బాలురే బాద్‌షాలు | Badhushas of Eamcet-2 ranks | Sakshi
Sakshi News home page

బాలురే బాద్‌షాలు

Published Thu, Jul 14 2016 2:05 AM | Last Updated on Mon, Sep 4 2017 4:47 AM

బాలురే బాద్‌షాలు

బాలురే బాద్‌షాలు

- ఎంసెట్-2 టాప్-10లో ఆరుగురు వారే
- రంగారెడ్డి జిల్లా వాసికి ఫస్ట్ ర్యాంకు
- ఈ నెల 16 నుంచి వెబ్‌సైట్‌లో ఓఎంఆర్ పత్రాలు
- 21 నుంచి ర్యాంకు కార్డుల డౌన్‌లోడ్‌కు అవకాశం
- 25 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్..  ఆగస్టు మొదటి వారంలో అడ్మిషన్లు
- ఎంబీబీఎస్‌లో 1,780, బీడీఎస్‌లో 640 సీట్లు
- ర్యాంకులు విడుదల చేసిన మంత్రి లక్ష్మారెడ్డి

 
 సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంసెట్-2లో బాలురు సత్తా చాటారు. టాప్-10 ర్యాంకుల్లో ఆరుగురు వారే ఉన్నారు. ఉత్తీర్ణతపరంగా మాత్రం బాలికలు కాస్త ముందంజలో నిలిచారు. ఎంసెట్-2 ర్యాంకులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి బుధవారం సచివాలయంలో విడుదల చేశారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, జేఎన్‌టీయూహెచ్ వైస్ చాన్స్‌లర్ శైలజా రామయ్యర్, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, ఎంసెట్-2 కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్‌వీ రమణరావు తదితరులు ఇందులో పాల్గొన్నారు.
 
 ఎంసెట్ స్కోర్‌కు 75%.. ఇంటర్ మార్కులకు 25%
 ఎంసెట్-2కు మొత్తం 56,153 మంది దరఖాస్తు చేసుకోగా ఈ నెల 9న జరిగిన పరీక్షకు 50,961 మంది హాజరయ్యారు. అందులో 47,644 మంది (93.49 శాతం) ర్యాంకులు పొందారు. మొత్తంగా 48,205 మంది అర్హత సాధించినా.. 134 మంది ఇంటర్‌లో ఫెయిల్ అయ్యారు. మరో 427 మంది విద్యార్థుల ఇంటర్మీడియెట్ వివరాలు ఎంసెట్ కమిటీకి అందలేదు. దీంతో వారిని మినహాయించి 47,644 మందికి ర్యాంకులను కేటాయించారు. ఎంసెట్ స్కోర్‌కు 75 శాతం వెయిటేజీ, ఇంటర్మీడియెట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి కంబైన్డ్ స్కోర్‌ను నిర్ణయించారు. దాని ఆధారంగా ర్యాంకులు ఖరారు చేశారు. తెలంగాణ, ఏపీలో కలిపి మొత్తం 95 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. పరీక్షకు హాజరైన వారిలో 16,722 మంది బాలురు ఉండగా.. వారిలో 15,577 మంది (93.15 శాతం) అర్హత సాధించి ర్యాంకులు పొందారు. ఇక 34,239 మంది బాలికలు పరీక్షకు హాజరు కాగా.. 32,067 మంది (93.65 శాతం) అర్హత సాధించారు.
 
 16 నుంచి ఓఎంఆర్ పత్రాలు
 పరీక్షకు హాజరైన విద్యార్థుల ఓఎంఆర్ జవాబు పత్రాలను ఎంసెట్ వెబ్‌సైట్‌లో (med.tseamcet.in) అందుబాటులో ఉంచనున్నట్లు మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 16వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 19వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు వాటిని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామన్నారు. మూల్యాంకనంలో ఏమైనా పొరపాట్లు దొర్లితే జనరల్, బీసీ విద్యార్థులు రూ.5 వేలు, ఎస్సీ, ఎస్టీలైతే రూ.2 వేలు చెల్లించి తమ విజ్ఞాపనను ఆన్‌లైన్ ద్వారా (ఎంసెట్ వెబ్‌సైట్) అందజేయాలని సూచించారు. 19వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇక ర్యాంకు కార్డులను విద్యార్థులు ఈ నెల 21 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.
 
 25 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్
 ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో కన్వీనర్ కోటాలోని 2,420 సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ ప్రక్రియను ఈ నెల 25న ప్రారంభించనున్నట్లు మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడించారు. 25వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జనరల్ విద్యార్థులకు, 30, 31 తేదీల్లో ప్రత్యేక కేటగిరీ విద్యార్థులకు (వికలాంగులు, ఆర్మీ, స్పోర్ట్స్ కేటగిరీ) సర్టిఫికెట్ల వెరిఫికే షన్ ఉంటుందన్నారు. ఆగస్టు మొదటి వారంలో ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ఆన్‌లైన్ ద్వారా నిర్వహిస్తామని వెల్లడించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కేంద్రాలను జేఎన్‌టీయూహెచ్, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఏర్పాటు చేస్తున్నట్లు కాళోజీ వర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. 50 శాతం కన్వీనర్ కోటాలో సీట్ల భర్తీకి ఈ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. మొదట ఎంబీబీఎస్, తర్వాత బీడీఎస్‌లో ప్రవేశాలు చేపడతామన్నారు. ఆ తర్వాత అగ్రికల్చర్, వెటర్నరీ, ఆయుర్వేదిక్, హోమియో, యునానీ, నేచురోపతి కోర్సుల్లో ప్రవేశాలు వరుస క్రమంలో ఉంటాయని చెప్పారు. తర్వాత రెండో దశ లేదా చివరి దశ ప్రవేశాల కౌన్సెలింగ్ ఉంటుందన్నారు.    
 
 టాపర్లు వీరే...
 పేరు    ర్యాంకు     కంబైన్డ్ స్కోర్      ఎంసెట్ మార్కులు    జిల్లా
 రాజుపాలెం ఉజ్వల్    1    97.66%    155    రంగారెడ్డి
 కాసం ఐశ్వర్య    2    97.66%    155    మెదక్
 ఎం.సాయి శుశ్రుత    3    97.61%    155    కర్నూలు
 వేణుమాధవ్ పిన్నింటి    4    97.53%    155    రంగారెడ్డి
 ఎం.అంకిత్‌రెడ్డి    5    97.36%    155    హైదరాబాద్
 జాతప్రోలు ప్రణవి    6    97.19%    154    మహబూబ్‌నగర్
 తప్పెట తేజస్విని    7    97.19%    154    అనంతపురం
 సిద్ధార్థ్ బి రావు    8    97.02%    154    హైదరాబాద్
 కొయ్య వినీత్‌రెడ్డి    9    96.98%    154    రంగారెడ్డి
 సీహెచ్ కృష్ణగీత్    10    96.90%    154    ఖమ్మం
 
 కన్వీనర్ కోటాలో అందుబాటులో ఉన్న సీట్లు ఇవీ..
 ఎంబీబీఎస్‌లో..
 కేటగిరీ    కాలేజీలు    సీట్లు
 ప్రభుత్వ    6    1,060
 ప్రైవేటు    14    720
 మొత్తం    20    1,780
 బీడీఎస్‌లో...
 ప్రభుత్వ    1    140
 ప్రైవేటు    9    500
 మొత్తం    10    640
 
 చిన్నప్పటి కోరిక నెరవేరబోతోంది
 ‘‘నా చదువు కోసం అమ్మానాన్నలు ఎంతో కష్టపడుతున్నారు. వారి కలలను సాకారం చేయడమే నా లక్ష్యం. చిన్నప్పట్నుంచి డాక్టర్ కావాలనే నా కోరిక నెరవేరబోతోంది. కోర్సు పూర్తి చేశాక ఇక్కడే ఆసుపత్రి పెట్టి సేవలందిస్తా’’ అని ఎంసెట్-2లో రెండో ర్యాంకు సాధించిన కాసం ఐశ్వర్య చెప్పారు. మెదక్ జిల్లా ప్రజ్ఞాపూర్‌కు చెందిన ఈమె శ్రీనివాస్, అమృత దంపతుల కుమార్తె. తల్లిదండ్రులు కిరాణా దుకాణం నిర్వహిస్తూ పిల్లల్ని చదివిస్తున్నారు. ఐశ్వర్య సెయింట్ మేరీస్ విద్యానికేతన్‌లో పదోతరగతి, కూకట్‌పల్లిలోని నారాయణ కాలేజీలో ఇంటర్ చదివారు.
 
 కార్డియాలజిస్ట్ కావాలని ఉంది
 కార్డియాలజీ చదివి గ్రామీణ ప్రాంతాల పేదలకు సేవలు చేయాలని ఉందని ఎంసెట్-2లో మూడో ర్యాంకు సాధించిన సాయి శుశ్రుత చెప్పారు. వైద్యులైన తన తల్లితండ్రుల వల్లే ర్యాంకును సాధించాన న్నారు. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన శుశ్రుత ఎంసెట్‌లో 155 మార్కులు సాధించినా ఇంటర్ వెయిటేజ్‌లో ఒక్క మార్కు తగ్గడంతో ఫస్ట్‌ర్యాంక్ మిస్ అయింది. ఈమె పదో తరగతి వరకు కేశవరెడ్డి పబ్లిక్ స్కూల్‌లో, ఇంటర్ స్థానిక నారాయణ కాలేజీలో చదివారు. ఏపీ ఎంసెట్‌లో 18వ ర్యాంకు సాధించారు.
 
 ఫస్ట్ ర్యాంకు వస్తుందనుకోలేదు
‘మెడిసిన్‌లో మంచి ర్యాంకు వస్తుందని ముందే ఊహించా. కానీ ఫస్ట్ ర్యాంకు వస్తుందనుకోలేదు. చాలా సంతోషంగా ఉంది’ అని ఎంసెట్-2లో ఫస్ట్‌ర్యాంకు సాధించిన రాజుపాలెం ఉజ్వల్ పేర్కొన్నారు. ‘నాన్న డాక్టర్ శ్యామ్‌సుందర్ అందించిన సహకారం మరువలేనిది. ఒకటి నుంచి టెన్త్ క్లాస్ వరకు బోయిన్‌పల్లి సెయింట్ థెరిస్సాలో, కూకట్‌పల్లిలోని శ్రీచైతన్య కళాశాలో ఇంటర్మీడియె ట్ పూర్తి చేశాను. మెడిసిన్‌లో కార్డియో థొరాసిక్ స్పెషాలిటీ చేయాలని ఉంది’’ అని ఆయన చెప్పారు.     
 
 కార్డియాలజీ చదువుతా
 మెడిసిన్ పూర్తి చేసి కార్డియాలజిస్ట్‌గా సేవలందిస్తానని ఎంసెట్-2లో నాలుగో ర్యాంకు సాధించిన వేణుమాధవ్ చెప్పారు. హైదరాబాద్‌లోని స్నేహపురికాలనీకి చెందిన ఈయన టెన్త్ రమాదేవి పబ్లిక్ స్కూల్‌లో, ఇంటర్ చైతన్యపురిలోని శ్రీచైతన్య కాలేజీలో చదివారు. ఇంటర్‌లో 982 మార్కులు సాధించిన వేణుమాధవ్.. ఏపీ ఎంసెట్‌లో 24వ ర్యాంకు సాధించారు.
 
 ఐఎస్ సదన్ అబ్బాయికి 5వర్యాంకు

 హైదరాబాద్ ఐఎస్ సదన్ డివిజన్‌కు చెందిన ఎం.అంకిత్ రెడ్డి ఎంసెట్-2లో 5వ ర్యాంక్ సాధించాడు. మున్ముందు మరింత ఉన్నతస్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నట్లు అంకిత్ తండ్రి ఎం.నరేశ్‌చంద్రారెడ్డి పేర్కొన్నారు.
 
 ‘అనంత’ విద్యార్థికి ఏడో ర్యాంకు

 అనంతపురం నగరానికి చెందిన తప్పెట తేజస్విని ఎంసెట్-2లో ఏడోర్యాంకు సాధించారు. ఏపీ ఎంసెట్‌లోనూ ఈమె 29వ ర్యాంకు సాధించారు. తేజస్విని తండ్రి శ్రీబాలాజీ బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు.
 
 పరిశోధన  విభాగంలో స్థిరపడతా

 జనరల్ మెడిసిన్ పూర్తి చేసి పరిశోధనా విభాగంలో స్థిరపడాలని భావిస్తున్నట్లు ఎంసెట్-2లో ఎనిమిదో ర్యాంకు సాధించిన సిద్ధార్థ్ చెప్పారు. హైదరాబాద్‌లోని అమీర్‌పేటకు చెందిన సిద్ధార్థ్.. పదో తరగతి వరకు బేగంపేటలోని గీతాంజలి స్కూల్‌లో చదువుకున్నారు. ఇంటర్‌ఎస్సార్‌నగర్‌లో శ్రీచైతన్య కాలేజీలో చదివారు.
 
 పేదలకు వైద్యం అందిస్తా
 కార్డియాలజీ చేసి పేదలకు వైద్యాన్ని అందించడమే తన లక్ష్యమని తొమ్మిదో ర్యాంకు సాధించిన వినీత్‌రెడ్డి తెలిపారు. ఈయన తండ్రి కేయిర్న్ కంపెనీలో ఇంజనీరుగా పని చేస్తుండగా తల్లి గృహిణి. వినీత్ పదో తరగతి వరకు నారాయణ ఒలింపియాడ్‌లో, ఇంటర్ నారాయణగూడలోని శ్రీచైతన్య బ్రాంచ్‌లో చదివారు.
 
 పేదలకు ఉచిత వైద్యం అందిస్తా
 ‘‘ప్రణాళిక బద్ధంగా చదవడం వల్లనే ఈ ర్యాంకు సాధ్యమైంది. ఢిల్లీ ఏయిమ్స్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేసి మంచి డాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకుంటా’’ అని ఎంసెట్-2లో ఆరో ర్యాంకు సాధించిన ప్రణవి తెలిపారు. పుట్టి, పెరిగిన అచ్చంపేట ప్రాంతానికి సేవలందిస్తానని, పేదలకు ఉచిత వైద్యసేవ  చేస్తానని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement