EM-CET
-
వచ్చే నెలలో ఎంసెట్!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో వివిధ వృత్తి, సాంకేతిక విద్యాకోర్సుల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్షలను నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. వచ్చే నెల ఒకటి నుంచి ఆరో తేదీ వరకు జేఈఈ మెయిన్ పరీక్షలను నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఇప్పటికే షెడ్యూలును ఖరారు చేసిన నేపథ్యంలో రాష్ట్రంలోనూ ప్రవేశ పరీక్షల నిర్వహణకు మండలి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఈ నెల 10న తేదీలను ఖరారు చేసే అవకాశం ఉంది. అయితే గతంలో మాదిరిగా వరుసగా ప్రవేశ పరీక్షల నిర్వహణ ఈసారి సాధ్యమయ్యే పరిస్థితి లేదు. దీంతో పరీక్షల నిర్వహణ సంస్థ అయిన టీసీఎస్ ఖాళీ స్లాట్స్‌ను బట్టి పరీక్షలను నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటివరకున్న సమాచారం మేరకు ఈ నెల 14వ తేదీ వరకు టీసీఎస్ తేదీలు ఖాళీగా ఉన్నాయి. మరోవైపు ఈ నెల 18, ఆ తరువాత ఈ నెల 24వ తేదీ నుంచి స్లాట్స్ ఖాళీ ఉన్నాయి. అయితే ఈ నెల 14వ తేదీ వరకు పరీక్షల నిర్వహించే పరిస్థితి లేదు. సెట్స్ తేదీలను ప్రకటించిన తరువాత... సాధారణంగా సెట్స్ తేదీలను ప్రకటించిన తరువాత కనీసంగా 10 నుంచి 15 రోజుల గడువును విద్యార్థుల ప్రిపరేషన్ కోసం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 20 వరకు పరీక్షల నిర్వహణ కష్టమే. వీలైతే ఈ నెల 24 నుంచి ఉండే స్లాట్స్‌లో ఎంసెట్ పరీక్షలను ప్రారంభించే అవకాశం ఉంది. కుదరదనుకుంటే వచ్చే నెలలోనే ఎంసెట్ పరీక్షలను నిర్వహించే అవకాశముంది. మరోవైపు ఈ నెల 24 నుంచి 31 వరకు ఈసెట్, ఐసెట్, పీజీఈసెట్, ఎడ్‌సెట్ వంటి వాటిల్లో ఒకటీ రెండు పరీక్షలను నిర్వహించి వచ్చే నెల 6వ తేదీ తరువాత టీసీఎస్ స్లాట్స్‌ను బట్టి మిగతా పరీక్షలను నిర్వహించే అవకాశం ఉంటుంది. వచ్చే నెల మూడో వారంలో ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ తదితర ప్రవేశ పరీక్షలను నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో వచ్చే నెల రెండో వారంలో తెలంగాణ ఎంసెట్‌ను నిర్వహించేలా తేదీలను ఖరారు చేసే అవకాశం ఉంది. టీసీఎస్ స్లాట్స్ కనుక వరుసగా ఖాళీ లేకపోయినా వేర్వేరు రోజుల్లోనూ పరీక్షలను నిర్వహించేలా ఉన్నత విద్యా మండలి ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తోంది. ఈ పరీక్షల నిర్వహణ కోసం 4.60 లక్షల మంది విద్యార్థులు ఎదురు చూస్తున్న నేపథ్యంలో సోమవారం నిర్వహించే ఉన్నత స్థాయి సమావేశానికి మరోసారి టీసీఎస్ ప్రతినిధులను ఆహ్వానించి తేదీలపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఆ తరువాత పరీక్షల తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. -
ఎంసెట్ –3కి ఏర్పాట్లు పూర్తి
రీజినల్ కో ఆర్డినేటర్ మల్లారెడ్డి కేయూ క్యాంపస్ : తెలంగాణ రాష్ట్రంలో ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశాలకు ఈ నెల 11న జరుగనున్న టీఎస్ ఎంసెట్ –3 నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఎంసెట్ –3 రీజినల్ కోఆర్డినేటర్, కేయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి.మల్లారెడ్డి తెలిపారు. ఈ మేర కు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వరంగల్‌లో 4,710 మంది పరీక్ష రాయబోతున్నారని పేర్కొన్నారు. 11న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు పరీక్ష ఉంటుందని తెలి పారు. హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, కేయూ ఇంజనీరింగ్ కళాశాల, యూనివర్సిటీ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల, యూనివర్సిటీ ఫార్మసీ కళాశాల, వడ్డేపల్లిలోని ప్రభుత్వ పింగిళి డిగ్రీ కళాశాల, సీకేఎం ఆర్ట్స్‌అండ్‌సైన్స్ కళాశాల, వరంగల్ ఎల్బీ కళాశాలల్లో పరీక్ష కేంద్రాలు ఉంటాయని వివరించారు. పరీక్ష సమయానికి గంట ముందు నుంచే కేంద్రాల్లోకి పంపిస్తామని, నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని స్పష్టం చేశారు. -
ఎంసెట్–2 పాత్రధారులపై సీఐడీ కన్ను..!
వరంగల్ : ఎంసెట్–2 ప్రశ్నపత్రం లీకేజీ అయిందని ప్రాథమికంగా నిర్ధారించిన సీఐడీ అధికారులు నివేదికను ప్రభుత్వానికి అందజేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న వారిని గుర్తించేందుకు సీఐడీ బృందం జిల్లాలో పర్యటించినట్లు తెలిసింది. మంగళవారం బృందం అధికారులు పరకాల, భూపాలపల్లి కేంద్రాల నుంచి ఎంసెట్–2తో ర్యాంకులు సాధించిన విద్యార్థుల వివరాలను ఆరా తీసినట్లు సమాచారం. లీకేజీ వ్యవహారం బయటకు రావడంతో ర్యాంకులు సాధించిన వారు స్థానికంగా లేకుండా బంధువుల ఇళ్లకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. కాగా, పరకాలలో ఎంసెట్‌తో సంబంధం ఉన్న ఒక వ్యాపారి షాపు మూసి ఉండడంతో సీఐడీ అధికారులు ఆయనను అరెస్ట్ చేసినట్లు వదంతులు వ్యాపించాయి. అయితే మం గళవారం దుకాణాలకు సెలవు కావడం వల్లే షాపు మూసి ఉందని స్థానికులు ఆలస్యంగా గుర్తించారు. ఇదిలా ఉండగా, ఎంసెట్–2 లీకేజీతో సంబంధం ఉన్న భూపాలపల్లికి చెందిన మరో వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతున్న తమ బంధువుల ఇంటికి పరామర్శకు వెళ్లినట్లు తెలుస్తోంది. సీఐడీ అధికారులు ప్రాథమికంగా ఇచ్చిన నివేదిక ప్రకారం ఆరోపణలు ఉన్న వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించే అవకాశాలున్నట్లు తెలిసింది. ఈ లీకేజీ వ్యవహారంతో ఎంసెట్–2 నిర్వాహకులతో సంబంధం ఉందని అనుమానిస్తున్న సీఐడీ వారిని ముందుగా విచారిస్తే జిల్లాలో ఎవరెవరు ఉన్నారన్న విషయం స్పష్టమయ్యే అవకాశాలున్నాయి. -
ఏపీ ఎంసెట్ భద్రతకు గవర్నర్ హామీ
విద్యార్థులకు ఇబ్బంది కలగనివ్వం: మంత్రి గంటా సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నిర్వహించే ఎంసెట్‌కు తెలంగాణలో ఏర్పాటు చేసే కేంద్రాల విషయంలో తగిన భద్రత కల్పించే అంశంపై మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ నిర్వహించే ఎంసెట్‌తో తమకెలాంటి సంబంధం లేదని తెలంగాణ ప్రభుత్వం చెబుతోందన్న విషయాన్ని గురువారం రాజ్‌భవన్‌కు వెళ్లిన మంత్రి గవర్నర్‌కు వివరించారు. అనంతరం మంత్రి గంటా మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అవసరమైన భద్రతా చర్యలు తీసుకునేలా చూస్తానని గవర్నర్ హామీ ఇచ్చారని చెప్పారు. మేరకు తెలంగాణ డీజీపీ అనురాగ్‌శర్మ, నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డిలకు గవర్నర్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. -
శ్రీచైతన్య నారాయణ అద్భుత విజయాలు
ఎంసెట్ ఫలితాల్లో కనీవినీ ఎరుగుని అద్భుత విజయాలు శ్రీచైతన్య నారాయణ విద్యాసంస్థలు సాధించాయని సంస్థల అధినేతలు బి.ఎస్.రావు, సింధు నారాయణ తెలిపారు. మెడికల్ స్టేట్ ఫస్ట్ ర్యాంకుతో పాటు తొలి 10ర్యాంకుల్లో 10, 25 ర్యాంకుల్లో 23 తమ విద్యార్థులు కైవసం చేసుకున్నారని చెప్పారు. ఫస్ట్ ర్యాంక్ గుర్రం సాయి శ్రీనివాస్, రెండో ర్యాంక్ బి.దివ్య, మూడో ర్యాంక్ కె. పృథ్వీరాజ్, 4వ ర్యాంక్ డి.హరిత, 5వ ర్యాంక్ మనోగ్నిత రెడ్డి, 6వ ర్యాంక్ భరత్‌కుమార్, 7వ ర్యాంక్ పి.శ్రీవిద్య, 8వ ర్యాంక్ సాత్విక్‌రెడ్డి, 9వ ర్యాంక్ ఆర్.సాయి హర్ష తేజ, 10 ర్యాంక్ గంటా సాయి నిఖిల సాధించారని పేర్కొన్నారు. 50లోపు 45 ర్యాంక్‌లు, 100లోపు 93 ర్యాంక్‌లు కైవసం చేసుకున్నట్లు వెల్లడించారు. కాగా ఇంజనీరింగ్ స్టేట్ ఫస్ట్ ర్యాంకుతో పాటు మొదటి 10 ర్యాంకుల్లో 10, 25 ర్యాంకుల్లో 24 నారాయణ శ్రీచైతన్య విద్యార్థులు సాధించారని చెప్పారు. ఫస్ట్ ర్యాంక్ ఎన్.పవన్‌కుమార్, రెండో ర్యాంక్ చాణుక్య వర్ధన్‌రెడ్డి, మూడో ర్యాంక్ నిఖిల్‌కుమార్, 4వ ర్యాంక్ నారు దివాకర్‌రెడ్డి, 5వ ర్యాంకు వి.ఆదిత్యవర్ధన్, 6వ ర్యాంక్ ప్రేమ్ అభినవ్, 7వ ర్యాంక్ అక్షయ్కుమార్రెడ్డి, 8వర్యాంక్ సాయి కాశ్యప్, 9వ ర్యాంకు పి.ఎస్.సూర్యప్రహర్ష, 10వ ర్యాంక్ సాయి చేతన్ కైవసం చేసుకున్నారని పేర్కొన్నారు. 50లోపు 47 ర్యాంక్‌లు, 100లోపు 92 ర్యాంక్‌లు సాధించారని వెల్లడించారు. -
‘విజ్ఞాన్’ విజయోత్సాహం
ఎంసెట్ ఫలితాలలో విజ్ఞాన్ జూనియర్ కళాశాలల విద్యార్థులు అద్భుత ప్రతిత చూపినట్లు యాజమాన్యం తెలిపింది. 93 శాతం మంది విద్యార్థులు క్వాలిఫై అయినట్లు వివరించింది. గుంటూరు జిల్లాలోని వడ్లమూడి, పలకలూరు, ఎల్ఐసీ కాలనీ, హైదరాబాద్‌లోని కొండాపూర్, నిజాంపేట్, విశాఖపట్నంలోని అన్ని ప్రాంగణాలోనూ తమ విద్యార్థులు ఇదే స్థాయి ఫలితాలు సాధించినట్లు పేర్కొంది. తరగతి గదిలో 30 నుంచి 35 మంది విద్యార్థులు మాత్రమే ఉండటం, అన్ని వసతులతో కూడిన సువిశాల ప్రాంగణాలు, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒత్తిడి లేని బోధన ద్వారా ఉత్తమ ఫలితాలు దక్కించుకున్నట్లు విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య చెప్పారు. జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్, జేఈఈ మెయిన్స్‌లో కూడా తమ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారన్నారు. 30 ఏళ్లుగా ఇంటర్ విద్యలో విజ్ఞాన్ సాధిస్తున్న అపూర్వ విజయాలకు తమ విద్యా ప్రణాళికే కారణమని చెప్పారు. విజ్ఞాన్ సత్తా చాటిన విద్యార్థులు, ప్రేరణగా నిలిచిన అధ్యాపకులకు లావు రత్తయ్య, వైస్ చైర్మన్లు లావు శ్రీకృష్ణదేవరాయలు, రాణి రుద్రమదేవి అభినందనలు తెలిపారు. -
ఇంటర్లో ఫెయిలైన ఎంసెట్ ర్యాంకర్లు
36 వేల మందిది ఇదే పరిస్థితి రీ వెరిఫికేషన్‌లో వచ్చిన మార్కులు లేకుండానే ఎంసెట్ ర్యాంకులు హైదరాబాద్: ఎంసెట్‌లో ర్యాంకు సాధించినా, ఇంటర్ మీడియెట్‌లో 36,310 మంది ఫెయిల్ అయ్యారు. అయితే చాలా మందికి ఇంటర్మీడియట్లో పరీక్షలు బాగా రాశామని నమ్మకం ఉన్న విద్యార్థులు, తక్కువ మార్కులు వచ్చిన వారు, ఫెయిల్ అయిన వారు రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో చాలా మందికి మార్కులు అదనంగా కలిశాయి. 1 నుంచి 10 మార్కుల వరకు కూడా కలిసిన విద్యార్థులు ఉన్నారు. అయితే, ఇలా అదనంగా వచ్చిన వారి మార్కులను మాత్రం ఎంసెట్ ర్యాంకుల ఖరారులో పరిగణనలోకి తీసుకోలేదు. ఇంటర్మీడియెట్ బోర్డు సంబంధిత వివరాలను ఎంసెట్ వర్గాలకు ఇంతవరకు ఇవ్వకపోవడమే ఇందుకు కారణం. దీంతో తాము తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. తమకు రీవెరిఫికేషన్ ద్వారా అదనంగా వచ్చిన మార్కులతో పాస్ అయిన విద్యార్థులు, మార్కులు పెరిగిన విద్యార్థులు తమకు నష్టం వాటిల్లిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక మే 22న జరిగిన ఈ పరీక్షకు ఇంజనీరింగ్‌లో 2,66,820 మంది హాజరు కాగా 1,88,831 మంది (70.77 శాతం) అర్హత సాధించి ర్యాంకులు పొందారు. అయితే మరో 24,723 మంది ఎంసెట్‌లో అర్హత సాధించినా ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయ్యారు. ఇక 1,782 మంది ఇంటర్మీడియట్లో పాస్ అయ్యారో, ఫెయిల్ అయ్యారో కూడా తెలియదు. అయితే వారిని ఫెయిల్ అయినట్టుగా పరిగణనలోకి తీసుకున్నారు. ఇక అగ్రికల్చర్ అండ్ మెడిసిన్‌లో 1,06,396 మంది పరీక్ష రాయగా 98,292 మంది (83.16శాతం) అర్హత సాధించి ర్యాంకులు పొందారు. మరో 8,371 మంది ర్యాంకు పొందినా ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయ్యారు. 1,434 మంది ఇంటర్లో పాస్ అయ్యారో, ఫెయిల్ అయ్యారో కూడా తెలియదు. వారిని కూడా ఫెయిల్ అయినట్టుగానే పరిగణించారు.