
తెలంగాణలో అత్యున్నత పారిశ్రామిక విధానం
హైదరాబాద్: తెలంగాణలో అత్యున్నత పారిశ్రామిక విధానం అమలులో ఉందని రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి కె తారకరామారావు తెలిపారు. సోమవారం బేగంపేటలోని హరితప్లాజాలో పరిశ్రమలశాఖలో 2016-17లో జరిగిన కార్యక్రమాలపై వార్షిక నివేదికను మంత్రి విడుదల చేశారు. పరిశ్రమలశాఖ లోగోను మంత్రి ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 2016-17ఏడాదిలో గనులు, భూగర్భ వనరులు, చేనేత, జౌళిశాఖలకు సంబంధించిన పురోగతిని ఆయన వివరించారు. వివిధ క్యాటగిరీల్లో ఉత్తమ పారిశ్రామికవేత్తలను మంత్రి కేటీఆర్ సన్మానించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... టీఎస్ ఐపాస్‌కు నేటితో రెండేళ్లు పూర్తయ్యిందని, ప్రపంచంలోనే అత్యున్నత పారిశ్రామిక విధానాలను అధ్యయనం చేసిన తరువాత సీఎం కేసీఆర్ టీఎస్ ఐపాస్‌కు రూపకల్పన చేశారని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత పరిశ్రమలు తరలిపోతాయని కొందరు దుష్ప్రచారం చేశారని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. టీఎస్ ఐపాస్ విప్లవాత్మకమైన పారిశ్రామిక విధానమని, టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమలకు కేవలం 15 రోజుల్లో అనుమతి ఇస్తున్నామని అన్నారు. టీఎస్ ఐపాస్‌తో ఇప్పటి వరకూ రెండు లక్షల 46 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించిందని మంత్రి కేటీఆర్ తెలిపారు.