిక్షించాలన్నారు. చైర్మన్, డి ప్యూటీ సీఎం, వైద మంత్రి ప్రమేయం ఉన్నప్పటికి వారిని కాపాడేందుకు దళారులు ప్రింటింగ్ ప్రెస్‌కు సంబంధించిన వ్యక్తులను, కొంత మం ది విద్యార్థులను బలిపశువులుగా చేస్తూ తప్పిం చుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఎంసెట్ ఆన్లైన్ కోసం సంబంధించిన టెండర్‌ను ప్రభుత్వ రంగ సంస్థకు అప్పజెప్పకుండా ఏకపక్షంగా ప్రైవేటు సంస్థకు అప్పగించడం వె నుక ముఖ్యమంత్రి కుటుంబ పెద్దల ఒత్తిడి ఉం దని ఆరోపించారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్లూరు అశోక్‌కుమార్, తెలుగు రైతు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడుచాడా రఘునాథరెడ్డి, హన్మకొండ సాంబ య్య, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జాటో త్ సంతోష్‌నాయక్,కార్యాలయ కార్యదర్శి మార్గం సారం గం, ఎర్రబెల్లి రామేశ్వర్రావు, రాజగోపాల్, వల్లెపు శ్రీనివాస్, తాళ్లపల్లి రాజు, జయశంకర్ పాల్గొన్నారు. -
ఎంసెట్ లీకేజీపై కాంగ్రెస్ ఆందోళన
ఎంసెట్-2 లీకేజీలకు బాధ్యత వహిస్తూ మంత్రి లక్ష్మారెడ్డి వెంటనే రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా మందమర్రిలోని బస్టాండ్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్రీయ రహదారిపై గంటపాటు ఆందోళన చేపట్టారు. దీంతో పట్టణంలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నేతలు రమేష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
‘లీకేజీ పెద్దలను కఠినంగా శిక్షించాలి’
ఎంసెట్ - 2 లీకేజీ వ్యవహారంలో సూత్రధారులతో పాటు, వారికి సహకరించిన అధికారులను, పరోక్షంగా ప్రోత్సాహం అందించిన రాష్ట్ర మంత్రులను కఠినంగా శిక్షించాలని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి కె. శివకుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంసెట్ -2 విషయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఏదైతే కోరుకొంటున్నారో దానికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని చెప్పారు. ఎంసెట్ పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించలేదని, దీనిపై ఉన్న శ్రద్ధ, పరీక్షను కట్టుదిట్టంగా నిర్వహించాలన్న విషయంపై ఎందుకు లేదన్నారు. సీఎం కేసీఆర్ ఫౌంహౌస్‌లో ఉండి ఏ పంటలు వెస్తే బాగుంటుందని అక్కడివారితో ఆలోచిస్తున్నారని తెలిపారు. అదే సమయంలో సెక్రటరియేట్ ఎందుట తమ పిల్లల బంగారు భవిష్యత్తు గురించి ఆందోళన చేస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై ఎందుకు లేదని ప్రశ్నించారు. బంగారు తెలంగాణ కాస్తా లికేజీల తెలంగాణగా మారిందని ఎద్దేవా చేశారు. -
సీబీఐచే విచారణ చేపట్టాలి
సర్కార్ అసమర్థత వల్లే ఎంసెట్ -2 లీక్ సంబంధిత మంత్రులు రాజీనామా చేయాలి బీజేవైఎం డిమాండ్.. ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం సంగారెడ్డి టౌన్: ఎంసెట్ -2 ప్రశ్నపత్రాల లీక్‌కు నైతిక బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డిలు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని బీజేపీ యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మున్నూరు విష్ణువర్ధన్ డిమాండ్ చేశారు. లీక్ విషయం బహిర్గతం అయ్యే వరకు ప్రభుత్వానికి తెలవకపోవడం సిగ్గుచేటన్నారు. గురువారం స్థానిక కొత్త బస్టాండ్ వద్ద ప్రభుత్వ దిష్టబొమ్మను బీజేవైఎం నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంసెట్ -3 నిర్వహణను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు న్యాయం చేయకపోతే మంత్రులను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు మందుల నాగరాజు, నాయకులు విజయ్ కుమార్, సంధీర్‌రెడ్డి, సతీష్‌గౌడ్, రమేష్, తరున్, సాయి, విష్ణు, నాగరాజ్, పండు తదితరులు పాల్గొన్నారు. -
వాళ్లిద్దరినీ బర్తరఫ్ చేయండి: చాడ
యాదగిరిగుట్ట(నల్లగొండ): ఎంసెట్-2 లీకేజీ వ్యవహారంలో నిర్లక్ష్యం వహించిన విద్య, ఆరోగ్యశాఖ మంత్రులు కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డిలను వెంటనే బర్తరఫ్ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. లీకేజీ వీరులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలన్నారు. ఎంసెట్-2 పరీక్షల్లో నిజమైన ర్యాంకర్లకు అన్యాయం జరగకుండా జాగ్రతలు తీసుకోవాలన్నారు. ఎంసెట్ రద్దు చేస్తున్నామని వస్తున్న వార్తలతో విద్యార్థులు మనోవేదన చెందుతున్నారని వారికి చదువుపై ఆసక్తి తగ్గిపోయే ప్రమాదం ఉందన్నారు. ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ల పేరుతో విద్యార్థులను తప్పు దారి పట్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఎంసెట్-2 లీకేజీ వ్యహారంలో ఇద్దరు అరెస్ట్
-
ఎంసెట్ రద్దుపై రేపు ప్రభుత్వం ప్రకటన
-
ఎంసెట్ రద్దుపై రేపు ప్రభుత్వం ప్రకటన
హైదరాబాద్: ఎంసెట్-2 రద్దు వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం అధికారికంగా ప్రకటన చేయనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు మధ్యాహ్నాం మంత్రులు, ఉన్నతాధికారులతో భేటీ అనంతరం నిర్ణయం వెల్లడించనున్నారు. కాగా ఎంసెట్-2 పరీక్షను రద్దు చేయవద్దంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు సచివాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఏ తప్పు చేయని తమకెందుకు శిక్ష అంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు చేసిన వారిని శిక్షించాలని, అంతేకానీ ఎంతో కష్టపడి చదివి ర్యాంకులు తెచ్చుకుంటే ప్రశ్నాపత్రం లీక్ అయిందంటూ పరీక్షను రద్దు చేయటం ఎంతవరకూ సమంజసమని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. కాగా ఎంసెట్ రద్దుపై ప్రభుత్వానిదే తుది నిర్ణయమని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. మరోవైపు రాష్ట్రంలోని యూనివర్సిటీలపై సీఎం కేసీఆర్ శుక్రవారం మధ్యాహ్నం సమీక్ష నిర్వహించనున్నారు. అన్ని వర్సిటీల వైస్ చాన్సులర్లు, ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. కాగా ప్రభుత్వం చేపట్టిన వైస్ చాన్సులర్ల నియామకాన్ని హైకోర్టు ఇవాళ రద్దు చేసిన విషయం తెలిసిందే. -
ర్యాంకర్ల మార్కులు దాదాపు సమానం
హైదరాబాద్: ఎంసెట్-2లో ప్రశ్నపత్రం లీకు ద్వారా లబ్ధి పొందిన విద్యార్థులందరూ దాదాపు సమాన మార్కులు సాధించారు. దళారులు మొత్తం 160 ప్రశ్నలకుగాను విద్యార్థులకు 130 నుంచి 140 మధ్య ప్రశ్నలను లీక్ చేశారు. అందుకు అనుగుణంగానే సాధన చేసిన విద్యార్థులు అనుకున్న మాదిరిగా మార్కులు సాధించారు. ఎంసెట్‌లో బయాలజీ గ్రూపు కింద 80 మార్కులుంటాయి. వీటిలో లీకేజీ పొందిన విద్యార్థులందరూ 60 నుంచి 70 మార్కులు పొందారు. అలాగే ఫిజిక్స్‌లో 40 మార్కులకు గాను 32 నుంచి 38 మధ్య సాధించారు. కెమిస్ట్రీలో 40 మార్కులకుగాను ఇందులోనూ ప్రతీ విద్యార్థి 32 నుంచి 38 వరకు సాధించారు. సీఐడీ దృష్టికి వచ్చిన వాటిలో మచ్చుకు కొన్ని వివరాలు.. ఎస్.ప్రత్యూష 136 మార్కులతో 423 ర్యాంకు సాధించింది. ఇందులో ఈమె బయాలజీలో 65 మార్కులు, ఫిజిక్స్‌లో 36, కెమిస్ట్రీలో 35 మార్కులు సాధించింది. అలాగే పి.రష్మిక 133 మార్కులతో 842 ర్యాంకు సాధించింది. ఈమెకు బయాలజీలో 68 మార్కులు, ఫిజిక్స్‌లో 34, కెమిస్ట్రీలో 31 మార్కులు వచ్చాయి. అలాగే వి.జాహ్నవి 134 మార్కులతో 704 ర్యాంకు సాధించింది. సోనాలి అనే విద్యార్థి 141 మార్కులతో 295 ర్యాంకు సాధించింది. వరంగల్ జిల్లా పరకాలకు చెందిన ఎం.భవాని 133 మార్కులతో 952వ ర్యాంకు సాధించింది. -
ఎంసెట్-2 రద్దు!
► లీకేజీ నేపథ్యంలో పరీక్ష రద్దుపై నేడు ప్రకటన ► సెప్టెంబర్ 20 నాటికి ఎంసెట్-3 ► ప్రత్యేక నోటిఫికేషన్ ఉండదు.. ► ఎంసెట్-2కు దరఖాస్తు చేసుకున్న ► వారందరికీ మళ్లీ హాల్‌టికెట్ల జారీ ► ప్రశ్నలు కొందరికే లీక్ అయినా రద్దు తప్పదంటున్న న్యాయ నిపుణులు ► 72 మంది విద్యార్థులకే ఆ ప్రశ్నలు చేరాయా? ► ఇంకా ఎక్కువ మంది ఉన్నారా?... ► ఉన్నతాధికారులతో మంత్రి లక్ష్మారెడ్డి సమీక్ష హైదరాబాద్: ఎంసెట్-2 పేపర్ లీకైందని సీఐడీ అధికారులు నిర్ధారించిన నేపథ్యంలో ఆ పరీక్షను రద్దు చేసి, ఎంసెట్-3 నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఎంసెట్-2 రద్దు తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని భావిస్తోంది. సీఐడీ విచారణలో 72 మంది విద్యార్థులకు ఎంసెట్-2 ప్రశ్నలు లీక్ అయినట్లు తేలింది. వీరేగాక ఇంకెంత మందికి ఆ ప్రశ్నలు చేరాయన్న సంగతి ఇంకా తేలాల్సి ఉంది. లీకేజీ ఐదారుగురు విద్యార్థులకే పరిమితమైతే వారి ర్యాంకులను తొలగించి, మిగతా విద్యార్థులకు కౌన్సెలింగ్ చేపట్టే వీలుండేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అయితే 72 మందికి ప్రశ్నలు లీక్ అయిన నేపథ్యంలో వారందరినీ తొలగించి, మిగతా వారికి కౌన్సెలింగ్ కొనసాగించడం అసాధ్యమని అంటున్నారు. విచారణ పూర్తయితే తప్ప ప్రశ్నలు ఇంకా ఎందరికి లీక్ అయ్యాయన్న అంశంపై కచ్చితమైన నిర్ణయానికి వచ్చే పరిస్థితి ఉండదు. పైగా ఈ వ్యవహారంలో నిందితులపై కేసులు నమోదు చే సి కోర్టులో హాజరు పరచాల్సి ఉంది. అలాంటపుడు లీక్ అయిన ప్రశ్నలతో ర్యాంకులు పొందిన విద్యార్థుల పేర్లను తొలగించి, కౌన్సెలింగ్ నిర్వహించడం సాధ్యం కాదని, ఎంసెట్-3 పరీక్షను నిర్వహించాల్సి వస్తుందని చెబుతున్నారు. ఇదే అంశంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి బుధవారం అధికారులతో సమీక్షించారు. సీఐడీ పేర్కొన్న అంశాలపై చర్చించారు. ఎంసెట్-2ను రద్దు చేయడమే సరైందన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. దీనిపై గురువారం అధికారికంగా నిర్ణయం తీసుకొని ప్రకటన జారీ చేసే అవకాశం ఉంది. 45 రోజుల్లో ఎంసెట్-3 ఎంసెట్-2 పరీక్షను రద్దు చేస్తే ఎంసెట్-3 పరీక్ష నిర్వహణకు కనీసం 45 రోజుల సమయం పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఎంసెట్-2 రద్దు, ఎంసెట్-3 నిర్వహణపై ప్రభుత్వ నిర్ణయం తర్వాతే తదుపరి చర్యలు చేపడతామని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. పరీక్ష నిర్వహించాల్సి వస్తే మాత్రం సెప్టెంబర్ 20 నాటికి నిర్వహించే వీలుంటుందని, ఈలోగా మళ్లీ కన్వీనర్ నియామకం, ప్రశ్నపత్రాల రూపకల్పన, వాటి ముద్రణ, విద్యార్థులకు హాల్‌టికెట్ల జారీ తదితర పనులన్నీ చేపట్టాల్సి ఉంటుంది. ఎంసెట్-3 కోసం ప్రత్యేకంగా నోటిఫికేషన్ జారీ, దరఖాస్తుల ప్రక్రియ వంటివేవీ లేకుండానే.. ఎంసెట్-2కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులందరికి హాల్‌టికెట్లు జారీచేసి, పరీక్షను నిర్వహించనున్నారు. పూర్తిస్థాయి నివేదిక వచ్చాకే నిర్ణయం: లక్ష్మారెడ్డి ఎంసెట్-2 లీకేజీ వ్యవహారంపై సీఐడీ నివేదిక పూర్తిస్థాయిలో వచ్చాకే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని మంత్రి లక్ష్మారెడ్డి స్పష్టంచేశారు. విచారణ ఇంకా కొనసాగుతోందన్నారు. సీఐడీ నివేదిక గురువారం వచ్చే అవకాశం ఉందన్నారు. మెడికల్ అడ్మిషన్ల ప్రక్రియ సెప్టెంబర్ 30 లోగా పూర్తి కావాల్సి ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జేఎన్టీయూ వీసీకి బాధ్యతలు ప్రస్తుత వివాదం నేపథ్యంలో ఎంసెట్‌కు కన్వీనర్‌గా వ్యవహ రించిన రమణరావుకు కాకుండా జేఎన్టీయూహెచ్ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డికి ఎంసెట్-3 బాధ్యతలు అప్పగించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్ర కారం సెప్టెంబర్ 30 నాటికి మెడికల్ ప్రవేశాల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. లీకేజీ నేపథ్యంతో మరికొంత సమయం ఇవ్వాలని ఎంసీఐకి విజ్ఞప్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. విచారణలో జేఎన్టీయూహెచ్కు చెందిన ఓ ప్రొఫెసర్, సిబ్బంది పాత్రపై అనుమానాలున్నట్లు వెల్లడైంది. దీంతో వీసీ వేణుగోపాల్‌రెడ్డి అధికారులతో సమావేశమై విచారణ జరి పినట్లు తెలిసింది. తల్లిదండ్రులు మాత్రం ఎంసెట్-2ను రద్దు చేయకుండా నింది తుల పేర్లను, ర్యాంకులను తొలగించి, మిగతా వారికి కౌన్సెలింగ్ నిర్వహించాలని లక్ష్మారెడ్డికి విజ్ఞప్తి చేశారు. -
అక్కడ 24 వేల ర్యాంకు.. ఇక్కడ 704!
తెలంగాణ ఎంసెట్ పేపర్ లీకేజి విషయం నూటికి నూరుపాళ్లు నిజమేనని తేలిపోయింది. కొంతమంది విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్‌లో వచ్చిన ర్యాంకులు, తెలంగాణలో వచ్చిన ర్యాంకులు పోల్చి చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఏపీ ఎంసెట్‌లో 55వేల ర్యాంకు వచ్చిన విద్యార్థికి టీఎస్ ఎంసెట్-2లో 1502 ర్యాంకు వచ్చింది. అలాగే అక్కడ 24వేల ర్యాంకు వచ్చిన వాళ్లకు ఇక్కడ 704 ర్యాంకు వచ్చింది. అక్కడ 10వేల ర్యాంకు వస్తే, ఇక్కడ ఏకంగా 141వ ర్యాంకు సాధించారు. అలాగే ఏపీలో 25వేల ర్యాంకు వరకు వచ్చిన ఓ విద్యార్థికి ఇక్కడ 952వ ర్యాంకు వచ్చింది. ప్రిపరేషన్ కోసం ఎంత సమయం ఉన్నా.. మరీ ఇంత స్థాయిలో ర్యాంకులు రావడం దాదాపు అసాధ్యమే. అది కూడా మెడికల్ ఎంట్రన్సులో. ఇదే తల్లిదండ్రుల అనుమానాలకు బీజం వేసింది. ఇలా మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులు పరీక్షకు రెండు రోజుల ముందు అదృశ్యం కావడం, సరిగ్గా పరీక్ష ఉన్న రోజే విమానంలో హైదరాబాద్‌కు వచ్చి పరీక్ష రాయడం వాళ్ల అనుమానాలకు కారణమైంది. అలా రాసిన విద్యార్థులను మిగిలినవాళ్లు అడిగినప్పుడు కూడా పొంతనలేని సమాధానాలు చెప్పారు. చివరకు ర్యాంకులు వచ్చిన తర్వాత.. అసలు కోచింగ్ సెంటర్లలో వీళ్ల పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండేదని, ఇంత మంచి ర్యాంకులు ఎలా వచ్చాయో అర్థం కావడం లేదని పిల్లలు చెప్పడంతో తల్లిదండ్రులు స్పందించి మంత్రికి ఫిర్యాదు చేశారు. లీకు వీరులు ఎవరో? 2014లో నిర్వహించిన మెడికల్ పీజీ ఎంట్రన్సు పేపర్లు లీకయ్యాయి. ఈ పేపర్లను ఢిల్లీలోని ముద్రణాలయంలో ప్రింట్ చేయించారు. అప్పట్లో ఆ పేపర్ లీకేజి కేసులో వినిపించిన పేర్లే ఇప్పుడు కూడా ఎంసెట్-2 లీకేజి విషయంలో వినిపిస్తున్నాయి. ముగ్గురు వ్యక్తులే ఇందులో కీలక పాత్రధారులని తెలుస్తోంది. ఇప్పటికే ఎంసెట్-2 లీకేజి కేసులో ప్రకాశం జిల్లాకు చెందిన రమేష్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతడితో పాటు మరో వ్యక్తిని కూడా అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. పరీక్షకు 48 గంటల ముందు 30 మంది విద్యార్థులను బెంగళూరు, ముంబై తరలించారు. అక్కడే వాళ్లతో ప్రాక్టీసు చేయించారంటున్నారు. దీనిపై 24 గంటల్లో ప్రభుత్వానికి నివేదిక అందనుంది. ఆ తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక 2014 నుంచి ఇప్పటివరకు నిర్వహించిన అన్ని ప్రవేశపరీక్షల వ్యవహారంపై కూడా దృష్టిపెట్టాలని సీఐడీ నిర్ణయించినట్లు సమాచారం. -
ఎంసెట్–2 పాత్రధారులపై సీఐడీ కన్ను..!
వరంగల్ : ఎంసెట్–2 ప్రశ్నపత్రం లీకేజీ అయిందని ప్రాథమికంగా నిర్ధారించిన సీఐడీ అధికారులు నివేదికను ప్రభుత్వానికి అందజేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న వారిని గుర్తించేందుకు సీఐడీ బృందం జిల్లాలో పర్యటించినట్లు తెలిసింది. మంగళవారం బృందం అధికారులు పరకాల, భూపాలపల్లి కేంద్రాల నుంచి ఎంసెట్–2తో ర్యాంకులు సాధించిన విద్యార్థుల వివరాలను ఆరా తీసినట్లు సమాచారం. లీకేజీ వ్యవహారం బయటకు రావడంతో ర్యాంకులు సాధించిన వారు స్థానికంగా లేకుండా బంధువుల ఇళ్లకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. కాగా, పరకాలలో ఎంసెట్‌తో సంబంధం ఉన్న ఒక వ్యాపారి షాపు మూసి ఉండడంతో సీఐడీ అధికారులు ఆయనను అరెస్ట్ చేసినట్లు వదంతులు వ్యాపించాయి. అయితే మం గళవారం దుకాణాలకు సెలవు కావడం వల్లే షాపు మూసి ఉందని స్థానికులు ఆలస్యంగా గుర్తించారు. ఇదిలా ఉండగా, ఎంసెట్–2 లీకేజీతో సంబంధం ఉన్న భూపాలపల్లికి చెందిన మరో వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతున్న తమ బంధువుల ఇంటికి పరామర్శకు వెళ్లినట్లు తెలుస్తోంది. సీఐడీ అధికారులు ప్రాథమికంగా ఇచ్చిన నివేదిక ప్రకారం ఆరోపణలు ఉన్న వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించే అవకాశాలున్నట్లు తెలిసింది. ఈ లీకేజీ వ్యవహారంతో ఎంసెట్–2 నిర్వాహకులతో సంబంధం ఉందని అనుమానిస్తున్న సీఐడీ వారిని ముందుగా విచారిస్తే జిల్లాలో ఎవరెవరు ఉన్నారన్న విషయం స్పష్టమయ్యే అవకాశాలున్నాయి. -
లీకేజీ నిజమే..!
-
లీకేజీ నిజమే..!
♦ ఎంసెట్-2 వ్యవహారంలో సీఐడీ ప్రాథమిక నిర్ధారణ ♦ ఐపీసీ 406, 408, 420, 120(బి) సెక్షన్ల కింద కేసు నమోదు ♦ ప్రభుత్వ అనుమతితో పూర్తిస్థాయి విచారణకు సిద్ధమైన సీఐడీ ♦ రంగంలోకి ఆరు బృందాలు.. ఇప్పటికే పలు ఆధారాలు లభ్యం ♦ పలువురు జేఎన్టీయూ అధికారులు, ఫ్యాకల్టీ తీరుపై సందేహాలు ♦ అనుమానితులకు సీఆర్పీసీ సెక్షన్ 41-ఏ కింద నోటీసులు! ♦ విద్యార్థుల తల్లిదండ్రులనూ ప్రశ్నించాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీకైనట్లు సీఐడీ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ అంశంలో ఐదు రోజులుగా రోజుకో కొత్త అంశం తెరపైకి వస్తోంది. ఆయా అంశాలన్నింటితో ఎంసెట్-2 లీకేజీకి సంబంధించి లభించిన ప్రాథమిక ఆధారాలను అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ప్రభుత్వ అనుమతి తీసుకుని.. సోమవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 406 (నమ్మకద్రోహం), 408 (ప్రభుత్వ ఉద్యోగి నమ్మకద్రోహం), 420 (చీటింగ్, మోసం) రెడ్‌విత్ 120బి, ఏపీ పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్ 1987 (ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్) సెక్షన్ 8 కింద కేసులు నమోదు చేశారు. అయితే ఇందులో నిందితులెవరనేది చేర్చలేదు. దర్యాప్తులో కుట్రదారుల పాత్రను నిర్ధారించి వారి పేర్లను చేర్చాలని సీఐడీ అధికారులు భావిస్తున్నారు. కేసు సమగ్ర దర్యాప్తు కోసం సీఐడీ ఆరు బృందాలను రంగంలోకి దింపింది. కేసు ప్రాముఖ్యత దృష్ట్యా సీఐడీ ఐజీ సౌమ్య మిశ్రా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఎంసెట్-2 కౌన్సెలింగ్ వాయిదా పడిన నేపథ్యంలో కేసును త్వరగా ఓ కొలిక్కి తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అనుమానితులకు నోటీసులు: ఎంసెట్-2 లీకేజీ ఆరోపణలపై ప్రాథమిక విచారణలో సహకరించని వారందరికీ నోటీసులు జారీ చేయాలని సీఐడీ అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా జేఎన్టీయూ అధికారులు సరిగా స్పందించలేదని ఆరోపణలున్నాయి. కొందరు జేఎన్టీయూ అధికారులు, ప్రశ్నపత్రం తయారు చేసిన ఫ్యాకల్టీ సభ్యులు దళారులతో మాట్లాడినట్లు సీఐడీ ప్రాథమిక విచారణలో వెలుగు చూసినట్లు సమాచారం. దీనిపై ఆరా తీసేందుకు ఎవరిని ప్రశ్నించినా తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. పైగా కొందరు ఫోన్లు స్విచాఫ్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అనుమానితులుగా భావిస్తున్న ముగ్గురు జేఎన్టీయూ అధికారులను, ప్రశ్నపత్రం తయారు చేసిన ఫ్యాకల్టీలోని ఇద్దరు స భ్యులను పిలిచి మాట్లాడాలని సీఐడీ భావి స్తోంది. ఈ మేరకు సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు జారీ చేయాలని భావిస్తున్నారు. ఇక ర్యాంకులు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులను, ఆరోపణలు చేస్తున్న వారినీ పిలిచి సీఆర్పీసీ సెక్షన్ 161 కింద స్టేట్మెంట్లు నమోదు చేయనున్నారు. ఇక ఓ ఈశాన్య రాష్ట్రంలోని ప్రింటింగ్ ప్రెస్‌లో ఎంసెట్ -2 ప్ర శ్నపత్రాన్ని ముద్రించారు. అక్కడి నుంచి ప్రశ్నపత్రం లీకై ఉంటుందనే సందేహం మేరకు.. వారినీ విచారించాలని భావిస్తున్నారు. టెలికం కంపెనీలకు నోటీసులు బ్రోకర్లు, విద్యార్థుల తల్లిదండ్రులకు మధ్య సంభాషణల కాల్ రికార్డుల కోసం సీఐడీ అధికారులు టెలికం కంపెనీలకు నోటీసులు జారీ చేశారు. అధికారులు గుర్తించిన కాల్ లిస్టుల ప్రకారం దళారులు, జేఎన్టీయూ అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రుల మధ్య ఫోన్ సంభాషణలు చోటు చేసుకున్నాయి. పరీక్షకు వారం ముందు ఈ కాల్స్ ఎక్కువగా ఉన్నాయి. దీంతో దళారులుగా చెలామణీ అవుతున్న ఇద్దరు వ్యక్తుల నుంచి జేఎన్టీయూ అధికారులకు పదే పదే ఫోన్లు ఎందుకు వెళ్లాయి, వారేం మాట్లాడుకున్నారనేది తేల్చాలని సీఐడీ అధికారులు నిర్ణయించారు. అలాగే కొంత మంది విద్యార్థుల తల్లిదండ్రులు డబ్బులు ముట్టజెప్పినట్లు అనుమానిస్తున్నారు. ఈ మేరకు వారి బ్యాంకు స్టేట్మెంట్లు తీసుకోవాలని సంబంధిత బ్యాంకు అధికారులను కోరనున్నారు. ఆరోపణలకు చేకూరుతున్న బలం ఎంసెట్-1లో తక్కువ ర్యాంకు వచ్చిన వారు ఎంసెట్-2లో మెరుగైన ర్యాంకు సాధించడంతోపాటు, కొన్ని సందేహాస్పద ఘటనలు లీకేజీ ఆరోపణలకు బలం చేకూర్చుతున్నాయని అధికారులు చెబుతున్నారు. విద్యార్థులు పరీక్షకు వారం ముందే కోచింగ్ సెంటర్ల నుంచి బయటకు వచ్చి బెంగళూరు వెళ్లినట్లు గుర్తించారు. దీనిపై పలు ఆధారాలు కూడా సేకరించారు. ఎంసెట్-2లో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులందరికీ ఫిజిక్స్, కెమిస్ట్రీల్లోనే ఎక్కువ మార్కులు వచ్చాయి. వాస్తవానికి ఎంసెట్-1 కంటే ఎంసెట్-2లోనే ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రశ్నలు కఠినంగా వచ్చాయని, అయినా ఎక్కువ మార్కులు వచ్చాయని సీఐడీ గుర్తించింది. -
బాలురే బాద్షాలు
- ఎంసెట్-2 టాప్-10లో ఆరుగురు వారే - రంగారెడ్డి జిల్లా వాసికి ఫస్ట్ ర్యాంకు - ఈ నెల 16 నుంచి వెబ్సైట్లో ఓఎంఆర్ పత్రాలు - 21 నుంచి ర్యాంకు కార్డుల డౌన్‌లోడ్‌కు అవకాశం - 25 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్.. ఆగస్టు మొదటి వారంలో అడ్మిషన్లు - ఎంబీబీఎస్‌లో 1,780, బీడీఎస్‌లో 640 సీట్లు - ర్యాంకులు విడుదల చేసిన మంత్రి లక్ష్మారెడ్డి సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంసెట్-2లో బాలురు సత్తా చాటారు. టాప్-10 ర్యాంకుల్లో ఆరుగురు వారే ఉన్నారు. ఉత్తీర్ణతపరంగా మాత్రం బాలికలు కాస్త ముందంజలో నిలిచారు. ఎంసెట్-2 ర్యాంకులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి బుధవారం సచివాలయంలో విడుదల చేశారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, జేఎన్టీయూహెచ్ వైస్ చాన్స్‌లర్ శైలజా రామయ్యర్, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, ఎంసెట్-2 కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణరావు తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఎంసెట్ స్కోర్‌కు 75%.. ఇంటర్ మార్కులకు 25% ఎంసెట్-2కు మొత్తం 56,153 మంది దరఖాస్తు చేసుకోగా ఈ నెల 9న జరిగిన పరీక్షకు 50,961 మంది హాజరయ్యారు. అందులో 47,644 మంది (93.49 శాతం) ర్యాంకులు పొందారు. మొత్తంగా 48,205 మంది అర్హత సాధించినా.. 134 మంది ఇంటర్లో ఫెయిల్ అయ్యారు. మరో 427 మంది విద్యార్థుల ఇంటర్మీడియెట్ వివరాలు ఎంసెట్ కమిటీకి అందలేదు. దీంతో వారిని మినహాయించి 47,644 మందికి ర్యాంకులను కేటాయించారు. ఎంసెట్ స్కోర్‌కు 75 శాతం వెయిటేజీ, ఇంటర్మీడియెట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి కంబైన్డ్ స్కోర్‌ను నిర్ణయించారు. దాని ఆధారంగా ర్యాంకులు ఖరారు చేశారు. తెలంగాణ, ఏపీలో కలిపి మొత్తం 95 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. పరీక్షకు హాజరైన వారిలో 16,722 మంది బాలురు ఉండగా.. వారిలో 15,577 మంది (93.15 శాతం) అర్హత సాధించి ర్యాంకులు పొందారు. ఇక 34,239 మంది బాలికలు పరీక్షకు హాజరు కాగా.. 32,067 మంది (93.65 శాతం) అర్హత సాధించారు. 16 నుంచి ఓఎంఆర్ పత్రాలు పరీక్షకు హాజరైన విద్యార్థుల ఓఎంఆర్ జవాబు పత్రాలను ఎంసెట్ వెబ్సైట్లో (med.tseamcet.in) అందుబాటులో ఉంచనున్నట్లు మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 16వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 19వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు వాటిని వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామన్నారు. మూల్యాంకనంలో ఏమైనా పొరపాట్లు దొర్లితే జనరల్, బీసీ విద్యార్థులు రూ.5 వేలు, ఎస్సీ, ఎస్టీలైతే రూ.2 వేలు చెల్లించి తమ విజ్ఞాపనను ఆన్లైన్ ద్వారా (ఎంసెట్ వెబ్సైట్) అందజేయాలని సూచించారు. 19వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇక ర్యాంకు కార్డులను విద్యార్థులు ఈ నెల 21 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. 25 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో కన్వీనర్ కోటాలోని 2,420 సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ ప్రక్రియను ఈ నెల 25న ప్రారంభించనున్నట్లు మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడించారు. 25వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జనరల్ విద్యార్థులకు, 30, 31 తేదీల్లో ప్రత్యేక కేటగిరీ విద్యార్థులకు (వికలాంగులు, ఆర్మీ, స్పోర్ట్స్ కేటగిరీ) సర్టిఫికెట్ల వెరిఫికే షన్ ఉంటుందన్నారు. ఆగస్టు మొదటి వారంలో ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తామని వెల్లడించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కేంద్రాలను జేఎన్టీయూహెచ్, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఏర్పాటు చేస్తున్నట్లు కాళోజీ వర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. 50 శాతం కన్వీనర్ కోటాలో సీట్ల భర్తీకి ఈ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. మొదట ఎంబీబీఎస్, తర్వాత బీడీఎస్‌లో ప్రవేశాలు చేపడతామన్నారు. ఆ తర్వాత అగ్రికల్చర్, వెటర్నరీ, ఆయుర్వేదిక్, హోమియో, యునానీ, నేచురోపతి కోర్సుల్లో ప్రవేశాలు వరుస క్రమంలో ఉంటాయని చెప్పారు. తర్వాత రెండో దశ లేదా చివరి దశ ప్రవేశాల కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. టాపర్లు వీరే... పేరు ర్యాంకు కంబైన్డ్ స్కోర్ ఎంసెట్ మార్కులు జిల్లా రాజుపాలెం ఉజ్వల్ 1 97.66% 155 రంగారెడ్డి కాసం ఐశ్వర్య 2 97.66% 155 మెదక్ ఎం.సాయి శుశ్రుత 3 97.61% 155 కర్నూలు వేణుమాధవ్ పిన్నింటి 4 97.53% 155 రంగారెడ్డి ఎం.అంకిత్‌రెడ్డి 5 97.36% 155 హైదరాబాద్ జాతప్రోలు ప్రణవి 6 97.19% 154 మహబూబ్‌నగర్ తప్పెట తేజస్విని 7 97.19% 154 అనంతపురం సిద్ధార్థ్ బి రావు 8 97.02% 154 హైదరాబాద్ కొయ్య వినీత్‌రెడ్డి 9 96.98% 154 రంగారెడ్డి సీహెచ్ కృష్ణగీత్ 10 96.90% 154 ఖమ్మం కన్వీనర్ కోటాలో అందుబాటులో ఉన్న సీట్లు ఇవీ.. ఎంబీబీఎస్‌లో.. కేటగిరీ కాలేజీలు సీట్లు ప్రభుత్వ 6 1,060 ప్రైవేటు 14 720 మొత్తం 20 1,780 బీడీఎస్‌లో... ప్రభుత్వ 1 140 ప్రైవేటు 9 500 మొత్తం 10 640 చిన్నప్పటి కోరిక నెరవేరబోతోంది ‘‘నా చదువు కోసం అమ్మానాన్నలు ఎంతో కష్టపడుతున్నారు. వారి కలలను సాకారం చేయడమే నా లక్ష్యం. చిన్నప్పట్నుంచి డాక్టర్ కావాలనే నా కోరిక నెరవేరబోతోంది. కోర్సు పూర్తి చేశాక ఇక్కడే ఆసుపత్రి పెట్టి సేవలందిస్తా’’ అని ఎంసెట్-2లో రెండో ర్యాంకు సాధించిన కాసం ఐశ్వర్య చెప్పారు. మెదక్ జిల్లా ప్రజ్ఞాపూర్‌కు చెందిన ఈమె శ్రీనివాస్, అమృత దంపతుల కుమార్తె. తల్లిదండ్రులు కిరాణా దుకాణం నిర్వహిస్తూ పిల్లల్ని చదివిస్తున్నారు. ఐశ్వర్య సెయింట్ మేరీస్ విద్యానికేతన్‌లో పదోతరగతి, కూకట్‌పల్లిలోని నారాయణ కాలేజీలో ఇంటర్ చదివారు. కార్డియాలజిస్ట్ కావాలని ఉంది కార్డియాలజీ చదివి గ్రామీణ ప్రాంతాల పేదలకు సేవలు చేయాలని ఉందని ఎంసెట్-2లో మూడో ర్యాంకు సాధించిన సాయి శుశ్రుత చెప్పారు. వైద్యులైన తన తల్లితండ్రుల వల్లే ర్యాంకును సాధించాన న్నారు. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన శుశ్రుత ఎంసెట్‌లో 155 మార్కులు సాధించినా ఇంటర్ వెయిటేజ్‌లో ఒక్క మార్కు తగ్గడంతో ఫస్ట్‌ర్యాంక్ మిస్ అయింది. ఈమె పదో తరగతి వరకు కేశవరెడ్డి పబ్లిక్ స్కూల్లో, ఇంటర్ స్థానిక నారాయణ కాలేజీలో చదివారు. ఏపీ ఎంసెట్‌లో 18వ ర్యాంకు సాధించారు. ఫస్ట్ ర్యాంకు వస్తుందనుకోలేదు ‘మెడిసిన్‌లో మంచి ర్యాంకు వస్తుందని ముందే ఊహించా. కానీ ఫస్ట్ ర్యాంకు వస్తుందనుకోలేదు. చాలా సంతోషంగా ఉంది’ అని ఎంసెట్-2లో ఫస్ట్‌ర్యాంకు సాధించిన రాజుపాలెం ఉజ్వల్ పేర్కొన్నారు. ‘నాన్న డాక్టర్ శ్యామ్‌సుందర్ అందించిన సహకారం మరువలేనిది. ఒకటి నుంచి టెన్త్ క్లాస్ వరకు బోయిన్పల్లి సెయింట్ థెరిస్సాలో, కూకట్‌పల్లిలోని శ్రీచైతన్య కళాశాలో ఇంటర్మీడియె ట్ పూర్తి చేశాను. మెడిసిన్‌లో కార్డియో థొరాసిక్ స్పెషాలిటీ చేయాలని ఉంది’’ అని ఆయన చెప్పారు. కార్డియాలజీ చదువుతా మెడిసిన్ పూర్తి చేసి కార్డియాలజిస్ట్‌గా సేవలందిస్తానని ఎంసెట్-2లో నాలుగో ర్యాంకు సాధించిన వేణుమాధవ్ చెప్పారు. హైదరాబాద్‌లోని స్నేహపురికాలనీకి చెందిన ఈయన టెన్త్ రమాదేవి పబ్లిక్ స్కూల్లో, ఇంటర్ చైతన్యపురిలోని శ్రీచైతన్య కాలేజీలో చదివారు. ఇంటర్లో 982 మార్కులు సాధించిన వేణుమాధవ్.. ఏపీ ఎంసెట్‌లో 24వ ర్యాంకు సాధించారు. ఐఎస్ సదన్ అబ్బాయికి 5వర్యాంకు హైదరాబాద్ ఐఎస్ సదన్ డివిజన్‌కు చెందిన ఎం.అంకిత్ రెడ్డి ఎంసెట్-2లో 5వ ర్యాంక్ సాధించాడు. మున్ముందు మరింత ఉన్నతస్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నట్లు అంకిత్ తండ్రి ఎం.నరేశ్చంద్రారెడ్డి పేర్కొన్నారు. ‘అనంత’ విద్యార్థికి ఏడో ర్యాంకు అనంతపురం నగరానికి చెందిన తప్పెట తేజస్విని ఎంసెట్-2లో ఏడోర్యాంకు సాధించారు. ఏపీ ఎంసెట్‌లోనూ ఈమె 29వ ర్యాంకు సాధించారు. తేజస్విని తండ్రి శ్రీబాలాజీ బీఎస్ఎన్ఎల్లో ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. పరిశోధన విభాగంలో స్థిరపడతా జనరల్ మెడిసిన్ పూర్తి చేసి పరిశోధనా విభాగంలో స్థిరపడాలని భావిస్తున్నట్లు ఎంసెట్-2లో ఎనిమిదో ర్యాంకు సాధించిన సిద్ధార్థ్ చెప్పారు. హైదరాబాద్‌లోని అమీర్‌పేటకు చెందిన సిద్ధార్థ్.. పదో తరగతి వరకు బేగంపేటలోని గీతాంజలి స్కూల్లో చదువుకున్నారు. ఇంటర్ఎస్సార్నగర్లో శ్రీచైతన్య కాలేజీలో చదివారు. పేదలకు వైద్యం అందిస్తా కార్డియాలజీ చేసి పేదలకు వైద్యాన్ని అందించడమే తన లక్ష్యమని తొమ్మిదో ర్యాంకు సాధించిన వినీత్‌రెడ్డి తెలిపారు. ఈయన తండ్రి కేయిర్న్ కంపెనీలో ఇంజనీరుగా పని చేస్తుండగా తల్లి గృహిణి. వినీత్ పదో తరగతి వరకు నారాయణ ఒలింపియాడ్‌లో, ఇంటర్ నారాయణగూడలోని శ్రీచైతన్య బ్రాంచ్‌లో చదివారు. పేదలకు ఉచిత వైద్యం అందిస్తా ‘‘ప్రణాళిక బద్ధంగా చదవడం వల్లనే ఈ ర్యాంకు సాధ్యమైంది. ఢిల్లీ ఏయిమ్స్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేసి మంచి డాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకుంటా’’ అని ఎంసెట్-2లో ఆరో ర్యాంకు సాధించిన ప్రణవి తెలిపారు. పుట్టి, పెరిగిన అచ్చంపేట ప్రాంతానికి సేవలందిస్తానని, పేదలకు ఉచిత వైద్యసేవ చేస్తానని చెప్పారు. -
నేడు ఎంసెట్-2 ర్యాంకులు
-
నేడు ఎంసెట్-2 ర్యాంకులు
- విడుదల చేయనున్న మంత్రి లక్ష్మారెడ్డి - ప్రాథమిక కీపై పదిలోపే అభ్యంతరాలు - సెట్ కన్వీనర్ రమణారావు వెల్లడి - ఇంటర్ మార్కులకు 25% వెయిటేజీ సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 9న నిర్వహించిన ఎంసెట్-2 ర్యాంకులను బుధవారం సాయంత్రం 5 గంటలకు సచివాలయంలో మంత్రి లక్ష్మారెడ్డి విడుదల చేయనున్నారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఇంటర్మీడియెట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకులను ఖరారు చేయనున్నారు. ఈ నెల 9న ప్రకటించిన ప్రాథమిక కీపై మంగళవారం మధ్యాహ్నం 2 గం. వరకు పది లోపే అభ్యంతరాలు వచ్చినట్లు ఎంసెట్-2 కన్వీనర్ ప్రొ. ఎన్వీ రమణారావు వెల్లడించారు. అవి కూడా 2 ప్రశ్నలకు సంబంధించినవేనని పేర్కొన్నారు. మొత్తంగా పరీక్షలో ఇచ్చిన ప్రశ్నపత్రంలో ఎలాంటి తప్పులు దొర్లలేదని నిపుణుల కమిటీ తేల్చినట్లు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 95 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 56,153 మంది విద్యార్థులు దరఖాస్తుచేసుకోగా 50,964 మంది పరీక్షకు హాజరయ్యారు. అర్హత సాధించిన అందరికీ ర్యాంకులను ఇచ్చేందుకు ఎంసెట్ కమిటీ చర్యలు చేపట్టింది. హైదరాబాద్ జోన్లో పరీక్ష రాసేందుకు 20,648 మంది రిజిస్టర్ చేసుకోగా 19,356 మంది హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ పరీక్ష రాసేందుకు 17,939 మంది దరఖాస్తు చేసుకోగా 15,523 మంది హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం ఎంసెట్-2 ఫలితాలను ఈ నెల 14న విడుదల చేయాల్సి ఉంది. అయితే ఆ రోజున మంత్రి లక్ష్మారెడ్డి హైదరాబాద్‌లో అందుబాటులో ఉండడం లేదు. దీంతో 13నే ఫలితాలు విడుదల చేసేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి ఎంసెట్ కమిటీని ఆదేశించినట్లు తెలిసింది. -
ఎంసెట్-2 పరీక్షకు సర్వం సిద్ధం
హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంసెట్-2 పరీక్షను ఈ నెల 9న నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్షకు హాజరయ్యే 56,188 మంది విద్యార్థుల కోసం 95 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ నుంచి 38,245 మంది విద్యార్థులు హాజరు కానుండగా, ఆంధ్రప్రదేశ్ నుంచి 17,943 మంది (31.93 శాతం) విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు ఎంసెట్-2 కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణరావు తెలిపారు. విద్యార్థుల బయో మెట్రిక్ డేటా, వేలిముద్రలు, డిజిటల్ ఫొటోలు సేకరించనున్న నేపథ్యంలో విద్యార్థులను గంట ముందుగానే పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని వివరించారు. ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు నిర్వహించే ఈ పరీక్ష ప్రారంభ సమయం తరువాత నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాల్లోకి అనుమతించేది లేదని, విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. వర్షాకాలం అయినందున మరింత జాగ్రత్త పడాలని కోరారు. మాల్ ప్రాక్టీస్ నిరోధానికి సమస్యాత్మక కేంద్రాల్లో 20 జామర్లను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రూ.5 వేలు, రూ.10 వేలు ఆలస్య రుసుం చెల్లించి దరఖాస్తు చేసినవారి, మళ్లీ మళ్లీ ఎంసెట్ రాస్తున్న అభ్యర్థులకు సంబంధించి వారు ఎందుకు పరీక్షకు హాజరు అవుతున్నారన్న అంశంపై పోలీసు విచారణ చేయిస్తున్నట్లు చెప్పారు. 1970 నుంచి 1994 మధ్యలో జన్మించినవారు, గతంలో ఎంసెట్ రాసి, ఎంపికై.. మెడిసిన్ చదువుతూ ఎంసెట్ రాసేందుకు దరఖాస్తు చేసిన వారి వివరాలను కూడా పోలీసు శాఖకు అందజేశామన్నారు. 1981 నుంచి ఇప్పటివరకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైనవారు పరీక్షకు హాజరవుతున్నట్లు తెలిపారు. వారి చిరునామాలు, ఫోన్ నంబర్లను ఇంటలిజెన్స్ విభాగానికి అందజేసినట్లు తెలిపారు. అర్హత సాధించే విద్యార్థులకు ర్యాంకులను ఈ నెల 14న విడుదల చేస్తామని రమణారావు తెలిపారు. పరీక్ష ప్రాథమిక కీ ని ఈ నెల 9వ తేదీనే విడుదల చేస్తామని, దానిపై 12వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని పేర్కొన్నారు. -
ఈనెల 9న ఎంసెట్-2..
హాజరుకానున్న 56,108 మంది విద్యార్థులు మాల్ ప్రాక్టీస్ నిరోధానికి హైటెక్ ఏర్పాట్లు అడుగడుగునా పోలీసు నిఘా నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ ఆంధ్రప్రదేశ్ నుంచి 17,934 మంది దరఖాస్తు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణారావు వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంసెట్-2 పరీక్షను ఈనెల 9న నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంసెట్-2 కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణారావు తెలిపారు. 9వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే ఈ పరీక్షకు హాజరయ్యేందుకు 56,108 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు. వారి కోసం రాష్ట్ర వ్యాప్తంగా 95 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇక మాల్ ప్రాక్టీస్ నిరోధానికి సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు వంటి హైటెక్ నిఘా ఏర్పాట్లు చేయడంతోపాటు 20 జామర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రానికి ఒక ఎన్ఫోర్స్మెంట్ అధికారిని నియమిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష హాల్లోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాయడాన్ని నిరోధించేందుకు ఈసారి విద్యార్థుల బయోమెట్రిక్ డాటాను సేకరిస్తున్నామని, వేలి ముద్రలు, డిజిటల్ ఫొటోలు తీసుకుంటామని వెల్లడించారు. ఇక రూ.5 వేలు, రూ.10 వేలు ఆలస్య రుసుము చెల్లించి దరఖాస్తు చేసిన వారిని, మళ్లీ మళ్లీ ఎంసెట్ రాస్తున్న అభ్యర్థులకు సంబంధించి వారు ఎందుకు పరీక్షకు హాజరు అవుతున్నారన్న అంశంపై పోలీసు విచారణ చేయిస్తున్నట్లు చెప్పారు. వారి చిరునామాలు, ఫోన్ నంబర్లను ఇంటెలిజెన్స్ విభాగానికి అందజేసినట్లు తెలిపారు. 1970 నుంచి 1994 మధ్యలో జన్మించిన వారు గతంలో ఎంసెట్ రాసి, ఎంపికై, మెడిసిన్ చదువుతూ ఎంసెట్ రాసేందుకు దరఖాస్తు చేసిన వారి వివరాలను కూడా పోలీసు శాఖకు అందజేశామన్నారు. బాంబు డిస్పొజల్ స్క్వాడ్ ఆధ్వర్యంలో పరీక్ష కేంద్రాల్లో తనిఖీలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. మహిళా పోలీసులను కూడా అందుబాటులో ఉంచుతున్నట్లు వెల్లడించారు. పరీక్షకు సంబంధించి వివరాలు.. జాగ్రత్తలు.. - విద్యార్థులు కచ్చితంగా కలర్ ఫొటోను ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తు ఫారంపై అంటించాలి. ఆ దరఖాస్తు ఫారాన్ని పరీక్ష హాల్లో అందజేయాలి. - పరీక్ష సమయానికి నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. - ప్రశ్నలతోపాటు జవాబుల ఆప్షన్లలో కూడా జంబ్లింగ్ అమలు చేస్తున్నారు. - పరీక్ష కేంద్రాల్లో బాలికలను తనిఖీ చేసేందుకు, మహిళా హోంగార్డులను నియమిస్తున్నారు. - ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల వివరాలను కూడా పోలీసు పరిశీలన కోసం అందజేశారు. - ఈసారి విద్యార్థులకు కార్బన్‌లెస్ జవాబుల పత్రం ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. - ఈసారి పరీక్షకు కొత్త విద్యార్థులు 33,300 మంది హాజరుకానుండగా, గత ఏడాది ఇంటర్మీడియెట్ పూర్తయిన వారు 15,435 మంది దరఖాస్తు చేశారు. 2014లో పాసైన వారు 5,041 మంది, 2013లో పాసైన వారు 1,474 మంది, 2012లో ఉత్తీర్ణులైన వారు 455 మంది, 2011లో ఉత్తీర్ణులైన వారు 167, 2010లో పాసైన వారు 67 మంది ఉన్నారు. ఇలా 1981 నుంచి ఇప్పటివరకు ఇంటర్ పాసైన వారు ఈ మెడికల్ ఎంసెట్‌కు హాజరయ్యేందుకు దరఖాస్తు చేశారు. - ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ పరీక్షకు హాజరయ్యేందుకు 17,934 మంది దరఖాస్తు చేశారు. - వారికి విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కర్నూలులో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. -
జులై 9న తెలంగాణ మెడికల్ ప్రవేశ పరీక్ష
హైదరాబాద్ : నీట్' పై కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇచ్చిన నేపథ్యంలో ఎంసెట్ -2 (2016) పరీక్ష నిర్వహించాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఎంసెట్-2 షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. దీంతో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు మరో పరీక్ష నిర్వహించనుంది. ఇందుకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖమంత్రి లక్ష్మారెడ్డి బుధవారం సెక్రటేరియట్‌లోని తన చాంబర్లో ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, కాళోజి హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్. కరుణాకర్ రెడ్డి, ఎంసెట్ కన్వీనర్ రమణారావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 28న ఎంసెట్-2కు నోటిఫికేషన్ వెలువడనుంది. జులై 9న తెలంగాణ మెడికల్ ప్రవేశ పరీక్ష నిర్వహించి, 14న ఫలితాలను విడుదల చేయనున్నారు. వచ్చేనెల 1వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. అప్లికేషన్ల స్వీకరణకు జూన్ 7 చివరి తేదీ. *ఈ నెల 28న ఎంసెట్-2 నోటిఫికేషన్ *వచ్చే నెల 1వ తేదీ నుంచి ఆన్ లైన్ అప్లికేషన్ల స్వేకరణ *అప్లికేషన్ల స్వీకరణకు ఆఖరు తేదీ 07-06-2016 *రూ. 500/- ఫైన్ తో 14-06-2016 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు *రూ. 1000/- ఫైన్ తో 21-06-2016 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు *రూ. 5000/- ఫైన్ తో 28-06-2016 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు *రూ. 10000/- ఫైన్ తో 06-07-2016 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు *02-07-2016 నుంచి 07-07-2016 వరకు హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకునే అవకాశం * జూలై 9న తెలంగాణ స్టేట్ ఎంసెట్-2 (2016) పరీక్ష *ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు *జూలై 9న ప్రిలిమినరీ కీ విడుదల *12వ తేదీ లోగా ప్రిలిమినరీ కీ ఫై అభ్యంతరాలు తెలుపుకోవచ్చు *14న ర్యాంకుల ప్రకటన *రిజిస్ట్రేషన్ ఫీజుల వివరాలు: ఎస్సీ, ఎస్టీలకు రూ.250/,ఇతరులకు రూ. 500/-