నేడు ఎంసెట్-2 ర్యాంకులు
- విడుదల చేయనున్న మంత్రి లక్ష్మారెడ్డి
- ప్రాథమిక కీపై పదిలోపే అభ్యంతరాలు
- సెట్ కన్వీనర్ రమణారావు వెల్లడి
- ఇంటర్ మార్కులకు 25% వెయిటేజీ
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 9న నిర్వహించిన ఎంసెట్-2 ర్యాంకులను బుధవారం సాయంత్రం 5 గంటలకు సచివాలయంలో మంత్రి లక్ష్మారెడ్డి విడుదల చేయనున్నారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఇంటర్మీడియెట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకులను ఖరారు చేయనున్నారు. ఈ నెల 9న ప్రకటించిన ప్రాథమిక కీపై మంగళవారం మధ్యాహ్నం 2 గం. వరకు పది లోపే అభ్యంతరాలు వచ్చినట్లు ఎంసెట్-2 కన్వీనర్ ప్రొ. ఎన్‌వీ రమణారావు వెల్లడించారు. అవి కూడా 2 ప్రశ్నలకు సంబంధించినవేనని పేర్కొన్నారు. మొత్తంగా పరీక్షలో ఇచ్చిన ప్రశ్నపత్రంలో ఎలాంటి తప్పులు దొర్లలేదని నిపుణుల కమిటీ తేల్చినట్లు వివరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 95 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 56,153 మంది విద్యార్థులు దరఖాస్తుచేసుకోగా 50,964 మంది పరీక్షకు హాజరయ్యారు. అర్హత సాధించిన అందరికీ ర్యాంకులను ఇచ్చేందుకు ఎంసెట్ కమిటీ చర్యలు చేపట్టింది. హైదరాబాద్ జోన్‌లో పరీక్ష రాసేందుకు 20,648 మంది రిజిస్టర్ చేసుకోగా 19,356 మంది హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ పరీక్ష రాసేందుకు 17,939 మంది దరఖాస్తు చేసుకోగా 15,523 మంది హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం ఎంసెట్-2 ఫలితాలను ఈ నెల 14న విడుదల చేయాల్సి ఉంది. అయితే ఆ రోజున మంత్రి లక్ష్మారెడ్డి హైదరాబాద్‌లో అందుబాటులో ఉండడం లేదు. దీంతో 13నే ఫలితాలు విడుదల చేసేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి ఎంసెట్ కమిటీని ఆదేశించినట్లు తెలిసింది.