టీఎస్‌బీసీఎల్‌ను ఉంచాలా? మూయాలా? | is TSBCL being closed ? | Sakshi
Sakshi News home page

టీఎస్‌బీసీఎల్‌ను ఉంచాలా? మూయాలా?

Published Thu, May 14 2015 1:37 AM | Last Updated on Thu, Sep 27 2018 4:47 PM

is TSBCL being closed ?

సాక్షి, హైదరాబాద్: ఆదాయపు పన్ను బకాయిల నుంచి సాంకేతిక కారణాలతో బయటపడ్డ తెలంగాణ ఎక్సైజ్ శాఖ భవిష్యత్తులో ఐటీ తలనొప్పి లేని మార్గాలను అన్వేషిస్తోంది. కంపెనీల చట్టం ప్రకారం వ్యాపారం ద్వారా ఆదాయం పొందే ఏ సంస్థ అయినా పన్ను చెల్లించాలన్న నిబంధన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర బేవరేజేస్ కార్పొరేషన్ (టీఎస్‌బీసీఎల్)ను మూసేస్తే ఎలా ఉంటుందన్న అంశాన్ని పరిశీలి స్తోంది. మద్యం విక్రయాలపై వచ్చిన ఆదాయం ఆధారంగా టీఎస్‌బీసీఎల్ పన్ను చెల్లించాలని గత కొన్నేళ్లుగా ఉమ్మడి రాష్ట్రంలోని ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్‌కు ఐటీ శాఖ నోటీసులు జారీ చేస్తోంది. కోర్టుల ద్వారా తాత్కాలిక ఉపశమనం పొందుతూ ఏపీబీసీఎల్ నెట్టుకొస్తోంది.
 
 ఈ నేపథ్యంలో మార్చి 28న 2012-13కు బకాయిలు రూ.1,468 కోట్లు చెల్లించాలని నోటీసులు జారీ చేస్తూ 3 జిల్లాల్లో మద్యం డిపోలను ఐటీ శాఖ సీజ్ చేసింది. దీంతో కోర్టును ఆశ్రయించిన టీ సర్కార్ ఉపశమనం పొందింది. అదే సమయంలో ఏపీ సర్కార్ మాత్రం ఆ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్‌ను పూర్తిగా మూసేసి ఎక్సైజ్ శాఖ ద్వారానే మద్యం అమ్మకాలు, డిపోల నిర్వహణ పర్యవేక్షిస్తోంది. తద్వారా పాత బకాయిలు ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించినవని వాటిని ఎగ్గొట్టే ఎత్తుగడ వేయడంతో పాటు భవిష్యత్తులో మద్యం అమ్మకాలపై ఐటీ మినహాయింపు పొందాలని భావిస్తోంది. దీంతో తెలంగాణలో టీఎస్‌బీసీఎల్‌పై యంత్రాంగం తర్జన భర్జన పడుతోంది.
 
 ఎక్సైజ్ శాఖ విక్రయాలపై పన్ను భారం ఉండదా?
 ఏపీ తరహాలో తెలంగాణలో కూడా బేవరేజెస్ కార్పొరేషన్‌ను రద్దు చేయాలని భావించినా, టీఎస్‌బీసీఎల్ ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. 10 జిల్లాల్లో కార్పొరేషన్ కింద 143 మంది ఉద్యోగులు, 200 మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు గౌడ్‌ను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. కార్పొరేషన్‌తో సంబంధం లేకుండా తమిళనాడు, కేరళ, కర్ణాటక, రాజస్తాన్‌లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే మద్యం విక్రయాలు జరుపుతున్నా ఐటీ శాఖ పన్ను నోటీసులు జారీ చేస్తూనే ఉందని తెలిపారు. ఎక్సైజ్ శాఖ ద్వారా విక్రయించినా పన్ను చెల్లించాల్సిందేనని పేర్కొన్నారు. దీంతో మంత్రి పద్మారావు కమిషనర్‌ను నివేదిక కోరగా, ఐటీ చట్టంలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన మినహాయింపులు, కంపెనీల చట్టంలో ఉన్న నిబంధనలతో ఓ నివేదిక రూపొందించినట్లు సమాచారం.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement