హెచ్‌ఎండీఏ వాదనలు వినండి
♦ ఐటీఏటీకి సుప్రీంకోర్టు ఆదేశం
♦ బకాయిల నుంచి హెచ్‌ఎండీఏకి ఊరట
సాక్షి, హైదరాబాద్: ఆదాయపు పన్ను బకాయిలు రూ.491 కోట్లు సత్వరం చెల్లించాలంటూ ఐటీ శాఖ తెస్తోన్న ఒత్తిళ్ల నుంచి హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)కు ఊరట లభించింది. ఐటీ బకాయిల చెల్లింపు విషయంలో ఇప్పటివరకు జరిగిన జాప్యాన్ని మాఫీ (కన్‌డోన్ డిలే) చే సిన సుప్రీంకోర్టు, ఈ కే సులో హెచ్‌ఎండీఏ వాదనలను వినేందుకు మరోసారి పూర్తిస్థాయిలో విచారణ జరిపి చట్టప్రకారంగా దీనిపై చర్యలు తీసుకోవాలని ఇన్‌కంట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ)ను ఆదేశిం చింది. ఈమేరకు సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ సోమవారం తుది తీర్పును వెలువరించింది.
హెచ్‌ఎండీఏ అనేది ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఏర్పాటు చేసిన సంస్థ అని, ఇది లాభాపేక్ష లేకుండా సేవలందిస్తుందనీ, దీనికి ఆదాయపు పన్ను వర్తించదని, ఐటీ చట్టంలోని 12-ఏ కింద ఐటీ మినహాయింపునకు తాము అర్హులమేన ని పేర్కొంటూ హెచ్‌ఎండీఏ ఆదాయపన్ను శాఖ కమిషనర్‌కు సెప్టెంబర్ 20, 2007లో దరఖాస్తు చేసుకొంది. దీన్ని ఆ శాఖ అప్పట్లో తిరస్కరించింది. దీనిగురించి పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన హెచ్‌ఎండీఏ అధికారులు అయిదున్నర ఏళ్ల తర్వాత ఐటీ నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ 2012 అక్టోబర్ 30న ఐటీ అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు దరఖాస్తు చేయగా వారి వాదన లు వినకుండానే ఐటీఏటీ ఈ కేసును కొట్టేసింది.
దీనిపై హెచ్‌ఎండీఏ హైకోర్టును ఆశ్రయించగా ఐటీఏటీ తీర్పునే సమర్థించింది. ఆదాయపు పన్ను శాఖ తమకు 12-ఏ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇవ్వట్లేదని పేర్కొంటూ హెచ్‌ఎండీఏ ఈ ఏడాది ఆగస్టు 24న సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్(ఎస్‌ఎల్‌పీ) దాఖలు చేసింది. దీనిని ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ తాజాగా సోమవారం మరోసారి విచారణ జరిపింది. బకాయిల చెల్లింపులో 2007 నుంచి ఇప్పటి వరకు జరిగిన జాప్యాన్ని మాఫీ చేసింది. మరోసారి హెచ్‌ఎండీఏ వాదనలను పూర్తిస్థాయిలో విని ఆ తరువాతనే చట్టపరంగా నిర్ణయం వెలువరించాలని ఐటీఏటీని ఆదేశిస్తూ డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది.