
అక్కడ 24 వేల ర్యాంకు.. ఇక్కడ 704!
తెలంగాణ ఎంసెట్ పేపర్ లీకేజి విషయం నూటికి నూరుపాళ్లు నిజమేనని తేలిపోయింది. కొంతమంది విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ర్యాంకులు, తెలంగాణలో వచ్చిన ర్యాంకులు పోల్చి చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఏపీ ఎంసెట్లో 55వేల ర్యాంకు వచ్చిన విద్యార్థికి టీఎస్ ఎంసెట్-2లో 1502 ర్యాంకు వచ్చింది. అలాగే అక్కడ 24వేల ర్యాంకు వచ్చిన వాళ్లకు ఇక్కడ 704 ర్యాంకు వచ్చింది. అక్కడ 10వేల ర్యాంకు వస్తే, ఇక్కడ ఏకంగా 141వ ర్యాంకు సాధించారు. అలాగే ఏపీలో 25వేల ర్యాంకు వరకు వచ్చిన ఓ విద్యార్థికి ఇక్కడ 952వ ర్యాంకు వచ్చింది. ప్రిపరేషన్ కోసం ఎంత సమయం ఉన్నా.. మరీ ఇంత స్థాయిలో ర్యాంకులు రావడం దాదాపు అసాధ్యమే. అది కూడా మెడికల్ ఎంట్రన్సులో. ఇదే తల్లిదండ్రుల అనుమానాలకు బీజం వేసింది. ఇలా మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులు పరీక్షకు రెండు రోజుల ముందు అదృశ్యం కావడం, సరిగ్గా పరీక్ష ఉన్న రోజే విమానంలో హైదరాబాద్కు వచ్చి పరీక్ష రాయడం వాళ్ల అనుమానాలకు కారణమైంది. అలా రాసిన విద్యార్థులను మిగిలినవాళ్లు అడిగినప్పుడు కూడా పొంతనలేని సమాధానాలు చెప్పారు. చివరకు ర్యాంకులు వచ్చిన తర్వాత.. అసలు కోచింగ్ సెంటర్లలో వీళ్ల పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండేదని, ఇంత మంచి ర్యాంకులు ఎలా వచ్చాయో అర్థం కావడం లేదని పిల్లలు చెప్పడంతో తల్లిదండ్రులు స్పందించి మంత్రికి ఫిర్యాదు చేశారు.
లీకు వీరులు ఎవరో?
2014లో నిర్వహించిన మెడికల్ పీజీ ఎంట్రన్సు పేపర్లు లీకయ్యాయి. ఈ పేపర్లను ఢిల్లీలోని ముద్రణాలయంలో ప్రింట్ చేయించారు. అప్పట్లో ఆ పేపర్ లీకేజి కేసులో వినిపించిన పేర్లే ఇప్పుడు కూడా ఎంసెట్-2 లీకేజి విషయంలో వినిపిస్తున్నాయి. ముగ్గురు వ్యక్తులే ఇందులో కీలక పాత్రధారులని తెలుస్తోంది. ఇప్పటికే ఎంసెట్-2 లీకేజి కేసులో ప్రకాశం జిల్లాకు చెందిన రమేష్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతడితో పాటు మరో వ్యక్తిని కూడా అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. పరీక్షకు 48 గంటల ముందు 30 మంది విద్యార్థులను బెంగళూరు, ముంబై తరలించారు. అక్కడే వాళ్లతో ప్రాక్టీసు చేయించారంటున్నారు. దీనిపై 24 గంటల్లో ప్రభుత్వానికి నివేదిక అందనుంది. ఆ తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక 2014 నుంచి ఇప్పటివరకు నిర్వహించిన అన్ని ప్రవేశపరీక్షల వ్యవహారంపై కూడా దృష్టిపెట్టాలని సీఐడీ నిర్ణయించినట్లు సమాచారం.