ఎంసెట్–2 పాత్రధారులపై సీఐడీ కన్ను..!
Published Wed, Jul 27 2016 1:28 AM | Last Updated on Sat, Aug 11 2018 8:21 PM
వరంగల్ : ఎంసెట్–2 ప్రశ్నపత్రం లీకేజీ అయిందని ప్రాథమికంగా నిర్ధారించిన సీఐడీ అధికారులు నివేదికను ప్రభుత్వానికి అందజేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న వారిని గుర్తించేందుకు సీఐడీ బృందం జిల్లాలో పర్యటించినట్లు తెలిసింది. మంగళవారం బృందం అధికారులు పరకాల, భూపాలపల్లి కేంద్రాల నుంచి ఎంసెట్–2తో ర్యాంకులు సాధించిన విద్యార్థుల వివరాలను ఆరా తీసినట్లు సమాచారం. లీకేజీ వ్యవహారం బయటకు రావడంతో ర్యాంకులు సాధించిన వారు స్థానికంగా లేకుండా బంధువుల ఇళ్లకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. కాగా, పరకాలలో ఎంసెట్‌తో సంబంధం ఉన్న ఒక వ్యాపారి షాపు మూసి ఉండడంతో సీఐడీ అధికారులు ఆయనను అరెస్ట్ చేసినట్లు వదంతులు వ్యాపించాయి. అయితే మం గళవారం దుకాణాలకు సెలవు కావడం వల్లే షాపు మూసి ఉందని స్థానికులు ఆలస్యంగా గుర్తించారు. ఇదిలా ఉండగా, ఎంసెట్–2 లీకేజీతో సంబంధం ఉన్న భూపాలపల్లికి చెందిన మరో వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతున్న తమ బంధువుల ఇంటికి పరామర్శకు వెళ్లినట్లు తెలుస్తోంది. సీఐడీ అధికారులు ప్రాథమికంగా ఇచ్చిన నివేదిక ప్రకారం ఆరోపణలు ఉన్న వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించే అవకాశాలున్నట్లు తెలిసింది. ఈ లీకేజీ వ్యవహారంతో ఎంసెట్–2 నిర్వాహకులతో సంబంధం ఉందని అనుమానిస్తున్న సీఐడీ వారిని ముందుగా విచారిస్తే జిల్లాలో ఎవరెవరు ఉన్నారన్న విషయం స్పష్టమయ్యే అవకాశాలున్నాయి.
Advertisement