Primary Key
-
ఏపీపీఎస్సీ గ్రూప్-2 ప్రిలిమ్స్ కీ విడుదల
సాక్షి, గుంటూరు: ఏపీపీఎస్సీ గ్రూప్ -2 ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక కీ విడుదలైంది. గ్రూప్-2 కింద 897 ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి 25న రాష్ట్ర వ్యాప్తంగా 1,327 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు 4,63,517 మంది హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోగా.. 4,04,037 (87.17%) మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇక ప్రాథమిక కీపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఫిబ్రవరి 27 నుంచి 29 వరకు ఆన్లైన్లో మాత్రమే సమర్పించాలని సూచించింది. పోస్టు/వాట్సప్/ఎస్ఎంఎస్/ఫోన్/వ్యక్తిగతంగా సమర్పిస్తే పరిగణనలోకి తీసుకోబోమని ఏపీపీఎస్సీ తేల్చి చెప్పింది. స్క్రీనింగ్ పరీక్ష ఫలితాలను ఐదు నుంచి ఎనిమిది వారాల్లో ప్రకటించే అవకాశం ఉందని ఏపీపీఎస్సీ అధికారులు తెలిపారు. ఏపీపీఎస్సీ గ్రూప్ -2 మెయిన్ పరీక్షను జూన్/జులైలో నిర్వహించే అవకాశం ఉంది. -
తెలంగాణ: టెట్ ప్రాథమిక కీ వచ్చేసింది
హైదరాబాద్: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్-టెట్) ప్రాథమిక కీ విడుదల అయ్యింది. జూన్ 12న టెట్ నిర్వహించిన విషయం తెలిసిందే. కీ ద్వారా సమాధానాలపై అభ్యంతరాలుంటే.. జూన్ 18లోపు ఆన్లైన్లో సమర్పించొచ్చు. Telangana TET Key రిలీజ్ అయ్యిందని బుధవారం సాయంత్రం కన్వీనర్ రాధారెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ నెల 27న టెట్ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. tstet.cgg.gov.in వెబ్సైట్ ద్వారా కీ డౌన్లోడ్ చేస్కోవచ్చు. తెలంగాణ టెట్ పరీక్షకు 90 శాతం హాజరు నమోదు అయ్యింది. ఉదయం జరిగిన పేపర్-1 పరీక్షకు 3,51,482 మంది దరఖాస్తు చేసుకోగా.. 3,18,506 మంది (90.62 శాతం) హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పేపర్-2 పరీక్షకు 2,77,900 మంది దరఖాస్తు చేసుకోగా, 2,51,070 మంది (90.35 శాతం) హాజరయ్యారు. -
ఆ పోస్టుల ప్రాథమిక కీలపై అభ్యంతరాలు స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: వివిధ శాఖల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షల ప్రాథమిక కీలను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. వాటిపై ఈ నెల 25 నుంచి వచ్చే నెల 2 వరకు అభ్యంతరాలను ఆన్లైన్లో స్వీకరిస్తామని పేర్కొంది. వెబ్సైట్లో ఇచ్చిన ప్రత్యేక లింకు ద్వారా అభ్యర్థులు తమ అభ్యంతరాలను వెల్లడించవచ్చని వివరించింది. -
జూలై 3న ఓయూసెట్ ఫలితాలు
హైదరాబాద్: ఓయూసెట్– 2017 ఫలితాలు జూలై 3న విడుదల కానున్నాయి. ఓయూతో పాటు తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు వర్సిటీల్లో ప్రవేశాలకు ఓయూసెట్ నిర్వహించిన విషయం విదితమే. సెట్ ప్రాథమిక కీ ఇటీవల విడుదల చేశారు. ఫైనల్ కీ విడుదలైన వెంటనే ఫలితాలను ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. -
నేడు ఎంసెట్-2 ర్యాంకులు
- విడుదల చేయనున్న మంత్రి లక్ష్మారెడ్డి - ప్రాథమిక కీపై పదిలోపే అభ్యంతరాలు - సెట్ కన్వీనర్ రమణారావు వెల్లడి - ఇంటర్ మార్కులకు 25% వెయిటేజీ సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 9న నిర్వహించిన ఎంసెట్-2 ర్యాంకులను బుధవారం సాయంత్రం 5 గంటలకు సచివాలయంలో మంత్రి లక్ష్మారెడ్డి విడుదల చేయనున్నారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఇంటర్మీడియెట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకులను ఖరారు చేయనున్నారు. ఈ నెల 9న ప్రకటించిన ప్రాథమిక కీపై మంగళవారం మధ్యాహ్నం 2 గం. వరకు పది లోపే అభ్యంతరాలు వచ్చినట్లు ఎంసెట్-2 కన్వీనర్ ప్రొ. ఎన్వీ రమణారావు వెల్లడించారు. అవి కూడా 2 ప్రశ్నలకు సంబంధించినవేనని పేర్కొన్నారు. మొత్తంగా పరీక్షలో ఇచ్చిన ప్రశ్నపత్రంలో ఎలాంటి తప్పులు దొర్లలేదని నిపుణుల కమిటీ తేల్చినట్లు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 95 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 56,153 మంది విద్యార్థులు దరఖాస్తుచేసుకోగా 50,964 మంది పరీక్షకు హాజరయ్యారు. అర్హత సాధించిన అందరికీ ర్యాంకులను ఇచ్చేందుకు ఎంసెట్ కమిటీ చర్యలు చేపట్టింది. హైదరాబాద్ జోన్లో పరీక్ష రాసేందుకు 20,648 మంది రిజిస్టర్ చేసుకోగా 19,356 మంది హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ పరీక్ష రాసేందుకు 17,939 మంది దరఖాస్తు చేసుకోగా 15,523 మంది హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం ఎంసెట్-2 ఫలితాలను ఈ నెల 14న విడుదల చేయాల్సి ఉంది. అయితే ఆ రోజున మంత్రి లక్ష్మారెడ్డి హైదరాబాద్‌లో అందుబాటులో ఉండడం లేదు. దీంతో 13నే ఫలితాలు విడుదల చేసేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి ఎంసెట్ కమిటీని ఆదేశించినట్లు తెలిసింది. -
‘టైమంతా కెమిస్ట్రీకే సరిపోయింది’
సాక్షి, హైదరాబాద్: ‘కెమిస్ట్రీలో సమస్యాపూరక ప్రశ్నలు ఎక్కువగా ఇవ్వడం, వాటికే ఎక్కువ సమయం పట్టింది.. ఫిజిక్స్‌లో అన్వయ సంబంధ అంశాలపై ప్రశ్నలు వచ్చాయి... బయాలజీలో తికమక పెట్టేలా ప్రశ్నలు ఉన్నాయి. వీటిన్నిటితో వాటికే ఎక్కువ సమయం అయిపోయింది..’. ఇది శనివారం నిర్వహించిన ఎంసెట్-2కు హాజరైన విద్యార్థుల మనోగతం. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం శనివారం నిర్వహించిన ఎంసెట్-2 పరీక్షకు 90.76 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇక ప్రశ్నల విషయంలో చూస్తే.. సిలబస్ ప్రకారమే ప్రశ్నలు వచ్చాయని, తెలుగు అకాడమీ పుస్తకాల్లోని ప్రశ్నలనే ఇచ్చారని సబ్జెక్టు నిఫుణలు వెల్లడించారు. ప్రశ్నల్లో తప్పులేమీ లేవని పేర్కొన్నారు. అయితే ఈ ప్రశ్నలకు ప్రతిభావంతులైన విద్యార్థులే వేగంగా జవాబులను గుర్తించి రాయగలిగేలా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక పరీక్ష ప్రాథమిక కీని శనివారం సాయంత్రం ఎంసెట్ కమిటీ విడుదల చేసింది. దానిని ఎంసెట్-2 వెబ్సైట్లో (med.tseamcet.in) అందుబాటులో ఉంచింది. ఈ కీపై ఈనెల 12వ మధాహ్నం 2 గంటల వరకు అభ్యంతరాలను మెయిల్ ద్వారా (keyobjectionstseamcet2016@gmail.com) స్వీకరిస్తామని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణరావు వెల్లడించారు. ఇక ర్యాంకులను ఈనెల 14న ప్రకటిస్తామని తెలిపారు. పరీక్షలో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు బుక్ కాలేదని, ఎలాంటి తప్పులు దొర్లలేదని పేర్కొన్నారు. పరీక్షకు ‘ఆర్’ సెట్ కోడ్ కలిగిన ప్రశ్నాపత్రాన్ని ఉదయం 6 గటలకు వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి విడుదల చేశారు. -
రేపే ఎంసెట్-2
- నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ - గంట ముందుగానే పరీక్ష హాల్లోకి అనుమతి - ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు పరీక్ష - హాజరుకానున్న 56,188 మంది విద్యార్థులు - ఏపీ నుంచి 17,943 మంది హాజరు - ఈసారి ఓఎంఆర్ కార్బన్‌లెస్ జవాబుపత్రం అమలు - రేపే ప్రాథమిక కీ విడుదల - 12వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ.. -14న ర్యాంకుల వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంసెట్-2 పరీక్షను ఈనెల 9న నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు నిర్వహించే ఈ పరీక్షకు 56,188 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో తెలంగాణ నుంచి 38,245 మంది, ఆంధ్రప్రదేశ్ నుంచి 17,943 మంది పరీక్ష రాయనున్నారు. తెలంగాణ, ఏపీల్లో కలిపి 95 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక విద్యార్థుల బయోమెట్రిక్ డాటా, డిజిటల్ ఫొటోలు సేకరించనున్న నేపథ్యంలో విద్యార్థులను గంట ముందుగానే పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని ఎంసెట్-2 కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణరావు వెల్లడించారు. పరీక్ష ప్రారంభ సమయం తరువాత నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాల్లోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఎంసెట్-2 ప్రాథమిక కీ ని పరీక్ష రోజున సాయంత్రమే విడుదల చేస్తామని.. దానిపై 12వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని రమణరావు తెలిపారు. ర్యాంకులను 14వ తేదీన ప్రకటిస్తామన్నారు. ఇక మాల్ ప్రాక్టీస్ నిరోధానికి సమస్యాత్మక కేంద్రాల్లో జామర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రూ.5 వేలు, రూ.10 వేలు ఆలస్య రుసుము చెల్లించి దరఖాస్తు చేసిన వారిపై, మళ్లీ మళ్లీ ఎంసెట్ రాస్తున్న అభ్యర్థులకు సంబంధించి వారెందుకు పరీక్షకు హాజరవుతున్నారన్న దానిపై పోలీసు విచారణ చేయిస్తున్నట్లు తెలిపారు. 1970 నుంచి 1994 మధ్య జన్మించిన వారు, గతంలో ఎంసెట్ రాసి, మెడిసిన్ చదువుతూ మళ్లీ ఎంసెట్‌కు దరఖాస్తు చేసిన వారి వివరాలను కూడా పోలీసు శాఖకు అందజేశామన్నారు. ఇక ఎంసెట్-2 రాసేందుకు 609 మంది విద్యార్థులు ఆలస్య రుసుముతో పరీక్ష ఫీజు చెల్లించారు. ఇందులో రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసిన వారు 406 మంది, రూ.1,000 ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసిన వారు 144 మంది, రూ.5 వేల ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసిన వారు 30 మంది, రూ.10 వేల ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసిన వారు 29 మంది ఉన్నారు. ఈ జాగ్రత్తలు తప్పనిసరి - పరీక్ష సమయానికి నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. - పరీక్షహాల్ నుంచి పరీక్ష పూర్తయ్యే వరకు బయటకు వెళ్లనీయరు. - బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్‌తో పరీక్ష రాయాలి. - విద్యార్థులు ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తు ఫారంపై కలర్ ఫొటోను అంటించాలి. ఆ దరఖాస్తు ఫారాన్ని పరీక్ష హాల్లో అందజేయాలి. - ఈసారి ప్రశ్నలతోపాటు జవాబుల ఆప్షన్లలో కూడా జంబ్లింగ్ అమలు చేస్తున్నారు. - మొబైల్స్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, గణిత సంబంధ పరికరాలను పరీక్ష హాల్లోకి అనుమతించరు. - ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల కోసం విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కర్నూలులో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. - ఈసారి పరీక్ష పూర్తవగానే ఓఎంఆర్ జవాబు పత్రం కింద ఉండే కార్బన్‌లెస్ జవాబుల కాపీని విద్యార్థులకు ఇస్తారు. -
వెబ్సైట్లో ఓయూసెట్ ప్రాథమిక కీ
సాక్షి,హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం పలు పీజీ, పీజీడిప్లొమా, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఓయూసెట్-2016 ‘ప్రాథమిక కీ’ని బుధవారం వర్సిటీ అధికారుల విడుదల చేశారు. ఈ కీ ని www.ouadmissions.com, www.osmania.ac.in వెబ్సైట్లలో పొందుపరిచారు. విడుదల చేసిన కీ లో ఏమైనా అభ్యంతరాలుంటే వాటిని బలపరిచే మెటీరియల్‌ను జతపరిచి రాతపూర్వకంగా వర్సిటీ అడ్మిషన్స్ డెరైక్టర్‌కు ఈ నెల 17 వతేదీ సాయంత్రం 5 గంటల లోపు అందజేయాలని వర్సిటీ అధికారులు తెలిపారు. ఈనెల 6 నుంచి 14వ తేదీ వరకు ఓయూసెట్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఎక్కువ ఆప్షన్లు ఇస్తేనే డిగ్రీలో సీటు సాక్షి, హైదరాబాద్: విద్యార్థులు ఎక్కువ ఆప్షన్లు ఇస్తేనే డిగ్రీలో సీటు వస్తుందని కళాశాల విద్యా కమిషనర్ వాణీప్రసాద్ తెలిపారు. 10 కంటే తక్కువ ఆప్షన్లు ఇచ్చిన వారికి సీట్లు రాకపోవచ్చని, ఈనెల 17వ తేదీ వరకు వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లు ఇవ్వాలని సూచించారు. కొత్త కోర్సులు, కాలేజీలను వెబ్ కౌన్సెలింగ్‌లో చేర్చినందున, విద్యార్థులు తమ ఆప్షన్లు, వివరాలను అప్డేట్ చేసుకోవాలన్నారు. బుధవారం వరకు 1,65,174 మంది విద్యార్థులు ఫీజు చెల్లించగా, 1,56,419 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారని తెలిపారు. ఆలస్య రుసుంతో 16, 17 తేదీల్లోనూ విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకొని, ఆప్షన్లు ఇచ్చుకోవచ్చన్నారు. కాగా టెట్ ఫలితాల్ని వెంటనే విడుదల చేయాలంటూ 20న విద్యాశాఖ, టెట్ కార్యాలయాలను ముట్టడించనున్నట్లు రాష్ట్ర టెట్, డీఎస్సీ అభ్యర్థులు రామ్మోహన్‌రెడ్డి, రవి, మధుసూదన్ హెచ్చరించారు. -
వీఆర్ఓ, వీఆర్ఏ ప్రాథమిక ‘కీ’ విడుదల
హైదరాబాద్: గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్ఓ), గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ) పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ‘కీ‘ని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్(ఏపీపీఎస్సీ) మంగళవారం విడుదల చేసింది. ప్రాథమిక ‘కీ’ని ccla.cgg.gov.in అనే వెబ్సైట్లో ఉంచినట్లు కమిషన్ వర్గాలు తెలిపాయి. ఈ నెల 2న జరిగిన ఈ పరీక్షలకు 14 లక్షల మందిపైగా విద్యార్థులు హాజరైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ప్రయోజనార్థం వీఆర్ఓ, వీఆర్ఏ ప్రాథమిక ‘కీ’ని సాక్షి తన వెబ్సైట్లో పెట్టింది. ఈ కీని sakshieducation.com లో చూసుకోవచ్చు. ‘కీ’పై అభ్యంతరాలు ఉంటే ఏపీపీఎస్సీకి తెలియజేయవచ్చు. ప్రాథమిక కీపై అభ్యంతరాలను www.apspsc.gov.in అనే వెబ్‌సైట్‌కు ఈనెల 6వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా పంపాల్సి ఉంటుంది. గడువు తర్వాత వచ్చే అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోరు. ప్రాథమిక ‘కీ’పై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి, అవసరమైతే సవరణలు చేసిన అనంతరం ఈనెల 10న ఫైనల్ ‘కీ’ విడుదల చేస్తారు. తుది కీ ఆధారంగానే ఈ నెల 20న ఫలితాలు ప్రకటిస్తామని, 26 నుంచి అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించిన అనంతరం.. నెలాఖరులోగా నియామక పత్రాలు జారీ చేస్తామని రెవెన్యూ ఉన్నతాధికారులు తెలిపారు.