ఎంసెట్ రద్దుపై రేపు ప్రభుత్వం ప్రకటన
హైదరాబాద్: ఎంసెట్-2 రద్దు వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం అధికారికంగా ప్రకటన చేయనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు మధ్యాహ్నాం మంత్రులు, ఉన్నతాధికారులతో భేటీ అనంతరం నిర్ణయం వెల్లడించనున్నారు. కాగా ఎంసెట్-2 పరీక్షను రద్దు చేయవద్దంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు సచివాలయం వద్ద ఆందోళన చేపట్టారు.
ఏ తప్పు చేయని తమకెందుకు శిక్ష అంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు చేసిన వారిని శిక్షించాలని, అంతేకానీ ఎంతో కష్టపడి చదివి ర్యాంకులు తెచ్చుకుంటే ప్రశ్నాపత్రం లీక్ అయిందంటూ పరీక్షను రద్దు చేయటం ఎంతవరకూ సమంజసమని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. కాగా ఎంసెట్ రద్దుపై ప్రభుత్వానిదే తుది నిర్ణయమని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు.
మరోవైపు రాష్ట్రంలోని యూనివర్సిటీలపై సీఎం కేసీఆర్ శుక్రవారం మధ్యాహ్నం సమీక్ష నిర్వహించనున్నారు. అన్ని వర్సిటీల వైస్ చాన్సులర్లు, ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. కాగా ప్రభుత్వం చేపట్టిన వైస్ చాన్సులర్ల నియామకాన్ని హైకోర్టు ఇవాళ రద్దు చేసిన విషయం తెలిసిందే.