
తప్పెవరిది? శిక్షెవరికి?
ఇంటర్ ప్రశ్నపత్రం లీకైనందుకు మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో. అంతకుముందు, పదోతరగతి పరీక్షాపత్రాలు లీకయ్యాయనే కారణంగా నాటి సీఎం ఎన్టీఆర్ మంత్రి చిక్కాల రామచంద్ర రావును మంత్రివర్గం నుంచి తప్పించారు.
వాస్తు బాగోలేదని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావే చెబుతున్న సచివాలయంలో గురువారం తాడు లాగారు. ఎమ్‌సెట్-2 రద్దు చేయొద్దని ఒక బృందం, రద్దు చేసి తిరిగి పరీక్ష జరపండని మరొక బృందం. ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌లో ధర్మగంట మోగింది. శుక్రవారం ముఖ్యమంత్రి తీర్పు చెప్ప నున్నారు. ప్రశ్నపత్రం లీకైన మెడికల్ ఎమ్‌సెట్-2 ను రద్దు చేసి మళ్లీ పరీక్ష పెట్టడమా? లీకేజీ బాధ్యులు, అనుచిత ప్రయోజనం పొందిన పిల్లలు- తల్లి దండ్రులపై చర్య తీసుకొని మిగిలిన విద్యార్థుల ప్రవేశాలకు కౌన్సెలింగ్ జరపడమా? ఇదొక ధర్మ సంకటం. తీర్పు ఏదైనా పాపం పిల్లలకే శిక్షా! మరి ప్రభుత్వ నైతిక బాధ్యత సంగతి?
ఇదేం శిక్ష! పలు ఒత్తిళ్ల నడుమ పరీక్షలన్నీ ముగిశాయి, ఆశించిన ర్యాంకులొచ్చాయి, ఇక కౌన్సెలింగ్ ముగిసి మెడికల్ కాలేజీల్లో చేరడమే తరువాయి అనుకుంటుంటే, మళ్లీ పరీక్ష రాయాలంటే మాకెంత క్షోభ అని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. మానసిక ఒత్తిడిలో తిరిగి అవే ర్యాంకులు వస్తాయో? లేదో! తెలియదు. చేయని నేరానికి మాకెందుకీ శిక్ష అన్నది వారి ఆవేదన. ‘‘ఏపీ ఎమ్‌సెట్‌లో 199, తెలంగాణ ఎమ్‌సెట్-1లో 192, ఎమ్‌సెట్-2లో 44 ర్యాంకు వచ్చింది. స్థానికంగానే సీటు వస్తున్నపుడు ఏపీకెందుకులే అని కౌన్సెలింగ్‌కు వెళ్లకుండా ఆ సీటు వదు లుకున్నాను. ఇప్పుడు మళ్లీ పరీక్షంటే నా పరిస్థితి ఏంటో మీరే ఆలో చించండి’’ అంటున్న కరీంనగర్ విద్యార్థి సుష్మారెడ్డి ప్రశ్నకు సమాధానం చెప్పేవారు లేరు. ‘తప్పు జరిగింది నిజమే, అందుకు బాధ్యులైన వారిపై చర్యతో శిక్షించండి, లీకు పత్రాల ఆధారంగా ర్యాంకులు గడించిన వారి పేర్లు తొలగించి మిగిలిన వారికి కౌన్సెలింగ్ జరిపి సీట్లు భర్తీ చేయండ’నేది మంచి ర్యాంకులు తెచ్చుకున్న వారి ప్రతిపాదన. గతంలోనూ ఈ పద్ధతి అనుసరిం చారు. లీక్‌తో లబ్ధిపొందిన విద్యార్థులు పరిమిత సంఖ్యలో ఉండి, వారెవరో విస్పష్టంగా తెలిసినపుడు ఆ పేర్లు తొలగించి మిగిలినవారికి కౌన్సెలింగ్ జరి పారు.
ప్రస్తుత కుంభకోణంలో డబ్బుకట్టి ప్రశ్నపత్రం పొంది లబ్ధిదారులైన విద్యార్థులెందరో కచ్చితంగా తెలియటం లేదు. దర్యాప్తు ఇంకా కొనసాగు తూనే ఉంది. బుధవారం మధ్యాహ్నానికి 30 అన్న ఈ విద్యార్థుల సంఖ్య సాయంత్రానికి 72 మందికి, గురువారం సదరు ఆ సంఖ్య 76కి చేరింది. ఇంకా పెరగదనే గ్యారంటీ ఏం లేదు! అలాంటప్పుడు, ఎన్ని పేర్లు తొలగించి కౌన్సెలింగ్ జరపాలి? అలా జరిపాక, అయిదు, పది ర్యాంకుల తేడాతో సీట్లు కోల్పోయిన వారు, లీకేజీ వల్లే తమకు అన్యాయం జరిగిందనొచ్చు. లీక్‌తో లబ్ధి పొందిన వారందర్నీ సీఐడీ సరిగ్గా గుర్తించి ఏరివేస్తే తమకు సీటు తప్పక లభించేదనే వాదనతో కొందరైనా కోర్టుల్ని సంప్రదించే ఆస్కారముంది. పబ్లిక్ ఎగ్జామ్స్, ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీసెస్ చట్టం-1987 ప్రకారం న్యాయ స్థానం సానుకూలంగా స్పందించొచ్చు. అప్పుడేంటి పరిష్కారం?
కనుక, కోచింగ్ సంస్థలు తిరిగి బోర్డులు పెడతాయి, స్వల్ప వ్యవధిలోనూ బోలెడంత సొమ్ము చేసుకుంటాయి. పదహారేళ్లుగా ఈ కళలో ఆరితేరిన రాజగోపాల్ వంటి వారికి మరో అవకాశం. డబ్బుకు కక్కుర్తి పడే పలుకుబడి కలిగినవారు ఇప్పటికే ఆయన్ని, ఆయన సహాయకుల్ని బెయిల్‌పై విడిపించే ప్రయత్నాల్లోనూ ఉండి ఉంటారు. 2006 నుంచి వరు సగా అనేక ప్రశ్నపత్రాల లీకుల్లో కీలకపాత్ర పోషిస్తున్న ఈ నేరగాడు, అతని బృందం ఎమ్‌సెట్-3 లీక్ చేయదన్న భరోసా ఏమీలేదు. అందుకు అధికార వ్యవస్థా సహకరించింది. జేఎన్టీయూలో ఎవరో దొంగలు లేకుండా ప్రింటింగ్ ప్రెస్ గురించి లీకువీరులకు తెలిసే ఆస్కారమే లేదు. ‘అవును సార్, ప్రశ్న పత్రం లీకై గందరగోళం జరిగింది.. మమ్మల్ని మళ్లీ పరీక్ష రాయమంటు న్నారు. సరే! రాస్తాం, రేపు అదీ లీకు కాదనే గ్యారెంటీ ఏంటి?’ అని ఉబికి వస్తున్న కన్నీళ్లతో మీడియాను అడిగిన వరంగల్ విద్యార్థిని ప్రశ్నకు ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. నిజమే! లీకైనా అవొచ్చు! గతంలో తప్పు చేసిన వాళ్లే మళ్లీ చేశారు.
ఇప్పుడింత తతంగం బయటపడి, గగ్గోలు లేపుతున్న ఈ వ్యవహారం మన భద్రత, దర్యాప్తు వ్యవస్థ స్వయంగా పొడిచి సాధించిన ఘనకార్యమేం కాదు! ఎవరో రవి అనే సివిల్ ఇంజనీర్ తన కూతురి చదువు పట్ల ఉన్న శ్రద్ధతో, ఆమె కన్నా తక్కువ తెలివి తేటలున్న విద్యార్థులకు అసాధారణ ర్యాంకులు వచ్చినపుడు... ఓ సందేహం, ఒక లాజిక్ ఆధారంగా జరిపిన పరిశీలనలో తీగ దొరికింది. ఆయన కథనంతో మేల్కొన్న మన దర్యాప్తు సంస్థ లాగితే ఈ డొంకంతా కదిలింది. ఆ రవికే సందేహం కలిగి ఉండకపోతే! చొరవ తీసుకొని నాలుగడుగులు ముందుకేయ కుంటే.... ఏమీ జరగనట్టే, కౌన్సెలింగ్‌తో సహా అంతా నిక్షేపంగా జరిగిపో యేది. ఓ విద్యార్థి తలిదండ్రులు 60, 70 లక్షల రూపాయలిచ్చి, లీకైన ప్రశ్న పత్రంతో తమ పిల్లల్ని గట్టెక్కించాలని ఎందుకు అర్రులు చాస్తున్నారు? ప్రభుత్వ పెద్దలకు ఈ ప్రశ్న తలెత్తదా? మెడికల్ విద్య అంత ఖరీదు ఎందు కయింది?
అసాధారణ ప్రతిభ గల విద్యార్థి కాకపోతే, తమ పిల్లల్ని కోటి రూపాలు వెచ్చిస్తే గాని ఎమ్బీబీఎస్‌లో చేర్పించలేని దుస్థితి ఈరోజు తల్లిదం డ్రులెదుర్కొంటున్నారు. దీనికి కారణాలేంటి? ప్రభుత్వ రంగంలో సీట్లు తగ్గి, ప్రయివేటు రంగంలో ఎందుకు పెరుగుతున్నాయి? యాజమాన్యాలు ఇష్ట మైన ధరకు యథేచ్ఛగా మెడిసిన్ సీట్లు అమ్ముకునే మాయా అంగడిని ఎవరు-ఎందుకు సృష్టించారు? డాక్టరవాలనే విద్యార్థుల ఆకాంక్ష, తల్లిదం డ్రుల తపనను సొమ్ము చేసుకుంటున్న కోచింగ్ సెంటర్లు కోట్లలో, వైద్య కళాశాలలు వందల కోట్లలో వ్యాపారాలు చేస్తున్న సంగతి ఎవరికి తెలియదు? ప్రభుత్వం సమగ్ర యోచనతో ఈ సమస్యకు పరిష్కారం చూడాలి.
