TSBCL
-
వైన్ ఇండస్ట్రీ కోసం కసరత్తు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వైన్ పరిశ్రమను నెలకొల్పడానికి తెలంగాణ బెవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్‌బీసీఎల్) కసరత్తు చేస్తోంది. ఇందుకోసం జాతీయ స్థాయి కంపెనీలను ఆకర్షించే పనిలో పడింది. తద్వారా ఆదాయం సమకూర్చుకోవడంతో పాటు, యువతకు ఉపాధి కల్పించవచ్చని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ క్రమంలోనే టీఎస్‌బీసీఎల్ చైర్మన్ దేవీప్రసాద్ మహారాష్ట్ర నాసిక్‌లో ఓ జాతీయ స్థాయి వైన్ పరిశ్రమను సందర్శించి, పలు అంశాలను అధ్యయనం చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకు 50 వేల కేసుల వైన్ వినియోగిస్తున్నారు. ఇక్కడ వైన్ పరిశ్రమ లేక ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. హైదరాబాద్‌లో వైన్ పరిశ్రమ ఏర్పాటు చేస్తే.. నగరం చుట్టూ ఉన్న మేడ్చల్, యాదాద్రి, శంషాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట తదితర జిల్లాలకు చెందిన రైతాంగాన్ని కొంత మేరకు పత్తి సాగు నుంచి తప్పించి ద్రాక్ష తోటల పెంపకం వైపు మళ్లించవచ్చని కూడా ప్రభుత్వం యోచిస్తోంది. -
చిల్లరపేరిట బీరుపై బాదుడు!
-
సర్కారుకు ‘చిల్లర’ కిక్కు
మందుబాబుల జేబుకు చిల్లు మద్యంపై 6 నుంచి 10 శాతం ధరల వడ్డింపు ఎమ్మార్పీలో రూ. 5 ఉంటే.. రౌండ్‌ఫిగర్‌గా రూ. 10కి పెంపు ప్రభుత్వానికి ఏటా రూ.600 కోట్ల ఆదాయం శనివారం నుంచే అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం దుకాణదారుల విజ్ఞప్తి మేరకే పెంచినట్లు కమిషనర్ ప్రకటన సాక్షి, హైదరాబాద్ మందుబాబుల జేబులు లూటీ కానున్నాయి! రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలు పెంచేసింది. వివిధ రకాల మద్యంపై 6 శాతం నుంచి 10 శాతం ధరలు వడ్డించింది. ఈ ధరల పెంపుతో సర్కారు ప్రతినెలా దాదాపు రూ.50 కోట్ల (ఏడాదికి రూ.600 కోట్లు) అదనపు ఆదాయం ఆర్జించనుంది. తెలంగాణ స్టేట్ బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్‌బీసీఎల్) పంపిన ధరల పెంపు ప్రతిపాదనలను ఏడాది పాటు పెండింగ్‌లో ఉంచిన ప్రభుత్వం శనివారం నుంచే వాటిని అమల్లోకి తెచ్చింది. రూ. 5తో ముడిపడి ఉన్న మద్యం అమ్మటం ఇబ్బందిగా ఉందని, రూ.5 చిల్లర, నాణేలను తిరిగివ్వటం సమస్యగా మారినందున ధరలు పెంచినట్లు ప్రకటించింది. రూ.5తో ముడిపడి ఉన్న మద్యం ధరలను రూ.10 ఉండేలా సవరించింది. ఉదాహరణకు మార్కెట్లో రూ.105 ఉన్న బీరును రూ.110 పెంచింది. మరోవైపు వ్యాట్ సవరణ పేరుతో ప్రీమియం మద్యంపై పది శాతం వరకు ధరలు వడ్డించింది. కొంతకాలంగా మద్యం వ్యాపారులు గరిష్ట చిల్లర ధరలో రూ.5ను తొలగించాలని, రౌండప్‌గా రూ. 10 చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే మద్యం వ్యాపారులు ఎమ్మార్పీ పాటించట్లేదని, రూ.5 చిల్లర తిరిగివ్వటం లేదంటూ కొనుగోలుదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీన్ని పరిష్క రించేందుకు ధరలను స్వల్పంగా పెంచాల్సి వచ్చిందని ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో ప్రతి నెలా రూ.50 కోట్ల ఆదాయం పెరుగుతుందన్నారు. పన్ను విధానంలో మార్పు.. మద్యంపై ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ డ్యూటీ, ట్యాక్స్ విధానం సంక్లిష్టంగా ఉంది. 130 శాతం నుంచి 190 శాతం వరకు వ్యాట్ స్లాబ్‌లు అమల్లో ఉన్నాయి. ఐఎంఎఫ్ఎల్ మద్యానికి సంబంధించి ఆరు కేటగిరీల్లో ఎక్సైజ్ డ్యూటీ విధిస్తున్నారు. ఈ శ్లాబులన్నీ రద్దు చేసి మద్యంపై 70 శాతం వ్యాట్, బీర్, వైన్, లిక్కర్‌పై నాలుగు రకాల ఎక్సైజ్ డ్యూటీలుండేలా పన్ను విధానాన్ని మార్చాలని గతేడాది ఎక్సైజ్ విభాగం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ఈ పన్నుల సవరణతో స్వల్పంగా భారం పడుతుందని, అరవై శాతం అమ్మకాలు జరిగే సాధారణ, మీడియం, ప్రీమియం బ్రాండ్లపై బాటిల్‌కు రూ.5 ధర పెరుగనుందని ప్రభుత్వం ప్రకటించింది. ప్రీమియం బ్రాండ్లపై 180 మిల్లీలీటర్ల బాటిల్‌కు రూ.30 నుంచి రూ.40 చొప్పున ధర పెరుగుతుంది. ఆదాయం కోణంలోనే.. ఆశించినంత ఆదాయం రాకపోవటం, నోట్ల రద్దుతో అంచనాలు తలకిందులవటంతో రాష్ట్ర సర్కారు ఆర్థికంగా ఇబ్బంది పడుతోంది. అందుకే ఇంతకాలం పెండింగ్‌లో పెట్టిన మద్యం ధరల పెంపు ఫైలును ముందుకు కదిపింది. మద్యం ధరల పెంపుతో సర్కారు కంటే ఎక్కువగా మద్యం వ్యాపారులు, డిస్టిలరీల యాజమాన్యాలకు లాభాల పంట పండనుంది. మద్యం ప్రియులపై వడ్డించనున్న రూ.600 కోట్ల అదనపు భారంలో వ్యాట్ రూపంలో ఖజానాకు చేరేది దాదాపు రూ.250 కోట్లు మాత్రమే. మిగతా రూ.350 కోట్లు డిస్టిలరీల యాజమాన్యాలు, రిటైలర్లు, మద్యం వ్యాపారుల గల్లా పెట్టెల్లోకి చేరుతుంది. ఇతర రాష్ట్రాల్లో రెండేళ్లకోసారి మద్యం ధరలపై సమీక్ష జరుగుతుంది. కానీ ఇక్కడ మూడేళ్లుగా పెంచటం లేదని.. డిస్టిలరీల యాజమాన్యాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాయి. అందుకే అటు డిస్టిలరీల యాజమాన్యాలు, మద్యం వ్యాపారులకు లబ్ధి చేకూరటంతో పాటు.. ఇటు ఖజానాకు కాస్తో కూస్తో ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మద్యం ధరలను పెంచేందుకు ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ ఇచ్చిన నివేదిక మేరకే చీప్ లిక్కర్, మీడియం లిక్కర్, ప్రీమియం లిక్కర్, విదేశీ మద్యం ధరలను పెంచింది. -
రాష్ట్రానికి కొత్త మద్యం డిపోలు
* ఐదు జిల్లాల్లో అదనపు డిపోల ఏర్పాటుకు టీఎస్‌బీసీఎల్ నిర్ణయం * ప్రస్తుతం 10 జిల్లాల్లో 17 మద్యం డిపోలు * డిమాండ్‌ను తీర్చలేకపోతున్న ప్రస్తుత డిపోలు * కొత్త జిల్లాల ఏర్పాటుకు అనుగుణంగా ఐదు జిల్లాల్లో డిపోలకు సన్నాహాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెరుగుతున్న మద్యం వినియోగానికి అనుగుణంగా కొత్త డిపోల ఏర్పాటుకు తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ (టీఎస్‌బీసీఎల్) సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం మద్యం సరఫరా చేస్తున్న 17 డిపోలకు తోడు మరో ఐదింటిని పెంచాలని సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు సంస్థ ఎండీ, ఎక్సైజ్ కమిషనర్ ఆర్వీ చంద్రవదన్ నేతృత్వంలో ఇటీవల జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కొత్త డిపోలకు సంబంధించి టీఎస్‌బీసీఎల్ జీఎం సంతోష్‌రెడ్డి ప్రతిపాదనలు సిద్ధం చేయగా, ఎండీ చంద్రవదన్ ఆమోదించినట్లు సమాచారం. 17 డిపోల ద్వారా మద్యం సరఫరా ప్రస్తుతం రాష్ట్రంలో 2,143 మద్యం దుకాణాలు, 804 బార్లు, 27 క్లబ్బులతో పాటు పర్యాటక ప్రాంతాల్లో 8 టీడీ1 లెసైన్సు క్లబ్బులు ఉన్నాయి. వీటన్నింటికీ మద్యం సరఫరా చేసేందుకు 17 డిపోలను టీఎస్‌బీసీఎల్ నిర్వహిస్తోంది. డిస్టిలరీలు, బ్రూవరీల నుంచి కాంట్రాక్టర్లు(సప్లైయర్లు) పంపించిన ఐఎం ఎఫ్ఎల్(దేశీ తయారీ విదేశీ మద్యం), బీర్లు, ఫారిన్ లిక్కర్‌ను ఆయా దుకాణాలు, బార్లకు ఈ డిపోల ద్వారానే సరఫరా జరుగుతోంది. తెలంగాణలో 18 కంపెనీల నుంచి ఉత్పత్తి అయ్యే మద్యం బ్రాండ్లను 34 లెసైన్సు పొందిన కంపెనీలు డిపోలకు సరఫరా చేస్తుండగా, ఇతర రాష్ట్రాలకు చెందిన బ్రాండ్లు 86 కంపెనీల ద్వారా సరఫరా అవుతున్నాయి. మరో 18 కంపెనీలు కేవలం విదేశీ మద్యాన్ని సరఫరా చేస్తున్నాయి. తద్వారా ఒక్కో డిపోలో 300 నుంచి 750 రకాల/బ్రాండ్ల మద్యం సీసాలు వందలాది కార్టన్లలో ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. రాష్ట్రంలోని 17 డిపోల్లో హైదరాబాద్ పరిధిలోని దుకాణాలకు 2 డిపోలు, రంగారెడ్డి జిల్లా పరిధిలోని దుకాణాలకు 4 డిపోల నుంచి మద్యం సరఫరా అవుతుంది. ఆదిలాబాద్, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో రెండేసి చొప్పున డిపోలు ఉండగా నిజామాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్, ఖమ్మం, మెదక్ జిల్లాల్లో ఒక్కో డిపో మాత్రమే ఉంది. ఒకే డిపో నుంచి జిల్లావ్యాప్తంగా మద్యం అందించడం కష్టమవుతోంది. హైదరాబాద్‌లోని రెండు డిపోల వద్దకు మద్యం కోసం ఉదయం వెళ్లిన ట్రక్కులు రాత్రి వరకు లోడ్ నింపుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో డిపోలను పెంచి మద్యం సరఫరా చేయాలని టీఎస్‌బీసీఎల్ నిర్ణయించింది. 5 జిల్లాల్లో తొలుత.. నగరంలో తర్వాత.. నిజామాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్, నల్లగొండ, వరంగల్‌లో తొలుత అదనంగా ఒక్కో డిపోను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. వరంగల్ జిల్లా తడవాయిలో ఇప్పటికే డిపో ఏర్పాటుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మిగతా నాలుగు జిల్లాల్లో డిపోలను ఏర్పాటు చేసేటప్పుడు భవిష్యత్తులో కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాల భౌగోళిక స్వరూపాన్ని పరిగణనలోకి తీసుకోనున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రస్తుతం తిమ్మాజిపేటలో డిపో ఉండగా, గద్వాల, ఆలంపూర్ ప్రాంతంలో కొత్త డిపో ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కరీంనగర్లో ప్రస్తుతం డిపో ఉండగా, కొత్తగా ఏర్పాటు చేయనున్న జగిత్యాల ప్రాంతంలో, మెదక్ జిల్లాలో సిద్ధిపేట ప్రాంతంలో, ఖమ్మం జిల్లాలో భద్రాచలం, కొత్తగూడెం ప్రాంతంలో డిపోలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలోని మద్యం దుకాణాల కోసం ఇప్పుడున్న రెండు డిపోలకు అదనంగా మరో డిపోను ఏర్పాటు చేసే యోచన ఉంది. అలాగే హైదరాబాద్‌లో అదనపు డిపోల ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఓ టీఎస్‌బీసీఎల్ అధికారి చెప్పారు. మద్యం డిపోలు పెంచుతాం డిమాండ్‌కు అనుగుణంగా మద్యం డిపోలను పెంచాలని టీఎస్‌బీసీఎల్ నిర్ణయించింది. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వం ఆమోదం లభించగానే కొత్త డిపోలు ఏర్పాటు చేస్తాం. - చంద్రవదన్, టీఎస్‌బీసీఎల్ ఎండీ -
సర్కారు మద్యం వ్యాపారం!
టీఎస్‌బీసీఎల్ ద్వారా లిక్కర్ షాపుల నిర్వహణకు ప్రణాళికలు * పెరిగిన లెసైన్సు ఫీజుతో మద్యం వ్యాపారులు వెనకడగు వేస్తుండటం వల్లే.. * జీహెచ్ఎంసీ, వరంగల్, కరీంనగర్‌లలో ఎ-4 షాపుల ఫీజు అధికం * నేటి నుంచి మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ సాక్షి, హైదరాబాద్: మద్యం వ్యాపారాన్ని సొంతంగా నిర్వహించేందుకు ఎక్సైజ్‌శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రెండేళ్ల కాలానికి మద్యం దుకాణాలకు అనుమతిస్తూ లెసైన్సు ఫీజును 20 శాతం పెంచిన నేపథ్యంలో వ్యాపారులు నిర్వహణకు ముందుకు రానిచోట బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా వ్యాపారం చేయాలని భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో 10 శాతం మద్యం దుకాణాలను అక్కడి ఎక్సైజ్‌శాఖ ఇప్పటికే నిర్వహిస్తున్న నేపథ్యంలో అవసరమైతే అదే ప్రయోగాన్ని రాష్ట్రంలో చేపట్టాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఈ మేరకు తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నూతన మద్యం పాలసీకి సంబంధించిన విధివిధానాలు విడుదల చేసినప్పుడే ఎవరూ దుకాణాలు తీసుకునేందుకు ముందుకు రాని చోట టీఎస్‌బీసీఎల్ పేరుతో ఎ-4 షాపులు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఎక్సైజ్ కమిషనర్ ఆర్.వి. చంద్రవదన్ కూడా ధ్రువీకరించారు. జీహెచ్ఎంసీ, వరంగల్, కరీంనగర్‌లలో భారీగా పెరిగిన ఫీజు రాష్ట్రంలో 2,216 మద్యం దుకాణాలు ఉండగా ప్రభుత్వం వాటిని జనాభా ప్రాతిపదికన విభజించి ప్రస్తుతమున్న లెసైన్సు ఫీజులను 20 శాతం పెంచుతూ ఖరారు చేసింది. ఈ మొత్తాన్ని వ్యాపారులు ఆరు వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. 10 వేల లోపు జనాభా గల 679 దుకాణాలకు సంవత్సరానికి రూ. 39 లక్షల చొప్పున రెండేళ్లకు రూ. 78 లక్షలు చెల్లించాలి. అలాగే 10వేల నుంచి 50 వేల జనాభా ఉన్న 576 దుకాణాలలో ఒక్కో దానికి రూ. 81.60 లక్షలు, 50 వేల నుంచి 3 లక్షలలోపు జనాభాగల 396 దుకాణాలకు రూ. కోటీ ఎనభై వేల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇవన్నీ ఒకెత్తయితే కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 22 దుకాణాలకు ఫీజు రెండేళ్లకు ఏకంగా రూ. 20 లక్షల చొప్పున పెరగగా, కొత్తగా గ్రేటర్ కార్పొరేషన్ అయిన వరంగల్ పరిధిలోని 40 దుకాణాలకు లెసైన్సు ఫీజును 1.63 కోట్లుగా నిర్ణయించారు. వరంగల్ గ్రేటర్ కార్పొరేషన్ కావడంతో గ్రామీణ పరిధిలోని మరో 3 దుకాణాలు కూడా ఇప్పుడు కార్పొరేషన్ పరిధికి చేరాయి. ఇక జీహెచ్ఎంసీలో రూ. 90 లక్షలు ఉన్న లెసైన్సు ఫీజును రెండేళ్లకు రూ. 2.16 కోట్లకు పెంచడం వ్యాపారులకు అశనిపాతం అయింది. నేటి నుంచి దరఖాస్తులు అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానున్న రెండేళ్ల మద్యం పాలసీకి సంబంధించి సోమవారం నుంచి దరఖాస్తులను ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచుతారు. రూ. 50 వేలు చెల్లించి దరఖాస్తులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 21వ తేదీ లోపు దరఖాస్తులను అందజేయాలి. 23న జిల్లా కలెక్టర్ల సమక్షంలో డ్రా తీస్తారు. రాష్ట్రవ్యాప్తంగా మిగిలిపోనున్న షాపులు జీహెచ్ఎంసీ పరిధిలో 503 మద్యం దుకాణాలు ఉండగా వీటికి 2014-15 సంవత్సరంలో లెసైన్సు ఫీజును రూ. 90 లక్షలుగా నిర్ణయించి దరఖాస్తులు కోరితే 103 దుకాణాలను ఎవరూ తీసుకోలేదు. రంగారెడ్డి జిల్లాలోని అర్బన్ ప్రాంతంతోపాటు మెదక్ జిల్లా పటాన్చెరు, రామచంద్రాపురం జీహెచ్ఎంసీ పరిధిలోకి రాగా, గ్రేటర్ సరిహద్దు గీతకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలు, మండల కేంద్రాలను కూడా గ్రేటర్ పరిధిలోకి తేవడమే ఇందుకు కారణం. మెదక్ జిల్లా పరిధిలోని పటాన్చెరు, రామచంద్రాపురం ప్రాంతాల్లోని 15 దుకాణాల్లో ఒక్క దుకాణాన్ని కూడా ఎవరూ తీసుకోలేదు. అలాగే హైదరాబాద్ సిటీ, రంగారెడ్డిలో కూడా అదే పరిస్థితి. వరంగల్ గ్రేటర్ కార్పొరేషన్ అయ్యాక జూలై నుంచి సెప్టెంబర్ వరకు లెసైన్సులను రెన్యూవల్ చేయించుకోవాలని ప్రభుత్వం కోరగా 8 షాపుల వ్యాపారులు వెనకడుగు వేశారు. అలా రాష్ట్రంలో మరో 50 దుకాణాలను మూన్నెళ్ల కాలానికి ఎవరూ తీసుకోలేదు. ఈ పరిస్థితుల్లో 20 శాతం లెసైన్సు ఫీజు పెంచుతూ తీసుకున్న నిర్ణయం వల్ల హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో కూడా భారీగా దుకాణాలు మిగిలిపోయే అవకాశం ఉందని ఎక్సైజ్ అధికారులు కూడా ఒప్పుకుంటున్నారు. -
రూ.1,274 కోట్లపై చిగురించిన ఆశలు
► జప్తు చెల్లదని ఐటీ శాఖకు న్యాయనిపుణుల సూచన ►కంపెనీల చట్టమే కొండంత రక్ష ► పునరాలోచనలో ఐటీ శాఖ ►సొమ్ము వెనక్కి వస్తుందన్న ధీమాతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ (టీఎస్‌బీసీఎల్) నుంచి ఆదాయపు పన్ను శాఖ సీజ్ చేసిన రూ.1,274 కోట్లపై ఆశలు చిగురిస్తున్నాయి. జప్తు చేసిన విధానం చెల్లుబాటు కాదని ఢిల్లీలోని న్యాయ నిపుణులు, కన్సల్టెంట్లు ఐటీ శాఖకు స్పష్టమైన సంకేతాలు జారీ చేశారు. కంపెనీల చట్టం ఉల్లంఘించినట్లవుతుందని, కంపెనీల్లో అవినీతి జరిగిన సందర్భంలో తప్ప మిగతా సమయంలో యాజమాన్యాలకు చెందిన ఇతర ఆస్తుల జోలికి వెళ్లటం చట్టవ్యతిరేకమేనని తేల్చిచెప్పారు. దీంతో ఐటీ శాఖ పునరాలోచనలో పడింది. ఈ సమాచారం బయటకు పొక్కటంతో తెలంగాణ ఆర్థిక శాఖ ఊపిరి పీల్చుకుంది. ఒక్కసారిగా పెద్దమొత్తంలో సీజ్ చేసిన నిధులు తిరిగివస్తాయనే ధీమా వ్యక్తపరుస్తోంది. గత జూన్ 27న టీఎస్‌బీసీఎల్ బకాయిల కింద సర్కారు ఖాతా నుంచి రూ.1,274 కోట్లను ఐటీ శాఖ ఆర్బీఐ నుంచి నేరుగా సీజ్ చేసింది. దీనిపై కేంద్రం నుంచి ఎలాంటి సాయం లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ విభజన పూర్తిగా జరగకుండానే తెలంగాణ కోటా నుంచి బకాయిలు వసూలు చేయటం సమ్మతం కాదని, అది కోర్టు ధిక్కారమవుతుందని పేర్కొంది. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టులో ఉంది. తాము నోటీసులు ఇచ్చినా స్పందించలేదని.. అందుకే నిధులను సీజ్ చేశామని ఐటీ శాఖ తెలిపింది. కానీ ప్రభుత్వ ఖాతాలోని నిధులను వినియోగించే హక్కు శాసనసభ ఆమోదం లేదా.. కోర్టు లు జారీ చేసే డిక్రీలకు మాత్రమే ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అందుకే ఐటీ శాఖ నోటీసులు కోర్టు డిక్రీలవుతాయా? లేదా? అనే ధర్మసందేహం వెలిబుచ్చుతున్నారు హెచ్ఎండీఏ, కుడాకు నోటీసులు పన్నుల వసూలులో ఐటీ శాఖ దూకుడు మాత్రం తగ్గించలేదు. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లపై ఓ కన్నేసి ఉంచింది. బేవరేజెస్ కార్పొరేషన్ తరహాలోనే (హెచ్ఎండీఏ), కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి(కుడా) నోటీసులు జారీ చేసింది. బకాయిలు చెల్లించాలని.. లేకుంటే ఆస్తులు జప్తు చేస్తామని పేర్కొంది. తెలంగాణ ఫుడ్స్ కూడా ఐటీ పన్నుల చిక్కుల్లో పడింది. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ ఫుడ్స్‌గా ఉన్నప్పుడు సెక్షన్ 10 కింద ఈ కార్పొరేషన్‌కు ఐటీ మినహాయింపు ఉంది. కానీ, ఇదో ఆర్థిక లావాదేవీల వ్యాపారంగా చూపించటంతో తెలంగాణ ఫుడ్స్‌కు ఐటీ విభాగం ఈ సెక్షన్ రిజిస్ట్రేషన్ రద్దు చేసినట్లు నోటీసులు జారీ చేసింది. దీంతో ఐటీ పన్నులు తప్పని పరిస్థితి తలెత్తింది. -
టీఎస్‌బీసీఎల్‌ను ఉంచాలా? మూయాలా?
సాక్షి, హైదరాబాద్: ఆదాయపు పన్ను బకాయిల నుంచి సాంకేతిక కారణాలతో బయటపడ్డ తెలంగాణ ఎక్సైజ్ శాఖ భవిష్యత్తులో ఐటీ తలనొప్పి లేని మార్గాలను అన్వేషిస్తోంది. కంపెనీల చట్టం ప్రకారం వ్యాపారం ద్వారా ఆదాయం పొందే ఏ సంస్థ అయినా పన్ను చెల్లించాలన్న నిబంధన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర బేవరేజేస్ కార్పొరేషన్ (టీఎస్‌బీసీఎల్)ను మూసేస్తే ఎలా ఉంటుందన్న అంశాన్ని పరిశీలి స్తోంది. మద్యం విక్రయాలపై వచ్చిన ఆదాయం ఆధారంగా టీఎస్‌బీసీఎల్ పన్ను చెల్లించాలని గత కొన్నేళ్లుగా ఉమ్మడి రాష్ట్రంలోని ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్‌కు ఐటీ శాఖ నోటీసులు జారీ చేస్తోంది. కోర్టుల ద్వారా తాత్కాలిక ఉపశమనం పొందుతూ ఏపీబీసీఎల్ నెట్టుకొస్తోంది. ఈ నేపథ్యంలో మార్చి 28న 2012-13కు బకాయిలు రూ.1,468 కోట్లు చెల్లించాలని నోటీసులు జారీ చేస్తూ 3 జిల్లాల్లో మద్యం డిపోలను ఐటీ శాఖ సీజ్ చేసింది. దీంతో కోర్టును ఆశ్రయించిన టీ సర్కార్ ఉపశమనం పొందింది. అదే సమయంలో ఏపీ సర్కార్ మాత్రం ఆ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్‌ను పూర్తిగా మూసేసి ఎక్సైజ్ శాఖ ద్వారానే మద్యం అమ్మకాలు, డిపోల నిర్వహణ పర్యవేక్షిస్తోంది. తద్వారా పాత బకాయిలు ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించినవని వాటిని ఎగ్గొట్టే ఎత్తుగడ వేయడంతో పాటు భవిష్యత్తులో మద్యం అమ్మకాలపై ఐటీ మినహాయింపు పొందాలని భావిస్తోంది. దీంతో తెలంగాణలో టీఎస్‌బీసీఎల్‌పై యంత్రాంగం తర్జన భర్జన పడుతోంది. ఎక్సైజ్ శాఖ విక్రయాలపై పన్ను భారం ఉండదా? ఏపీ తరహాలో తెలంగాణలో కూడా బేవరేజెస్ కార్పొరేషన్‌ను రద్దు చేయాలని భావించినా, టీఎస్‌బీసీఎల్ ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. 10 జిల్లాల్లో కార్పొరేషన్ కింద 143 మంది ఉద్యోగులు, 200 మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు గౌడ్‌ను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. కార్పొరేషన్‌తో సంబంధం లేకుండా తమిళనాడు, కేరళ, కర్ణాటక, రాజస్తాన్‌లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే మద్యం విక్రయాలు జరుపుతున్నా ఐటీ శాఖ పన్ను నోటీసులు జారీ చేస్తూనే ఉందని తెలిపారు. ఎక్సైజ్ శాఖ ద్వారా విక్రయించినా పన్ను చెల్లించాల్సిందేనని పేర్కొన్నారు. దీంతో మంత్రి పద్మారావు కమిషనర్‌ను నివేదిక కోరగా, ఐటీ చట్టంలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన మినహాయింపులు, కంపెనీల చట్టంలో ఉన్న నిబంధనలతో ఓ నివేదిక రూపొందించినట్లు సమాచారం. -
నిబంధనల మేరకే చర్యలు
టీఎస్‌బీసీఎల్ డిపోల జప్తుపై హైకోర్టుకు ఐటీ శాఖ నివేదన సాక్షి, హైదరాబాద్: నిబంధనలను అనుసరించే తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్‌బీసీఎల్)కు చెందిన డిపోలు, గోడౌన్ల జప్తునకు ఆదేశాలు జారీ చేశామని ఉమ్మడి హైకోర్టుకు ఆదాయపు పన్నుశాఖ నివేదించింది. 2012-13, 2013-14 ఆర్థిక సంవత్సరాలకు టీఎస్‌బీసీఎల్ తమకు రూ.1,225 కోట్లు బకాయి పడిందని, వాటి వసూలు నిమిత్తమే జప్తునకు ఉపక్రమించామని తెలిపింది. ఐటీ శాఖ నోటీసును సవాలు చేస్తూ టీఎస్‌బీసీఎల్ హైకోర్టును ఆశ్రయించింది. దీనిని విచారించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం, జప్తు చేసిన సరుకును విక్రయించుకునేందుకు టీఎస్‌బీసీఎల్‌కు అనుమతినిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఐటీ శాఖను ఆదేశించడంతో ఆ శాఖ వసూలు అధికారి (టీఆర్ఓ) కౌంటర్ దాఖలు చేశారు. రాష్ట్ర విభజన తర్వా త తెలంగాణలోని మద్యం డిపోలు, గోడౌన్లన్నీ టీఎస్‌బీసీఎల్ పరిధిలోకి వస్తాయని, వాటి లావాదేవీలన్నిం టికీ అదే బాధ్యత వహించాలని కౌంటర్లో పేర్కొన్నారు. ఉమ్మడిగా ఉన్నప్పడు తమ సంస్థ ఏర్పాటు కాలేదనే నెపంతో బకాయిల చెల్లింపు బాధ్యత నుంచి టీఎస్‌బీసీఎల్ తప్పించుకోవాలని చూస్తోందన్నారు. విభజన నేపథ్యంలో ఆదాయం తీసుకుంటూ, బకాయిలకు సంబం ధం లేదని చెప్పడం సరికాదన్నారు. కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఉన్నప్పటికీ, జప్తు చేసిన మద్యం డిపోల్లోని సరుకును విక్రయించి, ఆ మొత్తాన్ని ప్రభుత్వ ఖాతాలో జమ చేసిందని, ఇది దురుద్దేశంతో చేసిందన్నారు. అందువల్ల వీటిని పరిగణనలోకి తీసుకుని, టీఎస్‌బీసీఎల్ పిటిషన్‌ను కొట్టివేయాలని అభ్యర్థించారు. -
టీఎస్‌బీసీఎల్‌కు మంగళం!
ఏపీ తరహాలో ఎక్సైజ్ శాఖ ద్వారానే మద్యం అమ్మకాలు ఆదాయపు పన్ను శాఖకు చెల్లింపుల నుంచి తప్పించుకునే ఉపాయం సాక్షి, హైదరాబాద్: ఆదాయపు పన్ను శాఖ దెబ్బకు విలవిల్లాడిన రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ శాఖకు అనుబంధంగా హోల్‌సేల్ మద్యం విక్రయాలు సాగించే తెలంగాణ బ్రూవరేజెస్ కార్పొరేషన్(టీఎస్‌బీసీఎల్)ను రద్దుచేయాలని యోచిస్తోంది. ప్రభుత్వ సంస్థగానే టీఎస్‌బీసీఎల్ కొనసాగుతున్నా, కేంద్ర ఆధీనంలోని ఆదాయపు పన్ను శాఖ మాత్రం దాన్ని ప్రైవేటు సంస్థల తరహాలోనే చూస్తూ కార్పొరేషన్ చట్టం కింద పన్ను వసూళ్ల కోసం ఒత్తిడి చేస్తోంది. దీనిలో భాగంగా ఈనెల 2 నుంచి 4 వరకు బకాయిల వసూళ్ల పేరుతో హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని 8 డిపోలకు ఇన్‌కం అటాచ్మెంటు నోటీసులు జారీచేసి మూసివేయించింది. 4న కోర్టు ను ఆశ్రయించి డిపోలను తెరిపించినా, కోర్టు తుది ఉత్తర్వులు వచ్చేలోపే టీఎస్‌బీసీఎల్‌ను రద్దు చేసి ఎక్సైజ్‌శాఖ ద్వారా మద్యం విక్రయాలు సాగించేలా ఉత్తర్వులు విడుదల కు రెడీ అవుతోంది. కాగా తెలంగాణ ప్రభుత్వం కన్నా ముందే స్పందించిన ఏపీ అక్కడి మద్యం డిపోల బాధ్యతలన్నీ ఎక్సైజ్‌శాఖకు బదిలీ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ బాటలోనే తెలంగాణ కూడా డిపోల బాధ్యతలన్నీ ఎక్సైజ్ శాఖకు బదిలీ చేయాలని నిర్ణయించినట్లు సమా చారం. మద్యం డిపోల బాధ్యతలను ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్లకు బదిలీ చేసి, ప్రస్తుతం టీఎస్‌బీసీఎల్ అధికారులు, ఉద్యోగులను కాంట్రాక్టు పద్ధతికి మార్చడమో, లేక వేరే కార్పొరేషన్‌కు బదిలీ చేసి అక్కడి నుంచి డిప్యుటేషన్ మీద ఎక్సైజ్‌శాఖకు తీసుకోవడమో చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఉద్యోగుల జీతభత్యాల్లో మార్పు రాకుండా ఈ బదిలీ ప్రక్రియ సాగించాలని నిర్ణయించినట్లు తెలిసింది. 3 రోజుల్లో దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడే అవకాశముందని ఎక్సైజ్ అధికారి ఒకరు తెలిపారు. ప్రభుత్వం ద్వారా విక్రయాలు జరిగితే పన్ను చెల్లించాల్సిన అవసరం లేనందున ఈ దిశగా ప్రభుత్వం వేగంగా కదులుతోంది.