- టీఎస్‌బీసీఎల్ డిపోల జప్తుపై హైకోర్టుకు ఐటీ శాఖ నివేదన
సాక్షి, హైదరాబాద్: నిబంధనలను అనుసరించే తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్‌బీసీఎల్)కు చెందిన డిపోలు, గోడౌన్‌ల జప్తునకు ఆదేశాలు జారీ చేశామని ఉమ్మడి హైకోర్టుకు ఆదాయపు పన్నుశాఖ నివేదించింది. 2012-13, 2013-14 ఆర్థిక సంవత్సరాలకు టీఎస్‌బీసీఎల్ తమకు రూ.1,225 కోట్లు బకాయి పడిందని, వాటి వసూలు నిమిత్తమే జప్తునకు ఉపక్రమించామని తెలిపింది. ఐటీ శాఖ నోటీసును సవాలు చేస్తూ టీఎస్‌బీసీఎల్ హైకోర్టును ఆశ్రయించింది.
దీనిని విచారించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం, జప్తు చేసిన సరుకును విక్రయించుకునేందుకు టీఎస్‌బీసీఎల్‌కు అనుమతినిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఐటీ శాఖను ఆదేశించడంతో ఆ శాఖ వసూలు అధికారి (టీఆర్‌ఓ) కౌంటర్ దాఖలు చేశారు. రాష్ట్ర విభజన తర్వా త తెలంగాణలోని మద్యం డిపోలు, గోడౌన్‌లన్నీ టీఎస్‌బీసీఎల్ పరిధిలోకి వస్తాయని, వాటి లావాదేవీలన్నిం టికీ అదే బాధ్యత వహించాలని కౌంటర్‌లో పేర్కొన్నారు.
ఉమ్మడిగా ఉన్నప్పడు తమ సంస్థ ఏర్పాటు కాలేదనే నెపంతో బకాయిల చెల్లింపు బాధ్యత నుంచి టీఎస్‌బీసీఎల్ తప్పించుకోవాలని చూస్తోందన్నారు. విభజన నేపథ్యంలో ఆదాయం తీసుకుంటూ, బకాయిలకు సంబం ధం లేదని చెప్పడం సరికాదన్నారు. కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఉన్నప్పటికీ, జప్తు చేసిన మద్యం డిపోల్లోని సరుకును విక్రయించి, ఆ మొత్తాన్ని ప్రభుత్వ ఖాతాలో జమ చేసిందని, ఇది దురుద్దేశంతో చేసిందన్నారు. అందువల్ల వీటిని పరిగణనలోకి తీసుకుని, టీఎస్‌బీసీఎల్ పిటిషన్‌ను కొట్టివేయాలని అభ్యర్థించారు.