రాష్ట్రానికి కొత్త మద్యం డిపోలు
* ఐదు జిల్లాల్లో అదనపు డిపోల ఏర్పాటుకు టీఎస్‌బీసీఎల్ నిర్ణయం
* ప్రస్తుతం 10 జిల్లాల్లో 17 మద్యం డిపోలు
* డిమాండ్‌ను తీర్చలేకపోతున్న ప్రస్తుత డిపోలు
* కొత్త జిల్లాల ఏర్పాటుకు అనుగుణంగా ఐదు జిల్లాల్లో డిపోలకు సన్నాహాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెరుగుతున్న మద్యం వినియోగానికి అనుగుణంగా కొత్త డిపోల ఏర్పాటుకు తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ (టీఎస్‌బీసీఎల్) సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం మద్యం సరఫరా చేస్తున్న 17 డిపోలకు తోడు మరో ఐదింటిని పెంచాలని సంస్థ నిర్ణయించింది.
ఈ మేరకు సంస్థ ఎండీ, ఎక్సైజ్ కమిషనర్ ఆర్‌వీ చంద్రవదన్ నేతృత్వంలో ఇటీవల జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కొత్త డిపోలకు సంబంధించి టీఎస్‌బీసీఎల్ జీఎం సంతోష్‌రెడ్డి ప్రతిపాదనలు సిద్ధం చేయగా, ఎండీ చంద్రవదన్ ఆమోదించినట్లు సమాచారం.
17 డిపోల ద్వారా మద్యం సరఫరా
ప్రస్తుతం రాష్ట్రంలో 2,143 మద్యం దుకాణాలు, 804 బార్లు, 27 క్లబ్బులతో పాటు పర్యాటక ప్రాంతాల్లో 8 టీడీ1 లెసైన్సు క్లబ్బులు ఉన్నాయి. వీటన్నింటికీ మద్యం సరఫరా చేసేందుకు 17 డిపోలను టీఎస్‌బీసీఎల్ నిర్వహిస్తోంది. డిస్టిలరీలు, బ్రూవరీల నుంచి కాంట్రాక్టర్లు(సప్లైయర్లు) పంపించిన ఐఎం ఎఫ్‌ఎల్(దేశీ తయారీ విదేశీ మద్యం), బీర్లు, ఫారిన్ లిక్కర్‌ను ఆయా దుకాణాలు, బార్లకు ఈ డిపోల ద్వారానే సరఫరా జరుగుతోంది. తెలంగాణలో 18 కంపెనీల నుంచి ఉత్పత్తి అయ్యే మద్యం బ్రాండ్లను 34 లెసైన్సు పొందిన కంపెనీలు డిపోలకు సరఫరా చేస్తుండగా, ఇతర రాష్ట్రాలకు చెందిన బ్రాండ్లు 86 కంపెనీల ద్వారా సరఫరా అవుతున్నాయి. మరో 18 కంపెనీలు కేవలం విదేశీ మద్యాన్ని సరఫరా చేస్తున్నాయి.
తద్వారా ఒక్కో డిపోలో 300 నుంచి 750 రకాల/బ్రాండ్ల మద్యం సీసాలు వందలాది కార్టన్లలో ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. రాష్ట్రంలోని 17 డిపోల్లో హైదరాబాద్ పరిధిలోని దుకాణాలకు 2 డిపోలు, రంగారెడ్డి జిల్లా పరిధిలోని దుకాణాలకు 4 డిపోల నుంచి మద్యం సరఫరా అవుతుంది. ఆదిలాబాద్, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో రెండేసి చొప్పున డిపోలు ఉండగా నిజామాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్, ఖమ్మం, మెదక్ జిల్లాల్లో ఒక్కో డిపో మాత్రమే ఉంది. ఒకే డిపో నుంచి జిల్లావ్యాప్తంగా మద్యం అందించడం కష్టమవుతోంది. హైదరాబాద్‌లోని రెండు డిపోల వద్దకు మద్యం కోసం ఉదయం వెళ్లిన ట్రక్కులు రాత్రి వరకు లోడ్ నింపుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో డిపోలను పెంచి మద్యం సరఫరా చేయాలని టీఎస్‌బీసీఎల్ నిర్ణయించింది.
5 జిల్లాల్లో తొలుత.. నగరంలో తర్వాత..
నిజామాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్, నల్లగొండ, వరంగల్‌లో తొలుత అదనంగా ఒక్కో డిపోను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. వరంగల్ జిల్లా తడవాయిలో ఇప్పటికే డిపో ఏర్పాటుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మిగతా నాలుగు జిల్లాల్లో డిపోలను ఏర్పాటు చేసేటప్పుడు భవిష్యత్తులో కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాల భౌగోళిక స్వరూపాన్ని పరిగణనలోకి తీసుకోనున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రస్తుతం తిమ్మాజిపేటలో డిపో ఉండగా, గద్వాల, ఆలంపూర్ ప్రాంతంలో కొత్త డిపో ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
కరీంనగర్‌లో ప్రస్తుతం డిపో ఉండగా, కొత్తగా ఏర్పాటు చేయనున్న జగిత్యాల ప్రాంతంలో, మెదక్ జిల్లాలో సిద్ధిపేట ప్రాంతంలో, ఖమ్మం జిల్లాలో భద్రాచలం, కొత్తగూడెం ప్రాంతంలో డిపోలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలోని మద్యం దుకాణాల కోసం ఇప్పుడున్న రెండు డిపోలకు అదనంగా మరో డిపోను ఏర్పాటు చేసే యోచన ఉంది. అలాగే హైదరాబాద్‌లో అదనపు డిపోల ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఓ టీఎస్‌బీసీఎల్ అధికారి చెప్పారు.
మద్యం డిపోలు పెంచుతాం
డిమాండ్‌కు అనుగుణంగా మద్యం డిపోలను పెంచాలని టీఎస్‌బీసీఎల్ నిర్ణయించింది. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వం ఆమోదం లభించగానే కొత్త డిపోలు ఏర్పాటు చేస్తాం.
- చంద్రవదన్, టీఎస్‌బీసీఎల్ ఎండీ