పోలీసు కొలువులు వస్తున్నాయ్
పోలీసు, అగ్నిమాపక శాఖల్లో 9,096 పోస్టుల భర్తీకి సర్కార్ పచ్చజెండా
పోలీసు శాఖలో 8,401, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో 186,
అగ్నిమాపక దళంలో 509... వారం రోజుల్లో నియామక ప్రకటనలు!
మహిళలకు సివిల్‌లో మూడో వంతు, రిజర్వ్ విభాగంలో 10% కోటా
5 కి.మీ. పరుగుపందేనికి ఫుల్‌స్టాప్.. దేహదారుఢ్య పరీక్షలు సరళతరం
ఆర్మీ తరహాలో వ్యక్తిత్వ వికాస పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: పోలీసు ఉద్యోగాల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఒకేసారి 9,096 పోలీసు ఉద్యోగాల భర్తీకి పచ్చజెండా ఊపడంతోపాటు భారీ సంస్కరణలకు ఆమోదముద్ర వేసింది. దీంతో నూతన పోలీసు నియామక విధానం అమల్లోకి రానుంది. ఈ మేరకు శనివారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఉత్తర్వులపై సంతకాలు చేశారు. మహిళలకు సివిల్ విభాగంలో 33 శాతం(మూడో వంతు), ఆర్మ్‌డ్ రిజర్వ్ విభాగంలో 10 శాతం రిజర్వేషన్లు కల్పించారు. అత్యంత కఠినంగా ఉన్న దేహదారుఢ్య పరీక్షలు సైతం ఇకపై సరళీకృతం కానున్నాయి. ఈ నూతన విధానాన్ని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్(టీఎస్‌పీఎస్‌సీ) ఆమోదించాల్సి ఉంది.
ఆ తర్వాత రాష్ట్ర హోంశాఖ ఖాళీ పోస్టుల భర్తీకి పాలనపరమైన అనుమతులు జారీ చేయనుంది. ఆ వెంటనే నియామక ప్రకటనలు జారీ చేసేందుకు తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు, అగ్నిమాపక శాఖలు చర్యలు తీసుకుంటాయి. పోలీసు శాఖలో 8,401 పోస్టులు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సులో 186, అగ్నిమాపక దళంలో 510 పోస్టుల భర్తీకి వెంటనే ప్రకటనలు రానున్నాయి. అనుకున్న సమయంలో ఈ ప్రక్రియ ముగిస్తే వారం రోజుల్లో నియామక ప్రకటనలు జారీ చేస్తామని రాష్ట్ర పోలీసు విభాగం డెరైక్టర్ జనరల్ అనురాగ్ శర్మ తెలిపారు.
వ్యక్తిత్వ వికాసంపై దృష్టి
పోలీసు నియామకాల్లో అత్యంత కీలకమైన దేహదారుఢ్య పరీక్షల విధానంలో సమూల మార్పులు చోటు చేసుకోనున్నాయి. పోలీసు శాఖలో చేరే వారికి ఆర్మీ మాదిరిగా వ్యక్తిత్వ వికాస పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. సమాజం, దేశం, మహిళలు, అణగారిన వర్గాల పట్ల అభ్యర్థులకు ఉన్న అవగాహనను తెలుసుకోవడానికి వ్యక్తిత్వ వికాస పరీక్షలు నిర్వహిస్తారు. విధి నిర్వహణలో ఒత్తిడికి లోనై ఆత్మహత్యలకు పాల్పడకుండా మానసిక స్థైర్యాన్ని కలిగి ఉన్నారా.. లేదా? అని మానసిక నిపుణుల ద్వారా పరీక్షించనున్నారు. ఇప్పటివరకు జరిగిన నియామకాల్లో పురుషులకు 5 కి.మీ., మహిళలకు 2.5 కి.మీ. పరుగుపందెం నిర్వహిస్తున్నారు. ఈ పరుగు పందెంలో పలువురు అభ్యర్థులు మృత్యువాతపడడం, మరికొందరు అస్వస్థతకు గురైన ఘటనలు గతంలో అనేకం చోటుచేసుకున్నాయి. నిరుద్యోగ అభ్యర్థుల పాలిట ప్రాణాంతకంగా మారిన పరుగు పందెంను తొలగించాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ పరుగు పందెం పరీక్షను తొలగించింది.
పీఈటీలో మార్పులు ఇలా..
ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్(పీఈటీ) ప్రక్రియలో సైతం మార్పులు చేసింది. గతంలో పురుష అభ్యర్థులు షాట్‌ఫుట్, హైజంప్, లాంగ్ జంప్, 100 మీటర్ల పరుగు, 800 మీటర్ల పరుగు కలిపి మొత్తం 5 విభాగాల్లో కచ్చితంగా ప్రతిభను చాటాల్సిందే. కానీ ఇప్పుడు 800 మీటర్ల పరుగుతో పాటు ఏవేని మరో రెండు విభాగాల్లో ప్రతిభ చూపితే సరిపోతుంది. మహిళా అభ్యర్థులకు 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్, షాట్‌ఫుట్‌తో కలిపి మొత్తం మూడు విభాగాల్లో పరీక్షలు నిర్వహించనుండగా.. అందులో ఏ రెండు పరీక్షల్లోనైనా ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది. పోలీసు శాఖలో మెకానికల్ ఉద్యోగాల కోసం ఆర్టీసీ తరహాలో ట్రేడ్ టెస్ట్ నిర్వహించనున్నారు. రాత పరీక్షల సిలబస్‌లో తెలంగాణ చరిత్రను తప్పనిసరి చేశారు.
స్పెషల్ ప్రొటెక్షన్, అగ్నిమాపక శాఖల్లో కేటగిరీల వారీగా భర్తీ చేయనున్న పోస్టులు ఇవీ..
===
స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సులో..
కేటగిరీ పోస్టుల సంఖ్య
ఎస్‌ఐ 12
కానిస్టేబుళ్లు 174
----------------------
మొత్తం 186
------------------------
అగ్నిమాపక శాఖలో..
కేటగిరీ పోస్టుల సంఖ్య
ఫైర్‌మెన్/డ్రైవర్ 500
ఎస్‌ఐ 9
------------------------
మొత్తం 509
---------------------
పోలీసు శాఖలో భర్తీ చేయనున్న పోస్టులు
కేటగిరీ పోస్టులు
సివిల్ కానిస్టేబుళ్లు 1,880
ఆర్మ్‌డ్ కానిస్టేబుళ్లు 2,800
స్పెషల్ కానిస్టేబుళ్లు 3,200
ఎస్‌ఐ(సివిల్) 107
ఎస్‌ఐ(ఆర్మ్‌డ్) 91
ఎస్‌ఐ(స్పెషల్ పోలీసు) 288
ఎస్‌ఐ(కమ్యూనికేషన్) 35
మొత్తం 8,401