రూ.1,274 కోట్లపై చిగురించిన ఆశలు
► జప్తు చెల్లదని ఐటీ శాఖకు న్యాయనిపుణుల సూచన
►కంపెనీల చట్టమే కొండంత రక్ష
► పునరాలోచనలో ఐటీ శాఖ
►సొమ్ము వెనక్కి వస్తుందన్న ధీమాతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ (టీఎస్‌బీసీఎల్) నుంచి ఆదాయపు పన్ను శాఖ సీజ్ చేసిన రూ.1,274 కోట్లపై ఆశలు చిగురిస్తున్నాయి. జప్తు చేసిన విధానం చెల్లుబాటు కాదని ఢిల్లీలోని న్యాయ నిపుణులు, కన్సల్టెంట్లు ఐటీ శాఖకు స్పష్టమైన సంకేతాలు జారీ చేశారు. కంపెనీల చట్టం ఉల్లంఘించినట్లవుతుందని, కంపెనీల్లో అవినీతి జరిగిన సందర్భంలో తప్ప మిగతా సమయంలో యాజమాన్యాలకు చెందిన ఇతర ఆస్తుల జోలికి వెళ్లటం చట్టవ్యతిరేకమేనని తేల్చిచెప్పారు. దీంతో ఐటీ శాఖ పునరాలోచనలో పడింది. ఈ సమాచారం బయటకు పొక్కటంతో తెలంగాణ ఆర్థిక శాఖ ఊపిరి పీల్చుకుంది. ఒక్కసారిగా పెద్దమొత్తంలో సీజ్ చేసిన నిధులు తిరిగివస్తాయనే ధీమా వ్యక్తపరుస్తోంది. గత జూన్ 27న టీఎస్‌బీసీఎల్ బకాయిల కింద సర్కారు ఖాతా నుంచి రూ.1,274 కోట్లను ఐటీ శాఖ ఆర్‌బీఐ నుంచి నేరుగా సీజ్ చేసింది.
దీనిపై కేంద్రం నుంచి ఎలాంటి సాయం లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ విభజన పూర్తిగా జరగకుండానే తెలంగాణ కోటా నుంచి బకాయిలు వసూలు చేయటం సమ్మతం కాదని, అది కోర్టు ధిక్కారమవుతుందని పేర్కొంది. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టులో ఉంది. తాము నోటీసులు ఇచ్చినా స్పందించలేదని.. అందుకే నిధులను సీజ్ చేశామని ఐటీ శాఖ తెలిపింది. కానీ ప్రభుత్వ ఖాతాలోని నిధులను వినియోగించే హక్కు శాసనసభ ఆమోదం లేదా.. కోర్టు లు జారీ చేసే డిక్రీలకు మాత్రమే ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అందుకే ఐటీ శాఖ నోటీసులు కోర్టు డిక్రీలవుతాయా? లేదా? అనే ధర్మసందేహం వెలిబుచ్చుతున్నారు
హెచ్‌ఎండీఏ, కుడాకు నోటీసులు
పన్నుల వసూలులో ఐటీ శాఖ దూకుడు మాత్రం తగ్గించలేదు. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లపై ఓ కన్నేసి ఉంచింది. బేవరేజెస్ కార్పొరేషన్ తరహాలోనే (హెచ్‌ఎండీఏ), కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీకి(కుడా) నోటీసులు జారీ చేసింది. బకాయిలు చెల్లించాలని.. లేకుంటే ఆస్తులు జప్తు చేస్తామని పేర్కొంది. తెలంగాణ ఫుడ్స్ కూడా ఐటీ పన్నుల చిక్కుల్లో పడింది. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ ఫుడ్స్‌గా ఉన్నప్పుడు సెక్షన్ 10 కింద ఈ కార్పొరేషన్‌కు ఐటీ మినహాయింపు ఉంది. కానీ, ఇదో ఆర్థిక లావాదేవీల వ్యాపారంగా చూపించటంతో తెలంగాణ ఫుడ్స్‌కు ఐటీ విభాగం ఈ సెక్షన్ రిజిస్ట్రేషన్ రద్దు చేసినట్లు నోటీసులు జారీ చేసింది. దీంతో ఐటీ పన్నులు తప్పని పరిస్థితి తలెత్తింది.