సర్కారు మద్యం వ్యాపారం!
టీఎస్‌బీసీఎల్ ద్వారా లిక్కర్ షాపుల నిర్వహణకు ప్రణాళికలు
* పెరిగిన లెసైన్సు ఫీజుతో మద్యం వ్యాపారులు వెనకడగు వేస్తుండటం వల్లే..
* జీహెచ్‌ఎంసీ, వరంగల్, కరీంనగర్‌లలో ఎ-4 షాపుల ఫీజు అధికం
* నేటి నుంచి మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: మద్యం వ్యాపారాన్ని సొంతంగా నిర్వహించేందుకు ఎక్సైజ్‌శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
రెండేళ్ల కాలానికి మద్యం దుకాణాలకు అనుమతిస్తూ లెసైన్సు ఫీజును 20 శాతం పెంచిన నేపథ్యంలో వ్యాపారులు నిర్వహణకు ముందుకు రానిచోట బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా వ్యాపారం చేయాలని భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో 10 శాతం మద్యం దుకాణాలను అక్కడి ఎక్సైజ్‌శాఖ ఇప్పటికే నిర్వహిస్తున్న నేపథ్యంలో అవసరమైతే అదే ప్రయోగాన్ని రాష్ట్రంలో చేపట్టాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది.
ఈ మేరకు తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నూతన మద్యం పాలసీకి సంబంధించిన విధివిధానాలు విడుదల చేసినప్పుడే ఎవరూ దుకాణాలు తీసుకునేందుకు ముందుకు రాని చోట టీఎస్‌బీసీఎల్ పేరుతో ఎ-4 షాపులు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఎక్సైజ్ కమిషనర్ ఆర్.వి. చంద్రవదన్ కూడా ధ్రువీకరించారు.
జీహెచ్‌ఎంసీ, వరంగల్, కరీంనగర్‌లలో భారీగా పెరిగిన ఫీజు
రాష్ట్రంలో 2,216 మద్యం దుకాణాలు ఉండగా ప్రభుత్వం వాటిని జనాభా ప్రాతిపదికన విభజించి ప్రస్తుతమున్న లెసైన్సు ఫీజులను 20 శాతం పెంచుతూ ఖరారు చేసింది. ఈ మొత్తాన్ని వ్యాపారులు ఆరు వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. 10 వేల లోపు జనాభా గల 679 దుకాణాలకు సంవత్సరానికి రూ. 39 లక్షల చొప్పున రెండేళ్లకు రూ. 78 లక్షలు చెల్లించాలి. అలాగే 10వేల నుంచి 50 వేల జనాభా ఉన్న 576 దుకాణాలలో ఒక్కో దానికి రూ. 81.60 లక్షలు, 50 వేల నుంచి 3 లక్షలలోపు జనాభాగల 396 దుకాణాలకు రూ. కోటీ ఎనభై వేల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
ఇవన్నీ ఒకెత్తయితే కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 22 దుకాణాలకు ఫీజు రెండేళ్లకు ఏకంగా రూ. 20 లక్షల చొప్పున పెరగగా, కొత్తగా గ్రేటర్ కార్పొరేషన్ అయిన వరంగల్ పరిధిలోని 40 దుకాణాలకు లెసైన్సు ఫీజును 1.63 కోట్లుగా నిర్ణయించారు. వరంగల్ గ్రేటర్ కార్పొరేషన్ కావడంతో గ్రామీణ పరిధిలోని మరో 3 దుకాణాలు కూడా ఇప్పుడు కార్పొరేషన్ పరిధికి చేరాయి. ఇక జీహెచ్‌ఎంసీలో రూ. 90 లక్షలు ఉన్న లెసైన్సు ఫీజును రెండేళ్లకు రూ. 2.16 కోట్లకు పెంచడం వ్యాపారులకు అశనిపాతం అయింది.
నేటి నుంచి దరఖాస్తులు
అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానున్న రెండేళ్ల మద్యం పాలసీకి సంబంధించి సోమవారం నుంచి దరఖాస్తులను ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచుతారు. రూ. 50 వేలు చెల్లించి దరఖాస్తులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 21వ తేదీ లోపు దరఖాస్తులను అందజేయాలి. 23న జిల్లా కలెక్టర్ల సమక్షంలో డ్రా తీస్తారు.
రాష్ట్రవ్యాప్తంగా మిగిలిపోనున్న షాపులు
జీహెచ్‌ఎంసీ పరిధిలో 503 మద్యం దుకాణాలు ఉండగా వీటికి 2014-15 సంవత్సరంలో లెసైన్సు ఫీజును రూ. 90 లక్షలుగా నిర్ణయించి దరఖాస్తులు కోరితే 103 దుకాణాలను ఎవరూ తీసుకోలేదు. రంగారెడ్డి జిల్లాలోని అర్బన్ ప్రాంతంతోపాటు మెదక్ జిల్లా పటాన్‌చెరు, రామచంద్రాపురం జీహెచ్‌ఎంసీ పరిధిలోకి రాగా, గ్రేటర్ సరిహద్దు గీతకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలు, మండల కేంద్రాలను కూడా గ్రేటర్ పరిధిలోకి తేవడమే ఇందుకు కారణం.
మెదక్ జిల్లా పరిధిలోని పటాన్‌చెరు, రామచంద్రాపురం ప్రాంతాల్లోని 15 దుకాణాల్లో ఒక్క దుకాణాన్ని కూడా ఎవరూ తీసుకోలేదు. అలాగే హైదరాబాద్ సిటీ, రంగారెడ్డిలో కూడా అదే పరిస్థితి. వరంగల్ గ్రేటర్ కార్పొరేషన్ అయ్యాక జూలై నుంచి సెప్టెంబర్ వరకు లెసైన్సులను రెన్యూవల్ చేయించుకోవాలని ప్రభుత్వం కోరగా 8 షాపుల వ్యాపారులు వెనకడుగు వేశారు.
అలా రాష్ట్రంలో మరో 50 దుకాణాలను మూన్నెళ్ల కాలానికి ఎవరూ తీసుకోలేదు. ఈ పరిస్థితుల్లో 20 శాతం లెసైన్సు ఫీజు పెంచుతూ తీసుకున్న నిర్ణయం వల్ల హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో కూడా భారీగా దుకాణాలు మిగిలిపోయే అవకాశం ఉందని ఎక్సైజ్ అధికారులు కూడా ఒప్పుకుంటున్నారు.