సర్కారుకు ‘చిల్లర’ కిక్కు
- మందుబాబుల జేబుకు చిల్లు
- మద్యంపై 6 నుంచి 10 శాతం ధరల వడ్డింపు
- ఎమ్మార్పీలో రూ. 5 ఉంటే.. రౌండ్‌ఫిగర్‌గా రూ. 10కి పెంపు
- ప్రభుత్వానికి ఏటా రూ.600 కోట్ల ఆదాయం
- శనివారం నుంచే అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం
- దుకాణదారుల విజ్ఞప్తి మేరకే పెంచినట్లు కమిషనర్ ప్రకటన
సాక్షి, హైదరాబాద్
మందుబాబుల జేబులు లూటీ కానున్నాయి! రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలు పెంచేసింది. వివిధ రకాల మద్యంపై 6 శాతం నుంచి 10 శాతం ధరలు వడ్డించింది. ఈ ధరల పెంపుతో సర్కారు ప్రతినెలా దాదాపు రూ.50 కోట్ల (ఏడాదికి రూ.600 కోట్లు) అదనపు ఆదాయం ఆర్జించనుంది. తెలంగాణ స్టేట్ బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్‌బీసీఎల్) పంపిన ధరల పెంపు ప్రతిపాదనలను ఏడాది పాటు పెండింగ్‌లో ఉంచిన ప్రభుత్వం శనివారం నుంచే వాటిని అమల్లోకి తెచ్చింది. రూ. 5తో ముడిపడి ఉన్న మద్యం అమ్మటం ఇబ్బందిగా ఉందని, రూ.5 చిల్లర, నాణేలను తిరిగివ్వటం సమస్యగా మారినందున ధరలు పెంచినట్లు ప్రకటించింది. రూ.5తో ముడిపడి ఉన్న మద్యం ధరలను రూ.10 ఉండేలా సవరించింది.
ఉదాహరణకు మార్కెట్లో రూ.105 ఉన్న బీరును రూ.110 పెంచింది. మరోవైపు వ్యాట్ సవరణ పేరుతో ప్రీమియం మద్యంపై పది శాతం వరకు ధరలు వడ్డించింది. కొంతకాలంగా మద్యం వ్యాపారులు గరిష్ట చిల్లర ధరలో రూ.5ను తొలగించాలని, రౌండప్‌గా రూ. 10 చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే మద్యం వ్యాపారులు ఎమ్మార్పీ పాటించట్లేదని, రూ.5 చిల్లర తిరిగివ్వటం లేదంటూ కొనుగోలుదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీన్ని పరిష్క రించేందుకు ధరలను స్వల్పంగా పెంచాల్సి వచ్చిందని ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో ప్రతి నెలా రూ.50 కోట్ల ఆదాయం పెరుగుతుందన్నారు.
పన్ను విధానంలో మార్పు..
మద్యంపై ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ డ్యూటీ, ట్యాక్స్ విధానం సంక్లిష్టంగా ఉంది. 130 శాతం నుంచి 190 శాతం వరకు వ్యాట్ స్లాబ్‌లు అమల్లో ఉన్నాయి. ఐఎంఎఫ్‌ఎల్ మద్యానికి సంబంధించి ఆరు కేటగిరీల్లో ఎక్సైజ్ డ్యూటీ విధిస్తున్నారు. ఈ శ్లాబులన్నీ రద్దు చేసి మద్యంపై 70 శాతం వ్యాట్, బీర్, వైన్, లిక్కర్‌పై నాలుగు రకాల ఎక్సైజ్ డ్యూటీలుండేలా పన్ను విధానాన్ని మార్చాలని గతేడాది ఎక్సైజ్ విభాగం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ఈ పన్నుల సవరణతో స్వల్పంగా భారం పడుతుందని, అరవై శాతం అమ్మకాలు జరిగే సాధారణ, మీడియం, ప్రీమియం బ్రాండ్లపై బాటిల్‌కు రూ.5 ధర పెరుగనుందని ప్రభుత్వం ప్రకటించింది. ప్రీమియం బ్రాండ్లపై 180 మిల్లీలీటర్ల బాటిల్‌కు రూ.30 నుంచి రూ.40 చొప్పున ధర పెరుగుతుంది.
ఆదాయం కోణంలోనే..
ఆశించినంత ఆదాయం రాకపోవటం, నోట్ల రద్దుతో అంచనాలు తలకిందులవటంతో రాష్ట్ర సర్కారు ఆర్థికంగా ఇబ్బంది పడుతోంది. అందుకే ఇంతకాలం పెండింగ్‌లో పెట్టిన మద్యం ధరల పెంపు ఫైలును ముందుకు కదిపింది. మద్యం ధరల పెంపుతో సర్కారు కంటే ఎక్కువగా మద్యం వ్యాపారులు, డిస్టిలరీల యాజమాన్యాలకు లాభాల పంట పండనుంది. మద్యం ప్రియులపై వడ్డించనున్న రూ.600 కోట్ల అదనపు భారంలో వ్యాట్ రూపంలో ఖజానాకు చేరేది దాదాపు రూ.250 కోట్లు మాత్రమే. మిగతా రూ.350 కోట్లు డిస్టిలరీల యాజమాన్యాలు, రిటైలర్లు, మద్యం వ్యాపారుల గల్లా పెట్టెల్లోకి చేరుతుంది.
ఇతర రాష్ట్రాల్లో రెండేళ్లకోసారి మద్యం ధరలపై సమీక్ష జరుగుతుంది. కానీ ఇక్కడ మూడేళ్లుగా పెంచటం లేదని.. డిస్టిలరీల యాజమాన్యాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాయి. అందుకే అటు డిస్టిలరీల యాజమాన్యాలు, మద్యం వ్యాపారులకు లబ్ధి చేకూరటంతో పాటు.. ఇటు ఖజానాకు కాస్తో కూస్తో ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మద్యం ధరలను పెంచేందుకు ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ ఇచ్చిన నివేదిక మేరకే చీప్ లిక్కర్, మీడియం లిక్కర్, ప్రీమియం లిక్కర్, విదేశీ మద్యం ధరలను పెంచింది.