IT tax
-
ఐటీ రిటర్న్స్..తెలంగాణ అదుర్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఐటీ రిటర్నులు అదరగొడుతున్నాయి. ఆదాయపు పన్ను శాఖ వర్గాలు ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం.. గత నాలుగేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా పన్ను చెల్లింపుదారుల సంఖ్య (ఐటీ రిటర్నులు దాఖలు చేసేవారు)లో 25 శాతం వృద్ధి నమోదు అయ్యింది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం నుంచి ఐటీ రిటర్నులు దాఖలు చేసిన వారు 21,58,703 మంది కాగా, 2022–23లో ఈ సంఖ్య 26,92,185కు చేరింది. అంటే నాలుగేళ్లలో 5.34 లక్షల మంది ఐటీ రిటర్నీలు పెరిగారన్న మాట. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పంజాబ్, హరియాణాలో 20 శాతానికి కొంచెం అటూ ఇటుగా పన్ను చెల్లింపుదారులు పెరిగారు. దేశంలోని అన్ని రాష్ట్రాల సగటు కలిపినా 15 శాతమే. కానీ మన రాష్ట్రంలో మాత్రం గత నాలుగేళ్లలో 25 శాతం పెరుగుదల చోటు చేసుకోవడం గమనార్హం. అయితే తెలంగాణ కంటే ఎక్కువమంది పన్ను చెల్లింపుదారులున్న రాష్ట్రాలు కూడా పదికి పైగానే ఉన్నాయి. ఇందులో దక్షిణాదికి చెందిన కర్ణాటక, తమిళనాడు ఉన్నా..జనాభాతో పోలిస్తే అవి తెలంగాణ కంటే పెద్ద రాష్ట్రాలు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలను కలిపితే ఐటీ రిటర్నీల సంఖ్య దక్షిణాదిలోనే ఎక్కువగా 48.5 లక్షలు దాటడం గమనార్హం. కాగా దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా మహారాష్ట్రలో 1.13 కోట్ల మంది రిటర్నీలు ఉన్నారు. పన్ను చెల్లింపుదారులు కోటి దాటిన ఏకైక రాష్ట్రం కూడా ఇదే. ఆ తర్వాత గుజరాత్, యూపీ, రాజస్తాన్ రాష్ట్రాలున్నాయి. దేశవ్యాప్తంగా 7,40,09,046 మంది రిటర్నీలు దేశంలోనే రిటర్నీలు అతి తక్కువగా ఉన్న రాష్ట్రం మిజోరం. ఇక్కడ కేవలం 7,371 మంది మాత్రమే ఏటా ఐటీ రిటర్నులు దాఖలు చేస్తున్నారు. 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఇక్కడ 3,808 మంది మాత్రమే పన్నులు చెల్లిస్తుండగా, నాలుగేళ్లలో 3,500 మంది పెరిగారు. కేంద్ర పాలిత రాష్ట్రమైన లక్షద్వీప్‌లో గత నాలుగేళ్లతో పోల్చుకుంటే రిటర్నీల సంఖ్య స్వల్పంగా తగ్గింది. 2019–20లో 4,760 మంది రిటర్నులు దాఖలు చేయగా, 2022–23లో 4,454 మంది మాత్రమే తమ ఆదాయ వివరాలను సమర్పించారు. కనీసం లక్ష మంది కూడా రిటర్నులు దాఖలు చేయని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో త్రిపుర, సిక్కిం, నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్, డామన్ డయ్యూ, దాద్రా నాగర్‌హవేలి, అరుణాచల్‌ప్రదేశ్, అండమాన్ దీవులు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కలిపి ఐటీ రిటర్నులు దాఖలు చేసిన వారి సంఖ్య 2022–23లో 7,40,09,046గా నమోదయింది. (నోట్: ఐటీ రిటర్నులు దాఖలు చేసిన వారందరూ పన్ను చెల్లింపుదారులు కాదు. ఇక చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే పన్ను చెల్లించని వారు కూడా రిటర్నులు దాఖలు చేస్తారు. మరోవైపు దాదాపుగా అదే సంఖ్యలో పన్ను చెల్లిస్తున్నా కొందరు రిటర్నులు దాఖలు చేయలేరు. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ ఇచ్చే రిటర్నీల వివరాలనే పన్ను చెల్లింపు దారుల వివరాలుగా పరిగణించవచ్చని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు) -
బీబీసీకి ఆ స్వేచ్ఛ ఉంది! భారత్‌లో పరిణామాలపై బ్రిటన్ స్పందన
బీబీసీ భారత ప్రధాని నరేంద్ర మోదీపై తీసిన డాక్యుమెంటరీ పెనుదుమారమే రేపింది. తదనంతర నాటకీయ పరిణామాల నడుమ.. ఆ సంస్థ కార్యాలయాలపై ఐటీ పరిశీలనలు కొనసాగాయి. ఐటీ లెక్కల్లో అవకతవకలు ఉన్నట్లు గుర్తించింది భారత ఐటీ శాఖ. ఈ పరిణామంపై యూకే ప్రభుత్వం పార్లమెంట్లో స్పందించింది. పైగా బీబీసీ సంపాదకీయ స్వేచ్ఛను సమర్థించింది కూడా. ఈ మేరకు హౌస్ ఆఫ్ కామన్స్‌లో లేవనెత్తిన అత్యవసర ప్రశ్నకు విదేశాంగ కామన్వెల్త్ అభివృద్ధి కార్యాలయం(ఎఫ్సీడీఓ) జూనియర్ మంత్రి డేవిడ్ రూట్లీ స్పందిస్తూ మంగళవారం ఈ వ్యాఖ్యలు చేశారు. ఐటీ శాఖ చేసిన ఆరోపణల గురించి అక్కడి(భారత) ప్రభుత్వంపై వ్యాఖ్యనించలేమన్నారు. కానీ మీడియా స్వేచ్ఛ, వాక్ స్వాంతంత్య్రం గురించి నొక్కి చెప్పారు. పైగా బలమైన ప్రజాస్వామ్యానికి అవే ముఖ్యమైన అంశాలన్నారు. అంతేగాదు భారతదేశంతో ఉన్న విస్తృతమైన లోతైన సంబంధాల గురించి ప్రస్తావించారు. అలాగే భారత ప్రభుత్వంతో అనేక సమస్యలను నిర్మాణత్మాకమైన పద్ధతిలో చర్చించేందుకు యూకేకు వీలు కల్సిస్తుందని నమ్మకంగా చెప్పారు. అంతేగాదు తాము బీబీసీ కోసం నిలబడతాం, నిధులు సమకూరుస్తాం అని రూట్లీ కుండబద్ధలు కొట్టారు. బీబీసీ వరల్డ్ సర్వీస్ అత్యంత ముఖ్యమైనదని భావిస్తున్నామని తేల్చి చెప్పారు. అందుకే బీబీసీకి సంపాదకీయ స్వేచ్ఛ ఉండాలని కోరుకుంటున్నామని రూట్లీ ధృఢంగా చెప్పారు. బీబీసీ మా ప్రభుత్వాన్ని, ప్రతిపక్ష లేబర్ పార్టీని కూడా విమర్శిస్తుంది, దానికి ఆ స్వేచ్ఛ ఉందన్నారు. ఆ స్వేచ్ఛ చాల కీలకమైనదని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన స్నేహితులకు అంటే భారతదేశంలోని ప్రభుత్వంతో సహా దీని ప్రాముఖ్యతను తెలియజేయగలగాలన్నారు. నాలుగు భారతీయ భాషలతో సహా.. బీబీసీ సంపాదకీయంగా స్వతంత్రంగా ఉంటుందని నొక్కి చ్పెప్పారు. ఈ పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ ముఖ్యమైన పాత్ర పోషించడమే గాక నాలుగు భారతీయ భాషలతో సహా మొత్తం 12 భాషల్లో సేవలందిస్తుందన్నారు.ఎందుకంటే ఇది మన స్వరం మాత్రమే గాదు బీబీసీ ద్వారా మన స్వతంత్ర స్వరాన్ని ప్రపంచవ్యాప్తంగా వినిపించేలా చూసుకోవడం అతి ముఖ్యమని చెప్పారు. ఇదిలా ఉండగా, ఉత్తర ఐర్లాండ్ ఎంపీ జిమ్ షానన్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో ఈ అత్యవసర ప్రశ్నను లేవనెత్తారు. ఆయన ఈ చర్యను దేశ నాయకుడి గురించి పొగడ్త లేని డాక్యుమెంటరీ విడుదల చేయడంతో ఉద్దేశపూర్వకంగా సాగిన బెదిరింపు చర్యగా ఆరోపణలు చేశారు. ఈ సమస్యపై స్పందించడంలో విఫలమైనందుకు యూకే ప్రభుత్వాన్ని కూడా విమర్శించారు. అంతేకాదు బ్రిటన్ పార్లమెంట్లో ప్రతిపక్ష ఎంపీలు ఈ విషయంపై భారత ప్రభుత్వంతో చర్చలు గురించి ప్రస్తావించారు కూడా. ఈ విషయంలో విదేశీ కామన్వెల్త్ అభివృద్ధి కార్యాలయం కూడా నిశబ్దంగా ఉందని అందువల్లే దీన్ని ఖండించేలా ప్రభుత్వాన్ని పోత్సహించడానికీ ఈ ప్రశ్నను తాను లేవనెత్తినట్లు డెమోక్రటిక్ యూనియనిస్ట్ పార్టీ(డీయూపీ) పార్లమెంటు సభ్యుడు షానన్ అన్నారు. దీన్ని ఆయన పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడిగా పేర్కొన్నారు. ఐతే ఇది సంభాషణలో భాగంగా లేవనెత్తిన ప్రశ్న అని, అయినా తాము ఈ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని మంత్రి రూట్లీ తెలిపారు. మరోవైపు బ్రిటీష్ సిక్కు లేబర్ పార్టీ ఎంపీ తన్మన్జీత్ సింగ్ ధేసీ కూడా ఈ విషయంపై తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశారు. బీబీసీ దర్యాప్తుపై ఎంక్వైయిరీ భారతదేశంలోని అధికారులు ప్రభుత్వాన్ని విమర్శించే మీడియా సంస్థలపై దాడులు చేపట్టడం ఇదేమి మొదటిసారి కాదని లేబర్‌పార్టీ ఎంపీలు విమర్శలు ఎక్కుపెట్టారు. అంతేగాదు భారత ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్, భారత్‌లోని ఐటీ అధికారులు ఏడేళ్లుగా బీబీసీని దర్యాప్తు చేస్తున్నారో లేదో నిర్ధారించాలని మంత్రిని రూట్లీని కోరారు. దీనిపై వ్యాఖ్యానించేందుకు మంత్రి నిరాకరించారు. కాగా, ఫిబ్రవరి 14న ముంబై, ఢిల్లీలోని బీబీసీ కార్యాలయాలపై ఐటీ దాడులు నిర్వహించింది. ఆ తర్వాత మూడు రోజుల తర్వాత ఇది రైడ్ కాదు సర్వేగా ఐటీ శాఖ పేర్కొంది. అంతేగాదు సర్వే తదనంతరం బీబీసీ లావాదేవీలు భారత్ కార్యకలాపాల స్థాయికి అనుగుణంగా లేవని ఐటీ శాఖ ఒక ప్రకటనలో తెలపడం గమనార్హం. -
పన్ను వ్యవస్థలో సమూల మార్పులకు టాస్క్‌ఫోర్స్
సాక్షి,న్యూఢిల్లీ: దేశంలో మారుతున్న ఆర్థిక అవసరాలకు అనుగుణంగా 50 ఏళ్ల కిందటి ఆదాయ పన్ను చట్టాన్ని మార్చేందుకు ప్రభుత్వం బుధవారం టాస్క్‌ఫోర్స్‌ను నియమించింది.ఆరుగురు సభ్యులుండే ఈ టాస్క్‌ఫోర్స్‌లో సీబీడీటీ సభ్యులు అరవింద్ మోదీ కన్వీనర్‌గా ఉంటారు. చార్టెడ్ అకౌంటెంట్ గిరీష్ అహుజా, యర్నెస్ట్ అండ్ యంగ్ ఛైర్మన్, రీజినల్ మేనేజర్ రాజీవ్ మెమాని, ఐసీఆర్ఐఈఆర్ కన్సల్టెంట్ మన్సి కేడియా సభ్యులుగా ఉంటారు. ఐదు దశాబ్థాలకు పైబడిన ఆదాయ పను చట్టాన్ని రీడ్రాఫ్ట్ చేయాల్సిన అవసరం ఉందని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన ట్యాక్స్ అధికారుల వార్షిక సదస్సులో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆదాయ పన్ను చట్టం, 1961ని సమీక్షించి, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మార్పుచేర్పులు చేసేందుకు ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్‌ను నియమించిందని ఆర్థిక శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. టాస్క్‌ఫోర్స్ ఆరు నెలల్లోగా ప్రభుత్వానికి తన నివేదిక సమర్పిస్తుంది. టాస్క్‌ఫోర్స్‌లో ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు. -
మీ ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతున్నారా..?
ముంబై: మీరు తరచుగా ఫారెన్ టూర్ లకు వెళ్తుంటారా? అక్కడి టూరిస్ట్ స్పాట్ లలో దిగిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా స్నేహితులకు తెలియజేస్తుంటారా? అయితే, ఇక నుంచి మీ ట్రిప్పులకు సంబంధించిన ఫోటోలను పోస్టు చేయడంలో జాగ్రత్త వహించండి. ఇన్ కం ట్యాక్స్ అధికారులు ఎక్కవగా విదేశాలకు వెళ్లే వారి పన్ను చెల్లింపులపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. విదేశాలకు వెళ్లే వారి ట్యాక్స్ చెల్లింపుల వివరాల కోసం వారి సోషల్ మీడియా అకౌంట్లను కూడా ఐటీ శాఖ తనిఖీ చేయాలనే ఆలోచనలో ఉంది. అయితే, ఈ విషయం పై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్(సీబీడీటీ)దే తుది నిర్ణయం కానుంది. ఈ అంశం స్పందించిన ఆదాయపు పన్నుశాఖ అధికారి ఒకరు సోషల్ మీడియాను ఉపయోగించుకోవడం కొన్ని సందర్భాలలో సమాచారాన్ని సేకరించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. ఇది పన్ను చెల్లింపుదారుడిని వేధించడం కాదనీ.. దీని ముఖ్య ఉద్దేశం వ్యక్తి సంపదను తెలుసుకోవడానికేనని చెప్పారు.