రేపే ఎంసెట్-2
- నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
- గంట ముందుగానే పరీక్ష హాల్లోకి అనుమతి
- ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు పరీక్ష
- హాజరుకానున్న 56,188 మంది విద్యార్థులు
- ఏపీ నుంచి 17,943 మంది హాజరు
- ఈసారి ఓఎంఆర్ కార్బన్‌లెస్ జవాబుపత్రం అమలు
- రేపే ప్రాథమిక కీ విడుదల
- 12వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ..
-14న ర్యాంకుల వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంసెట్-2 పరీక్షను ఈనెల 9న నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు నిర్వహించే ఈ పరీక్షకు 56,188 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో తెలంగాణ నుంచి 38,245 మంది, ఆంధ్రప్రదేశ్ నుంచి 17,943 మంది పరీక్ష రాయనున్నారు. తెలంగాణ, ఏపీల్లో కలిపి 95 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఇక విద్యార్థుల బయోమెట్రిక్ డాటా, డిజిటల్ ఫొటోలు సేకరించనున్న నేపథ్యంలో విద్యార్థులను గంట ముందుగానే పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని ఎంసెట్-2 కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్‌వీ రమణరావు వెల్లడించారు. పరీక్ష ప్రారంభ సమయం తరువాత నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాల్లోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఎంసెట్-2 ప్రాథమిక కీ ని పరీక్ష రోజున సాయంత్రమే విడుదల చేస్తామని.. దానిపై 12వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని రమణరావు తెలిపారు. ర్యాంకులను 14వ తేదీన ప్రకటిస్తామన్నారు.
ఇక మాల్ ప్రాక్టీస్ నిరోధానికి సమస్యాత్మక కేంద్రాల్లో జామర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రూ.5 వేలు, రూ.10 వేలు ఆలస్య రుసుము చెల్లించి దరఖాస్తు చేసిన వారిపై, మళ్లీ మళ్లీ ఎంసెట్ రాస్తున్న అభ్యర్థులకు సంబంధించి వారెందుకు పరీక్షకు హాజరవుతున్నారన్న దానిపై పోలీసు విచారణ చేయిస్తున్నట్లు తెలిపారు. 1970 నుంచి 1994 మధ్య జన్మించిన వారు, గతంలో ఎంసెట్ రాసి, మెడిసిన్ చదువుతూ మళ్లీ ఎంసెట్‌కు దరఖాస్తు చేసిన వారి వివరాలను కూడా పోలీసు శాఖకు అందజేశామన్నారు. ఇక ఎంసెట్-2 రాసేందుకు 609 మంది విద్యార్థులు ఆలస్య రుసుముతో పరీక్ష ఫీజు చెల్లించారు. ఇందులో రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసిన వారు 406 మంది, రూ.1,000 ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసిన వారు 144 మంది, రూ.5 వేల ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసిన వారు 30 మంది, రూ.10 వేల ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసిన వారు 29 మంది ఉన్నారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
- పరీక్ష సమయానికి నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.
- పరీక్షహాల్ నుంచి పరీక్ష పూర్తయ్యే వరకు బయటకు వెళ్లనీయరు.
- బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్‌తో పరీక్ష రాయాలి.
- విద్యార్థులు ఆన్‌లైన్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న దరఖాస్తు ఫారంపై కలర్ ఫొటోను అంటించాలి. ఆ దరఖాస్తు ఫారాన్ని పరీక్ష హాల్లో అందజేయాలి.
- ఈసారి ప్రశ్నలతోపాటు జవాబుల ఆప్షన్లలో కూడా జంబ్లింగ్ అమలు చేస్తున్నారు.
- మొబైల్స్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, గణిత సంబంధ పరికరాలను పరీక్ష హాల్లోకి అనుమతించరు.
- ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల కోసం విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కర్నూలులో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
- ఈసారి పరీక్ష పూర్తవగానే ఓఎంఆర్ జవాబు పత్రం కింద ఉండే కార్బన్‌లెస్ జవాబుల కాపీని విద్యార్థులకు ఇస్తారు.