సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఐటీ రిటర్నులు అదరగొడుతున్నాయి. ఆదాయపు పన్ను శాఖ వర్గాలు ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం.. గత నాలుగేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా పన్ను చెల్లింపుదారుల సంఖ్య (ఐటీ రిటర్నులు దాఖలు చేసేవారు)లో 25 శాతం వృద్ధి నమోదు అయ్యింది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం నుంచి ఐటీ రిటర్నులు దాఖలు చేసిన వారు 21,58,703 మంది కాగా, 2022–23లో ఈ సంఖ్య 26,92,185కు చేరింది.
అంటే నాలుగేళ్లలో 5.34 లక్షల మంది ఐటీ రిటర్నీలు పెరిగారన్న మాట. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పంజాబ్, హరియాణాలో 20 శాతానికి కొంచెం అటూ ఇటుగా పన్ను చెల్లింపుదారులు పెరిగారు. దేశంలోని అన్ని రాష్ట్రాల సగటు కలిపినా 15 శాతమే. కానీ మన రాష్ట్రంలో మాత్రం గత నాలుగేళ్లలో 25 శాతం పెరుగుదల చోటు చేసుకోవడం గమనార్హం. అయితే తెలంగాణ కంటే ఎక్కువమంది పన్ను చెల్లింపుదారులున్న రాష్ట్రాలు కూడా పదికి పైగానే ఉన్నాయి.
ఇందులో దక్షిణాదికి చెందిన కర్ణాటక, తమిళనాడు ఉన్నా..జనాభాతో పోలిస్తే అవి తెలంగాణ కంటే పెద్ద రాష్ట్రాలు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలను కలిపితే ఐటీ రిటర్నీల సంఖ్య దక్షిణాదిలోనే ఎక్కువగా 48.5 లక్షలు దాటడం గమనార్హం. కాగా దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా మహారాష్ట్రలో 1.13 కోట్ల మంది రిటర్నీలు ఉన్నారు. పన్ను చెల్లింపుదారులు కోటి దాటిన ఏకైక రాష్ట్రం కూడా ఇదే. ఆ తర్వాత గుజరాత్, యూపీ, రాజస్తాన్ రాష్ట్రాలున్నాయి.
దేశవ్యాప్తంగా 7,40,09,046 మంది రిటర్నీలు
దేశంలోనే రిటర్నీలు అతి తక్కువగా ఉన్న రాష్ట్రం మిజోరం. ఇక్కడ కేవలం 7,371 మంది మాత్రమే ఏటా ఐటీ రిటర్నులు దాఖలు చేస్తున్నారు. 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఇక్కడ 3,808 మంది మాత్రమే పన్నులు చెల్లిస్తుండగా, నాలుగేళ్లలో 3,500 మంది పెరిగారు. కేంద్ర పాలిత రాష్ట్రమైన లక్షద్వీప్‌లో గత నాలుగేళ్లతో పోల్చుకుంటే రిటర్నీల సంఖ్య స్వల్పంగా తగ్గింది.
2019–20లో 4,760 మంది రిటర్నులు దాఖలు చేయగా, 2022–23లో 4,454 మంది మాత్రమే తమ ఆదాయ వివరాలను సమర్పించారు. కనీసం లక్ష మంది కూడా రిటర్నులు దాఖలు చేయని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో త్రిపుర, సిక్కిం, నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్, డామన్ డయ్యూ, దాద్రా నాగర్‌హవేలి, అరుణాచల్‌ప్రదేశ్, అండమాన్ దీవులు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కలిపి ఐటీ రిటర్నులు దాఖలు చేసిన వారి సంఖ్య 2022–23లో 7,40,09,046గా నమోదయింది.
(నోట్: ఐటీ రిటర్నులు దాఖలు చేసిన వారందరూ పన్ను చెల్లింపుదారులు కాదు. ఇక చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే పన్ను చెల్లించని వారు కూడా రిటర్నులు దాఖలు చేస్తారు. మరోవైపు దాదాపుగా అదే సంఖ్యలో పన్ను చెల్లిస్తున్నా కొందరు రిటర్నులు దాఖలు చేయలేరు. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ ఇచ్చే రిటర్నీల వివరాలనే పన్ను చెల్లింపు దారుల వివరాలుగా పరిగణించవచ్చని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు)
Comments
Please login to add a commentAdd a comment