సాక్షి, హైదరాబాద్: ఆమె గర్భిణి.. వేరే దేశంలో కొలువు... ప్రసవం కోసం సంతోషంగా స్వదేశానికి వెళ్తుండగా విమానంలోనే పురిటి నొప్పులు రావటంతో అనుకోని పరిస్థితిలో హైదరాబాద్‌కు చేరుకుంది. నెలలు నిండకుండానే పుట్టిన బిడ్డ కళ్లముందే కన్నుమూసింది... ఇక అక్కడి నుంచి అన్నీ సమస్యలే. పాప మృతదేహంతో స్వదేశం వెళ్లలేక, నగరంలో అంత్యక్రియలు చేద్దామంటే అడ్డొచ్చిన నిబంధనలు, ఆసుపత్రిలో చికిత్సకైన ఖర్చు చెల్లించేందుకు డబ్బుల్లేక... ఆ తల్లిపడ్డ మానసిక క్షోభ అంతాఇంతా కాదు. అయితే, ఆమెను అతిథిగా భావించి తెలంగాన పర్యాటక శాఖ అండగా నిలిచింది. చిన్నారి అంత్యక్రియలతోపాటు అవసరమైన ఖర్చులకు సాయం చేసి ఆమెను ప్రశాంతంగా స్వదేశానికి పంపే ఏర్పాట్లు చేసింది.
పిలిప్పీన్స్ వెళ్తూ...
పిలిప్ఫీన్స్‌కు చెందిన గ్రేస్ అలెగ్జాండ్రియా దుబాయ్‌లో నర్సుగా పనిచేస్తోంది. గర్భవతి అయిన ఆమె ప్రసవం కోసం స్వదేశానికి బయలుదేరింది. వారం క్రితం ఎమిరేట్స్ విమానమెక్కిన ఆమెకు గగనతలంలోనే పురిటి నొప్పులు మొదలయ్యాయి. విమానంలోనే ప్రసవించిన ఆమె ఆడపిల్లకు జన్మనిచ్చింది. నెలలు నిండకుండానే ప్రసవం జరగటంతో శిశువు పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో పైలట్ అప్రమత్తమయ్యాడు. అప్పుడు విమానం భారత గగనతలంలో ఉండటంతో పైలట్ అత్యవసరంగా శంషాబాద్ విమానాశ్రయంలో విమానాన్ని దింపాడు. ముందే అధికారులకు సమాచారం అందించటంతో విమానాశ్రయంలోని అపోలో ఆరోగ్య కేంద్రం సిబ్బందిని అధికారులు అప్రమత్తం చేశారు.
వెంటనే స్థానిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స ప్రారంభించి తర్వాత జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు. పూర్తిగా ఎదగకుండానే జన్మించిన శిశువును వైద్యులు కాపాడలేకపోయారు. ఓవైపు శిశువు చనిపోయిందన్న బాధ కంటే తర్వాత ఏర్పడ్డ సమస్యలు అలెగ్జాండ్రియాను మరింత ఇబ్బంది పెట్టాయి. శిశువు మతదేహంతో స్వదేశానికి వెళ్లలేక ఇక్కడే అంత్యక్రియలు నిర్వహించాలని ఆమె నిర్ణయించుకుంది. కానీ స్థానికంగా చర్చిల్లో సభ్యత్వం లేనివారికి అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉండదని స్థానిక శ్మశానవాటిక నిర్వాహకులు పేర్కొన్నారు. దీంతో అంత్యక్రియలు నిర్వహించలేక, అటు స్వదేశానికి వెళ్లలేక, ఆసుపత్రి బిల్లు చెల్లించేందుకు డబ్బులేక ఆమె తీవ్ర మనోవేదనను అనుభవించింది.
విషయం తెలుసుకున్న తెలంగాణ పర్యాటక శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం సోమవారం ఆసుపత్రికి వెళ్లి ఆమెతో మాట్లాడి ఆమె దుస్థితికి చలించిపోయారు. వెంటనే పోలీసులు, ఇతర విభాగాల అధికారులతో మాట్లాడి శిశువు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. తిరుమలగిరిలోని శ్మశానవాటికలో మంగళవారం అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
ఆసుపత్రి నిర్వాహకులతో చర్చించి చికిత్స బిల్లును తగ్గించే ఏర్పాటు చేశారు. ఆ డబ్బులు కూడా సరిపోని పక్షంలో ప్రభుత్వపరంగా సాయం అందించటంతోపాటు ఆమెను స్వదేశానికి పంపేందుకు వీలుగా విమాన టికెట్‌ను అందించేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. ముందు ప్రణాళిక సిద్ధం చేసుకుని వచ్చే పర్యాటకులే కాకుండా అనుకోని విపత్తులతో వచ్చేవారినీ అతిథులుగా భావించి వారిని అక్కున చేర్చుకోవటం మన ధర్మమని, దాన్ని నిర్వహించేందుకు పర్యాటక శాఖ ముందుకొచ్చిందని వెంకటేశం తెలిపారు.
విదేశీ మహిళకు టీసర్కార్ బాసట
Published Mon, May 2 2016 9:26 PM | Last Updated on Thu, Oct 4 2018 7:01 PM
Advertisement