ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంసెట్-2 పరీక్షను ఈ నెల 9న నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంసెట్-2 పరీక్షను ఈ నెల 9న నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్షకు హాజరయ్యే 56,188 మంది విద్యార్థుల కోసం 95 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ నుంచి 38,245 మంది విద్యార్థులు హాజరు కానుండగా, ఆంధ్రప్రదేశ్ నుంచి 17,943 మంది (31.93 శాతం) విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు ఎంసెట్-2 కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్‌వీ రమణరావు తెలిపారు.
విద్యార్థుల బయో మెట్రిక్ డేటా, వేలిముద్రలు, డిజిటల్ ఫొటోలు సేకరించనున్న నేపథ్యంలో విద్యార్థులను గంట ముందుగానే పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని వివరించారు. ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు నిర్వహించే ఈ పరీక్ష ప్రారంభ సమయం తరువాత నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాల్లోకి అనుమతించేది లేదని, విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. వర్షాకాలం అయినందున మరింత జాగ్రత్త పడాలని కోరారు.
మాల్ ప్రాక్టీస్ నిరోధానికి సమస్యాత్మక కేంద్రాల్లో 20 జామర్లను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రూ.5 వేలు, రూ.10 వేలు ఆలస్య రుసుం చెల్లించి దరఖాస్తు చేసినవారి, మళ్లీ మళ్లీ ఎంసెట్ రాస్తున్న అభ్యర్థులకు సంబంధించి వారు ఎందుకు పరీక్షకు హాజరు అవుతున్నారన్న అంశంపై పోలీసు విచారణ చేయిస్తున్నట్లు చెప్పారు. 1970 నుంచి 1994 మధ్యలో జన్మించినవారు, గతంలో ఎంసెట్ రాసి, ఎంపికై.. మెడిసిన్ చదువుతూ ఎంసెట్ రాసేందుకు దరఖాస్తు చేసిన వారి వివరాలను కూడా పోలీసు శాఖకు అందజేశామన్నారు.
1981 నుంచి ఇప్పటివరకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైనవారు పరీక్షకు హాజరవుతున్నట్లు తెలిపారు. వారి చిరునామాలు, ఫోన్ నంబర్లను ఇంటలిజెన్స్ విభాగానికి అందజేసినట్లు తెలిపారు. అర్హత సాధించే విద్యార్థులకు ర్యాంకులను ఈ నెల 14న విడుదల చేస్తామని రమణారావు తెలిపారు. పరీక్ష ప్రాథమిక కీ ని ఈ నెల 9వ తేదీనే విడుదల చేస్తామని, దానిపై 12వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని పేర్కొన్నారు.