టీఎస్‌బీసీఎల్‌కు మంగళం!
ఏపీ తరహాలో ఎక్సైజ్ శాఖ ద్వారానే మద్యం అమ్మకాలు
ఆదాయపు పన్ను శాఖకు చెల్లింపుల నుంచి తప్పించుకునే ఉపాయం
సాక్షి, హైదరాబాద్: ఆదాయపు పన్ను శాఖ దెబ్బకు విలవిల్లాడిన రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ శాఖకు అనుబంధంగా హోల్‌సేల్ మద్యం విక్రయాలు సాగించే తెలంగాణ బ్రూవరేజెస్ కార్పొరేషన్(టీఎస్‌బీసీఎల్)ను రద్దుచేయాలని యోచిస్తోంది. ప్రభుత్వ సంస్థగానే టీఎస్‌బీసీఎల్ కొనసాగుతున్నా, కేంద్ర ఆధీనంలోని ఆదాయపు పన్ను శాఖ మాత్రం దాన్ని ప్రైవేటు సంస్థల తరహాలోనే చూస్తూ కార్పొరేషన్ చట్టం కింద పన్ను వసూళ్ల కోసం ఒత్తిడి చేస్తోంది. దీనిలో భాగంగా ఈనెల 2 నుంచి 4 వరకు బకాయిల వసూళ్ల పేరుతో హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని 8 డిపోలకు ఇన్‌కం అటాచ్‌మెంటు నోటీసులు జారీచేసి మూసివేయించింది. 4న కోర్టు ను ఆశ్రయించి డిపోలను తెరిపించినా, కోర్టు తుది ఉత్తర్వులు వచ్చేలోపే టీఎస్‌బీసీఎల్‌ను రద్దు చేసి ఎక్సైజ్‌శాఖ ద్వారా మద్యం విక్రయాలు సాగించేలా ఉత్తర్వులు విడుదల కు రెడీ అవుతోంది.
కాగా తెలంగాణ ప్రభుత్వం కన్నా ముందే స్పందించిన ఏపీ అక్కడి మద్యం డిపోల బాధ్యతలన్నీ ఎక్సైజ్‌శాఖకు బదిలీ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ బాటలోనే తెలంగాణ కూడా డిపోల బాధ్యతలన్నీ ఎక్సైజ్ శాఖకు బదిలీ చేయాలని నిర్ణయించినట్లు సమా చారం. మద్యం డిపోల బాధ్యతలను ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్‌లకు బదిలీ చేసి, ప్రస్తుతం టీఎస్‌బీసీఎల్ అధికారులు, ఉద్యోగులను కాంట్రాక్టు పద్ధతికి మార్చడమో, లేక వేరే కార్పొరేషన్‌కు బదిలీ చేసి అక్కడి నుంచి డిప్యుటేషన్ మీద ఎక్సైజ్‌శాఖకు తీసుకోవడమో చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఉద్యోగుల జీతభత్యాల్లో మార్పు రాకుండా ఈ బదిలీ ప్రక్రియ సాగించాలని నిర్ణయించినట్లు తెలిసింది. 3 రోజుల్లో దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడే అవకాశముందని ఎక్సైజ్ అధికారి ఒకరు తెలిపారు. ప్రభుత్వం ద్వారా విక్రయాలు జరిగితే పన్ను చెల్లించాల్సిన అవసరం లేనందున ఈ దిశగా ప్రభుత్వం వేగంగా కదులుతోంది.