License fees
-
వాట్సాప్ గ్రూప్‌లకు లైసెన్స్.. ఫీజు కూడా!
అక్కడ వాట్సాప్ గ్రూప్‌ను నిర్వహించడమంటే ఆషామాషీ కాదు. గ్రూప్ అడ్మిన్‌కు లైసెన్స్ ఉండాలి. ఇందుకోసం ఫీజు కూడా చెల్లించాలి. ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారా? పూర్తి వివరాల కోసం ఈ కథనంలో చదివేయండి..వాట్సాప్ గ్రూప్ నిర్వహణకు సంబంధించి జింబాబ్వే ప్రభుత్వం కొత్త నిబంధనను అమలు చేసింది. దీని ప్రకారం ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌లందరూ జింబాబ్వే పోస్ట్ అండ్ టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (POTRAZ)లో నమోదు చేసుకోవాలి. వారి గ్రూప్ నిర్వహణకు లైసెన్స్ పొందాలి. ఈ లైసెన్స్ కోసం ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇందు కోసం కనీసం 50 డాలర్లు (సుమారు రూ.4,200) ఖర్చవుతుంది. ఈ విషయాన్ని జింబాబ్వే సమాచార, కమ్యూనికేషన్ టెక్నాలజీ, పోస్టల్ అండ్ కొరియర్ సర్వీసెస్ (ICTPCS) మంత్రి తటెండా మావెటెరా ప్రకటించారు.కొత్త రూల్ ఎందుకంటే..తప్పుడు వార్తలు వ్యాప్తి చెందకుండా, దేశంలో శాంతి నెలకొనేందుకు ఆ దేశ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఈ కొత్త వాట్సాప్ నిబంధనను రూపొందించారు. ఈ చట్టం ప్రకారం, ఒక వ్యక్తిని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా గుర్తించడానికి ఉపయోగించే ఏదైనా సమాచారాన్ని వ్యక్తిగత సమాచారంగా పరిగణిస్తారు. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ల వద్ద సభ్యుల ఫోన్ నంబర్లు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం ప్రకారం, వారు డేటా ప్రొటెక్షన్ యాక్ట్ పరిధిలోకి వస్తారు.ఇదీ చదవండి: డిసెంబర్ 14 డెడ్‌లైన్.. ఆ తర్వాత ఆధార్ కార్డులు రద్దు! -
కేంద్రానికి రూ. 2,400 కోట్లు చెల్లించనున్న వొడా ఐడియా
న్యూఢిల్లీ: రుణ భారంతో కొట్టుమిట్టాడుతున్న టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా .. లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రమ్ వినియోగ చార్జీల కింద సెప్టెంబర్ కల్లా కేంద్రానికి రూ. 2,400 కోట్ల మొత్తాన్ని చెల్లించే యోచనలో ఉంది. గతేడాది వేలంలో కొనుగోలు చేసిన స్పెక్ట్రమ్‌నకు సంబంధించి కంపెనీ .. జూలై నాటికి లైసెన్సు ఫీజు కింద రూ. 770 కోట్లు, స్పెక్ట్రమ్ వినియోగ చార్జీల కింద రూ. 1,680 కోట్లు కట్టాల్సి ఉంది. అయితే, ఆ మొత్తాన్ని చెల్లించేందుకు వొడాఫోన్ ఐడియా 30 రోజుల వ్యవధి కోరింది. ఈ నేపథ్యంలో సకాలంలో కట్టకపోవడం వల్ల 15 శాతం వడ్డీ రేటుతో బాకీ మొత్తాన్ని కంపెనీ చెల్లించాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
మద్యం వినియోగాన్ని నిరుత్సాహ పరిచేందుకే..
సాక్షి, విజయవాడ: మద్యం వినియోగాన్ని నిరుత్సాహ పరిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా బార్ లైసెన్సులను పెంచుతున్నట్లు ప్రకటించింది. కాగా బార్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ చార్జీలను 10 శాతం పెంచుతూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు బార్ల లైసెన్స్ పై 20 శాతం కోవిడ్ ఫీజులను వసూలు చేయాలని నిర్ణయించింది. దేశంలో తయారైన విదేశీ మద్యం, బీర్లు, రెడీ టు డ్రింక్ మద్యంపైనా 10 శాతం ఏఈఆర్టీ విధిస్తూ నోటిఫికేషన్ విడుదల చేస్తు, 2021 జూన్ 30 వరకు బార్లను కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. -
జియోపై మీ వైఖరి చెప్పండి
న్యూఢిల్లీ: టెలికం కంపెనీలు ప్రభుత్వానికి కట్టాల్సిన లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల బాకీల వివాదం కేసు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది. వివరాల్లోకి వెడితే.. దివాలా తీసిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) కట్టాల్సిన బాకీలను ఆ కంపెనీ స్పెక్ట్రంను వాడుకుంటున్నందున రిలయన్స్ జియో సంస్థ కట్టాలని సుప్రీంకోర్టు పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే, ఆర్‌కామ్ దివాలా ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో జియోకు స్పెక్ట్రం విక్రయ అంశంపై కేంద్ర టెలికం శాఖ (డాట్), ఇటు కార్పొరేట్ వ్యవహారాల శాఖ (ఎంసీఏ) మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. దివాలా ప్రక్రియ జరుగుతుండగా స్పెక్ట్రంను విక్రయించడానికి లేదన్నది డాట్ భావన కాగా, గరిష్ట విలువను రాబట్టేందుకు విక్రయమే సరైన మార్గమని ఎంసీఏ భావిస్తోందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సోమవారం సుప్రీం కోర్టులో జరిగిన వాదనల సందర్భంగా తెలిపారు. దీనికి సంబంధించి అత్యున్నత న్యాయస్థానం ఏ ఉత్తర్వులు ఇచ్చినా సమ్మతమేనని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆర్‌కామ్ కట్టాల్సిన బాకీలను జియో చెల్లించే అంశంపై అసలు కేంద్రం వైఖరి ఏమిటన్నది తెలియజేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే ఏయేడాదికాయేడు ఆర్‌కామ్ కట్టాల్సిన బాకీల వివరాలను సమర్పించాలంటూ డాట్‌కు సూచించింది. తదుపరి విచారణను ఆగస్టు 18కి వాయిదా వేసింది. -
మూడు నెలల్లో బాకీలు కట్టేయాల్సిందే
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం మూడు నెలల్లోగా లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీలు తదితర బాకీలన్నీ కట్టేయాలంటూ టెల్కోలకు టెలికం శాఖ(డాట్) ఆదేశాలు జారీ చేసింది. స్వయం మదింపు ప్రాతిపదికన బకాయిలను తీర్చవచ్చంటూ నోటీసుల్లో పేర్కొన్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. లైసెన్సు ఫీజు మొదలైన వాటికి ప్రాతిపదిక అయిన ఏజీఆర్‌ను (సవరించిన స్థూల ఆదాయం) లెక్కించే ఫార్ములా విషయంలో.. ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు అక్టోబర్ 24న తీర్పు ఇవ్వడం తెలిసిందే. దీని ప్రకారం 3 నెలల్లోగా వడ్డీ సహా బాకీలు చెల్లించాలంటూ టెల్కోలను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. డాట్ అంతర్గతంగా వేసిన లెక్కల ప్రకారం టెల్కోల నుంచి రూ. 1.33 లక్షల కోట్ల దాకా వసూలు కావాల్సి ఉంది. ఎయిర్టెల్ అత్యధికంగా రూ. 62,188 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ. 54,184 కోట్లు, బీఎస్ఎన్ఎల్.. ఎంటీఎన్ఎల్ రూ. 10,675 కోట్లు బాకీ పడ్డాయి. ఇప్పటికే ఆర్థికంగా తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న టెలికం పరిశ్రమ.. ఈ బాకీల చెల్లింపులతో మరింత సంక్షోభంలోకి జారిపోతుందని టెల్కోలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
మొత్తం బాకీలన్నీ మాఫీ చేయండి
న్యూఢిల్లీ: లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల బకాయిలపై టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ తాజాగా మరోసారి కేంద్రానికి లేఖ రాసింది. టెలికం రంగం తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో ఎయిర్టెల్, వొడాఫోన్–ఐడియాలతో పాటు మిగతా టెల్కోల మొత్తం పాత బకాయిలు (సుమారు రూ. 1.42 లక్షల కోట్లు) మాఫీ చేసేయాలని కోరింది. అలా కుదరకపోతే కనీసం వడ్డీలు, పెనాల్టీలు రద్దు చేయాలని విజ్ఞప్తి చేసింది. గతంలో రాసిన లేఖకు అనుబంధంగా కేంద్ర టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్‌కు సీవోఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ అక్టోబర్ 31న తాజా లేఖ రాశారు. కేంద్రం చెబుతున్నట్లుగా ఏజీఆర్ (సవరించిన స్థూల ఆదాయం) ఫార్ములాకు తగ్గట్లు పాత బకాయిలన్నింటిని లెక్కగట్టి, కేంద్రానికి చెల్లించాల్సిందేనంటూ సుప్రీం కోర్టు అక్టోబర్ 24న టెల్కోలను ఆదేశించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం భారతి ఎయిర్టెల్ ఏకంగా రూ. 42,000 కోట్లు, వొడాఫోన్ ఐడియా సుమారు రూ. 40,000 కోట్లు పైగా కట్టాల్సి రావొచ్చని అంచనా. రింగ్ వ్యవధి 30 సెకన్లు.. టెలిఫోన్ రింగ్ అయ్యే వ్యవధిని నిర్దేశిస్తూ టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ నిర్ణయం తీసుకుంది. మొబైల్ ఫోన్లకైతే ఇది 30 సెకన్లుగాను, ల్యాండ్‌లైన్ ఫోన్లకు∙60 సెకన్లుగాను నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత నిబంధనలకు సవరణ చేసింది. -
ఆ టెల్కోలకు ప్యాకేజీలు అక్కర్లేదు
న్యూఢిల్లీ: కేంద్రానికి భారీ స్థాయిలో లైసెన్సు ఫీజులు బాకీలు కట్టాల్సి రానున్న పాత తరం టెల్కోలు .. ప్రభుత్వాన్ని బెయిలవుట్ ప్యాకేజీ కోరుతుండటంపై రిలయన్స్ జియో మండిపడింది. ఆ రెండు సంస్థలు (ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా) ఆర్థికంగా పటిష్టంగానే ఉన్నాయని, ప్రజల సొమ్ముతో వాటికి ప్యాకేజీలేమీ ఇవ్వాల్సిన అవసరమేమీ లేదని వ్యాఖ్యానించింది. సుప్రీం కోర్టు తీర్పునకు అనుగుణంగా మూడు నెలల్లోగా బాకీలు కట్టేలా వాటిని ఆదేశించాలంటూ కేంద్రాన్ని కోరింది. టెలికం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్‌కు జియో ఈ మేరకు లేఖ రాసింది. ఒకవేళ ఆ రెండు సంస్థలకు ఏం జరిగినా(మూతబడినా).. ప్రభుత్వ రంగ టెల్కోలు కూడా కార్యకలాపాలు సాగిస్తున్నందున టెలికం రంగానికి నష్టమేమీ లేదని పేర్కొంది. సీవోఏఐ బ్లాక్మెయిల్... ‘రెండు సంస్థల స్వార్థ ప్రయోజనాల కోసం వాటి తరఫున వకాల్తా పుచ్చుకుని సీవోఏఐ కేంద్రానికి లేఖ రాసింది’ అని ఆక్షేపించింది. జియోపై సీవోఏఐ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించింది. ‘ఉద్యోగాలు పోతాయని, సేవల నాణ్యత తగ్గిపోతుందని, టెలికం రంగంలో పెట్టుబడులు ఆగిపోతాయని ప్రభుత్వానికి పంపిన లేఖలో సీవోఏఐ బెదిరింపు, బ్లాక్‌మెయిలింగ్ ధోరణి కనిపిస్తోంది. బాకీలు డిపాజిట్ చేయాలంటూ సుప్రీం కోర్టు మూడు నెలలు గడువిస్తే.. ఇలాంటివన్నీ చేయడం కోర్టు ధిక్కారానికి పాల్పడటమే అవుతుంది’ అని జియో పేర్కొంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ‘సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్)’ లెక్కల్ని బట్టి ప్రభుత్వానికి టెలికం సంస్థలు లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల కింద దాదాపు రూ. 1.4 లక్షల కోట్లు కట్టాల్సి రావొచ్చని అంచనా. పాత తరం టెల్కోలైన భారతి ఎయిర్టెల్ అత్యధికంగా రూ. 42,000 కోట్లు, వొడాఫోన్ ఐడియా సుమారు రూ. 40,000 కోట్లు, రిలయన్స్ జియో స్వల్పంగా రూ. 14 కోట్లు కట్టాల్సి రానుంది. భారత మార్కెట్ నుంచి తప్పుకోవడం లేదు: వొడాఫోన్ భారీ చెల్లింపులు జరపాల్సిన నేపథ్యంలో భారత మార్కెట్ నుంచి తప్పుకోబోతోందంటూ వచ్చిన వార్తలను బ్రిటన్ టెలికం దిగ్గజం వొడాఫోన్ కొట్టిపారేసింది. ఇవన్నీ నిరాధార వదంతులేనని పేర్కొంది. అలాంటి యోచనేదీ తమకు లేదని, స్థానిక మేనేజ్మెంట్కు పూర్తి మద్దతు ఇస్తామని వొడాఫోన్ తెలిపింది. ఇప్పుడున్న గడ్డుకాలం నుంచి గట్టెక్కేందుకు ప్రభుత్వ సహకారం కోరుతున్నామని వివరించింది. -
టెల్కోలకు సుప్రీం షాక్
న్యూఢిల్లీ: టెల్కోల రాబడి (ఏజీఆర్) నిర్వచనం, కేంద్రానికి చెల్లించాల్సిన లైసెన్సు ఫీజులపై టెలికం కంపెనీలకు సుప్రీం కోర్టు షాకిచ్చింది. ఏజీఆర్‌కు సంబంధించి టెలికం శాఖ (డాట్) నిర్వచనం సరైనదేనని స్పష్టం చేసింది. టెల్కోల నుంచి రూ. 92,000 కోట్లు రాబట్టుకోవడానికి డాట్‌కు అనుమతిచ్చింది. జస్టిస్ అరుణ్ మిశ్రా సారథ్యంలోని త్రిసభ్య బెంచ్ గురువారం ఈ మేరకు తీర్పునిచ్చింది. ‘ఏజీఆర్ నిర్వచనం సరైనదేనని న్యాయస్థానం భావిస్తోంది. డాట్ అప్పీలును సమర్ధిస్తూ, లైసెన్సీల (టెల్కోలు) పిటిషన్‌ను కొట్టివేయడం జరిగింది‘ అని పేర్కొంది. టెలికం కంపెనీల మిగతా అభ్యర్ధనలను కూడా తిరస్కరిస్తున్నట్లు తెలిపింది. దీనిపై తదుపరి వాదనలేవీ ఉండబోవని స్పష్టం చేసిన సుప్రీం కోర్టు .. నిర్దేశిత గడువులోగా జరిమానాలు, వడ్డీతో కలిపి డాట్‌కు బకాయిలన్నీ కట్టాలని ఆదేశించింది. ఈ ఏడాది జూలై నాటికి డాట్ లెక్కల ప్రకారం ఎయిర్టెల్ అత్యధికంగా రూ. 21,682.13 కోట్లు, వొడాఫోన్ రూ. 19,823.71 కోట్లు లైసెన్సు ఫీజు కింద బకాయి పడ్డాయి. వివాదం ఇదీ.. కొత్త టెలికం విధానం ప్రకారం.. టెల్కోలు తమ సవరించిన స్థూల రాబడి (ఏజీఆర్)లో నిర్దిష్ట వాటాను ప్రభుత్వానికి వార్షిక లైసెన్సు ఫీజుగా కట్టాల్సి ఉంటుంది. దీనితో పాటు స్పెక్ట్రం వినియోగానికి గాను నిర్దిష్ట చార్జీలు (ఎస్‌యూసీ) చెల్లించాలి. అయితే ఈ ఏజీఆర్ లెక్కింపు విషయంలో వివాదం నెలకొంది. అద్దెలు, స్థిరాస్తుల విక్రయంపై లాభాలు, డివిడెండు మొదలైన టెలికంయేతర ఆదాయాలు కూడా ఏజీఆర్ కిందే వస్తాయని, దానిపైనే లైసెన్సు ఫీజు కట్టాల్సి ఉంటుందని టెలికం వివాదాల పరిష్కార, అపీలేట్ ట్రిబ్యునల్ (టీడీశాట్) గతంలో ఆదేశాలు ఇచ్చింది. దీనివల్ల ప్రభుత్వానికి చెల్లించాల్సిన లైసెన్సు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల భారం భారీగా పెరిగిపోనుండటంతో టీడీశాట్ ఆదేశాలను సవాల్ చేస్తూ టెల్కోలు .. సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. దీనిపై జూలైలో అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం తమ వాదనలు వినిపించింది. అప్పటిదాకా టెల్కోలు రూ. 92,000 కోట్ల మేర లైసెన్సు ఫీజులు బకాయి పడ్డాయని తెలిపింది. తాజాగా ప్రభుత్వ వాదనలతో ఏకీభవిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చింది. 1.4 లక్షల కోట్లపైనే భారం జరిమానాలు, వడ్డీల్లాంటివన్నీ కలిపితే.. సవరించిన ఆదాయాల ప్రకారం టెలికం ఆపరేటర్లు కట్టాల్సిన బకాయిలు ఏకంగా రూ. 1.4 లక్షల కోట్ల పైగా ఉంటాయని అధికారిక వర్గాలు తెలిపాయి. ‘టెల్కోలు కట్టాల్సిన బకాయిలను మళ్లీ లెక్కిస్తే సుమారు రూ. 1.34 లక్షల కోట్లకు చేరుతుంది. మరో త్రైమాసికం లెక్కలు కూడా జోడిస్తే.. ఇది ఇంకో 4–5 శాతం పెరగవచ్చు‘ అని పేర్కొన్నాయి. 10 రోజుల్లో అందరు ఆపరేటర్స్‌కి డిమాండ్ నోటీసులు పంపిస్తామని, అవి అందిన 15 రోజుల్లోగా చెల్లించాల్సి ఉంటుందని తెలిపాయి. కొత్త లెక్కల ప్రకారం లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీలన్నీ కలిపి భారతి ఎయిర్టెల్ అత్యధికంగా రూ. 42,000 కోట్లు, వొడాఫోన్–ఐడియా రూ. 40,000 కోట్లు చెల్లించాల్సి రావొచ్చని అంచనా. జియో కేవలం రూ. 14 కోట్లు కట్టాల్సి రావచ్చు. వొడాఐడియా షేరు కుదేల్.. లైసెన్సు ఫీజుపై సుప్రీం కోర్టు ప్రతికూల ఆదేశాలతో గురువారం వొడాఫోన్ ఐడియా షేరు ఇంట్రాడేలో ఏకంగా 27 శాతం క్రాష్ అయ్యింది. బీఎస్ఈలో ఒక దశలో రూ. 4.10 (52 వారాల కనిష్ట స్థాయి)కి పడిపోయింది. చివరికి కొంత కోలుకుని 23 శాతం నష్టంతో రూ. 4.33 వద్ద క్లోజయ్యింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ. 3,793 కోట్ల మేర హరించుకుపోయి.. రూ. 12,442 కోట్లకు పరిమితమైంది. మరోవైపు, భారతి ఎయిర్టెల్ కూడా ఇంట్రాడేలో సుమారు 10 శాతం క్షీణించి రూ. 325.60కి పడిపోయినప్పటికీ.. తర్వాత కోలుకుని 3.31 శాతం లాభంతో రూ. 372.45 వద్ద క్లోజయ్యింది. కేంద్రం పునఃసమీక్షించాలి: టెల్కోలు ఇప్పటికే ఆర్థిక సమస్యలతో కుదేలవుతున్న టెలికం పరిశ్రమను తాజా తీర్పు మరింత సంక్షోభంలోకి నెట్టివేస్తుందని వొడాఫోన్ఐడియా ఆందోళన వ్యక్తం చేసింది. రివ్యూ పిటిషన్ అవకాశాలపై న్యాయనిపుణులను సంప్రతిస్తామని పేర్కొంది. టెల్కోలపై తీర్పు పెనుభారం మోపుతుందని, కేంద్రం దీన్ని పునఃసమీక్షించాలని ఎయిర్టెల్ తెలిపింది. తీవ్రంగా నిరాశపర్చింది: సీవోఏఐ సుప్రీంకోర్టు తీర్పు తీవ్రంగా నిరాశపర్చిందని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ (సీవోఏఐ) వ్యాఖ్యానించింది. దాదాపు రూ. 4 లక్షల కోట్ల పైచిలుకు రుణభారంతో కుంగుతున్న టెలికం పరిశ్రమకు ఇది గొడ్డలిపెట్టులాంటిదని ఆందోళన వ్యక్తం చేసింది. డిజిటల్ ఇండియా లక్ష్యాల సాధనపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొంది. -
సర్కారు మద్యం వ్యాపారం!
టీఎస్‌బీసీఎల్ ద్వారా లిక్కర్ షాపుల నిర్వహణకు ప్రణాళికలు * పెరిగిన లెసైన్సు ఫీజుతో మద్యం వ్యాపారులు వెనకడగు వేస్తుండటం వల్లే.. * జీహెచ్ఎంసీ, వరంగల్, కరీంనగర్‌లలో ఎ-4 షాపుల ఫీజు అధికం * నేటి నుంచి మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ సాక్షి, హైదరాబాద్: మద్యం వ్యాపారాన్ని సొంతంగా నిర్వహించేందుకు ఎక్సైజ్‌శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రెండేళ్ల కాలానికి మద్యం దుకాణాలకు అనుమతిస్తూ లెసైన్సు ఫీజును 20 శాతం పెంచిన నేపథ్యంలో వ్యాపారులు నిర్వహణకు ముందుకు రానిచోట బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా వ్యాపారం చేయాలని భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో 10 శాతం మద్యం దుకాణాలను అక్కడి ఎక్సైజ్‌శాఖ ఇప్పటికే నిర్వహిస్తున్న నేపథ్యంలో అవసరమైతే అదే ప్రయోగాన్ని రాష్ట్రంలో చేపట్టాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఈ మేరకు తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నూతన మద్యం పాలసీకి సంబంధించిన విధివిధానాలు విడుదల చేసినప్పుడే ఎవరూ దుకాణాలు తీసుకునేందుకు ముందుకు రాని చోట టీఎస్‌బీసీఎల్ పేరుతో ఎ-4 షాపులు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఎక్సైజ్ కమిషనర్ ఆర్.వి. చంద్రవదన్ కూడా ధ్రువీకరించారు. జీహెచ్ఎంసీ, వరంగల్, కరీంనగర్‌లలో భారీగా పెరిగిన ఫీజు రాష్ట్రంలో 2,216 మద్యం దుకాణాలు ఉండగా ప్రభుత్వం వాటిని జనాభా ప్రాతిపదికన విభజించి ప్రస్తుతమున్న లెసైన్సు ఫీజులను 20 శాతం పెంచుతూ ఖరారు చేసింది. ఈ మొత్తాన్ని వ్యాపారులు ఆరు వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. 10 వేల లోపు జనాభా గల 679 దుకాణాలకు సంవత్సరానికి రూ. 39 లక్షల చొప్పున రెండేళ్లకు రూ. 78 లక్షలు చెల్లించాలి. అలాగే 10వేల నుంచి 50 వేల జనాభా ఉన్న 576 దుకాణాలలో ఒక్కో దానికి రూ. 81.60 లక్షలు, 50 వేల నుంచి 3 లక్షలలోపు జనాభాగల 396 దుకాణాలకు రూ. కోటీ ఎనభై వేల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇవన్నీ ఒకెత్తయితే కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 22 దుకాణాలకు ఫీజు రెండేళ్లకు ఏకంగా రూ. 20 లక్షల చొప్పున పెరగగా, కొత్తగా గ్రేటర్ కార్పొరేషన్ అయిన వరంగల్ పరిధిలోని 40 దుకాణాలకు లెసైన్సు ఫీజును 1.63 కోట్లుగా నిర్ణయించారు. వరంగల్ గ్రేటర్ కార్పొరేషన్ కావడంతో గ్రామీణ పరిధిలోని మరో 3 దుకాణాలు కూడా ఇప్పుడు కార్పొరేషన్ పరిధికి చేరాయి. ఇక జీహెచ్ఎంసీలో రూ. 90 లక్షలు ఉన్న లెసైన్సు ఫీజును రెండేళ్లకు రూ. 2.16 కోట్లకు పెంచడం వ్యాపారులకు అశనిపాతం అయింది. నేటి నుంచి దరఖాస్తులు అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానున్న రెండేళ్ల మద్యం పాలసీకి సంబంధించి సోమవారం నుంచి దరఖాస్తులను ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచుతారు. రూ. 50 వేలు చెల్లించి దరఖాస్తులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 21వ తేదీ లోపు దరఖాస్తులను అందజేయాలి. 23న జిల్లా కలెక్టర్ల సమక్షంలో డ్రా తీస్తారు. రాష్ట్రవ్యాప్తంగా మిగిలిపోనున్న షాపులు జీహెచ్ఎంసీ పరిధిలో 503 మద్యం దుకాణాలు ఉండగా వీటికి 2014-15 సంవత్సరంలో లెసైన్సు ఫీజును రూ. 90 లక్షలుగా నిర్ణయించి దరఖాస్తులు కోరితే 103 దుకాణాలను ఎవరూ తీసుకోలేదు. రంగారెడ్డి జిల్లాలోని అర్బన్ ప్రాంతంతోపాటు మెదక్ జిల్లా పటాన్చెరు, రామచంద్రాపురం జీహెచ్ఎంసీ పరిధిలోకి రాగా, గ్రేటర్ సరిహద్దు గీతకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలు, మండల కేంద్రాలను కూడా గ్రేటర్ పరిధిలోకి తేవడమే ఇందుకు కారణం. మెదక్ జిల్లా పరిధిలోని పటాన్చెరు, రామచంద్రాపురం ప్రాంతాల్లోని 15 దుకాణాల్లో ఒక్క దుకాణాన్ని కూడా ఎవరూ తీసుకోలేదు. అలాగే హైదరాబాద్ సిటీ, రంగారెడ్డిలో కూడా అదే పరిస్థితి. వరంగల్ గ్రేటర్ కార్పొరేషన్ అయ్యాక జూలై నుంచి సెప్టెంబర్ వరకు లెసైన్సులను రెన్యూవల్ చేయించుకోవాలని ప్రభుత్వం కోరగా 8 షాపుల వ్యాపారులు వెనకడుగు వేశారు. అలా రాష్ట్రంలో మరో 50 దుకాణాలను మూన్నెళ్ల కాలానికి ఎవరూ తీసుకోలేదు. ఈ పరిస్థితుల్లో 20 శాతం లెసైన్సు ఫీజు పెంచుతూ తీసుకున్న నిర్ణయం వల్ల హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో కూడా భారీగా దుకాణాలు మిగిలిపోయే అవకాశం ఉందని ఎక్సైజ్ అధికారులు కూడా ఒప్పుకుంటున్నారు. -
మందు బందీ!
నరసరావుపేటవెస్ట్: జిల్లాలో సగభాగానికి మద్యం సరఫరా చేసే నరసరావుపేట ఏపీ బేవరేజెస్ గోడౌన్లు గురువారం నుంచి మూత పడ్డాయి. గోడౌన్లకు మద్యం తీసుకువచ్చిన లారీలు రోడ్లపైనే పడిగాపులు కాస్తున్నాయి. గోడౌన్ల నుంచి సరఫరా లేక దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లలో మద్యం నిల్వలు తగ్గుతున్నాయి. ఇప్పటికే మద్యం దొరకటం లేదనే సాకుతో ఫుల్‌బాటిల్‌పై రూ.25 నుంచి రూ.50 వరకు పెంచి విక్రయిస్తున్నారు. షాపులకు కావాల్సిన స్టాక్ ఇవ్వలేని ప్రభుత్వం వారి వద్ద నుంచి లెసైన్స్ ఫీజును మాత్రం ముందుగానే గుంజుకుంది. దీంతో మద్యం సరఫరా లేక, మద్యం ప్రియులు అడిగిన బ్రాండ్లు అందించలేక బేరాలు పోగొట్టుకుంటూ దుకాణ యజమానులు నష్టాలపాలవుతున్నారు. వారితో పాటు గోడౌన్లకు వచ్చిన మద్యం లారీల నుంచి దిగుమతి, ఎగుమతి చేసే హమాలీలకు రోజువారి పనిలేక ఇబ్బందులు పడుతున్నారు. వివరాలను పరిశీలిస్తే..మద్యానికి సంబంధించి సుమారు రూ.8వేల కోట్లు ఆదాయ పన్ను చెల్లించాలని ఆ శాఖ జారీ చేసిన నోటీసులను రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఖాతరు చేయకపోవటంతో బేవరేజెస్ గోడౌన్లను అధికారులు మూసేశారు.దీంతో నాలుగురోజుల నుంచి షాపులకు మద్యం సరఫరా నిలిచిపోయింది. నరసరావుపేటలోని గోడౌన్ల ద్వారా మాచర్ల, గురజాల, వినుకొండ, చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లోని మద్యం దుకాణాలు, బార్లకు రూ. కోట్ల విలువైన మద్యం సరఫరా జరుగుతోంది. ప్రస్తుతం సరఫరా నిలిచిపోవడం, ఇదే పరిస్థితి మరో రెండు మూడురోజులు కొనసాగితే మద్యం నిల్వలు పూర్తిగా ఖాళీ అవుతాయని ఆయా షాపుల యజమానులు ఆందోళన చెందుతున్నారు. ముందుగానే బార్ల నిర్వాహకులు లెసైన్స్ ఫీజులను గత డిసెంబర్ చివరికే చెల్లించగా, వైన్స్‌షాపుల యజమానులు ఫిబ్రవరి 20వ తేదీతో చెల్లించేశారు. కాగా గోడౌన్ల వద్ద సరుకు ఎగుమతి, దిగుమతికి సంబంధించి 50 మంది హమాలీలు పనిచేస్తున్నారు. వీరందరికీ రోజువారీ కూలి దక్కుతుంటుంది. నాలుగురోజుల నుంచి పనులు దొరకక పోవటంతో ఇబ్బందిపడుతున్నారు. ఎక్సైజ్ కార్యాలయాలకు వెళ్లి గోడౌన్లు ఎప్పుడు తెరుస్తారంటూ అధికారులను అడుగుతున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్త సమస్య కావటంతో తామేమీ ఇప్పుడే చెప్పజాలమంటూ వారు సమాధానమిస్తున్నారు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం ఆదాయ పన్నుశాఖ మూసేసిన గోడౌన్లను అలానే ఉంచి, నూతన గోడౌన్లను చూసి వాటిలోకి సరుకు దిగుమతిచేసి షాపులకు తరలించాలనే ఆలోచనతో అధికారులు ఉన్నట్లు సమాచారం. ఏమౌతుందో మరో రెండురోజులు వేచి చూడాల్సిందే. -
జిల్లాలో విరివిగా కల్తీ మద్యం
సాక్షి ప్రతినిధి, వరంగల్ : మద్యం ప్రియులకు నిఖార్సైన సరుకు దొరకడంలేదు. లక్షల రూపాయల లెసైన్స్ ఫీజుతో కొత్తగా షాపులు పెట్టిన పలువురు మద్యం వ్యాపారులు... వీలైనంత త్వరగా ఆదాయం రాబట్టుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. నీళ్లు కలిపిన మద్యం విక్రయిస్తూ మద్యం ప్రియులకు కిక్ లేకుండా చేస్తున్నారు. కిక్ ఎక్కకపోవడంతో మద్యం ప్రియులు మరింత తాగుతూ జేబులు గుల్ల చేసుకుంటున్నారు. ఇలా వచ్చిన అదనపు ఆదాయూన్ని మద్యం వ్యాపారులు... పలువురు ఎక్సైజ్ అధికారులకు వాటాగా ముట్టచెబుతూ యథేచ్ఛగా దందా సాగిస్తున్నారు. ఈ ఏడాది 2014-15 మద్యం సీజన్లో వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం లక్ష్యంగా ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా 234 (వైన్స్ షాపు) మద్యం దుకాణాలు ఏర్పాటు చేసింది. లాటరీలో షాపు దక్కిన వారు ప్రభుత్వం నిర్దేశించిన మేరకు లెసైన్స్ ఫీజు చెల్లించారు. జూలై 1 నుంచి మద్యం అమ్మకాలు మొదలుపెట్టారు. పెట్టుబడి త్వరగా రావాలనే ఉద్దేశంతో పలువురు మద్యం వ్యాపారులు అక్రమాలకు పాల్పడుతున్నారు. మద్యం సీసాల్లో నీళ్లు కలిపి విక్రయిస్తున్నారు. వైన్ షాపుల్లో పెగ్గుల రూపంలో (లూజ్) మద్యం విక్రయించకూడదనే ఎక్సైజ్ శాఖ ప్రాథమిక నిబంధనలను ఉల్లంఘిస్తూ బహిరంగంగానే ఈ పనిచేస్తున్నారు. ఎక్సైజ్ శాఖ అధికారుల ప్రోత్సాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని కొందరు వ్యాపారులు వైన్ షాపు ఆవరణలో డ్రమ్ముల్లో మద్యాన్ని పోసి పెగ్గుల రూపంలో అమ్ముతున్నారు. ఇష్టం వచ్చినట్లుగా నీళ్లు కలిపి మద్యం ప్రియులను దోపిడీ చేస్తున్నారు. ఈ అక్రమాలను ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ఎవరైనా ఒకట్రెండుసార్లు ఫిర్యాదు చేస్తే మాత్రం వచ్చి తనిఖీలు చేస్తున్నారు. ఇలాంటి మొక్కుబడి తనిఖీల్లోనే భారీగా కల్తీ మద్యం పట్టుబడుతోంది. ఏ కంపెనీకి చెందిన మద్యం సీసాలో అయినా... ప్రమాణాల ప్రకారం మద్యం మోతాదు (ఆల్కహాల్ స్ట్రెంత్) 25 శాతం ఉంటుంది. వాతావరణంలోని మార్పులను బట్టి ఈ మోతాదు శాతం 24.5 నుంచి 25.5 వరకు ఉండవచ్చు. సీసాను ఓపెన్ చేసి నీళ్లు కలిపితే ఇది తక్కువగా ఉంటుంది. ఇది ఎక్సైజ్ శాఖ పరీక్షల్లో తేలుతుంది. కొత్త మద్యం సీజన్ మొదలై 42 రోజులే అయింది. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా కల్తీ మద్యం కేసులు నమోదుయ్యాయి. ఫిర్యాదుల ఆధారంగానే ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అన్నింటా కల్తీ మద్యమేనని నిర్ధారించారు. ఇలా అన్ని కేసుల్లోనూ నీళ్లు కలిపినట్లు విశ్లేషణ పరీక్షల్లో తేలింది. ఎక్సైజ్ అధికారులు 27 షాపుల్లో సేకరించిన శాంపిల్స్‌లో 17దుకాణాల్లో కల్తీ మద్యమని తేలడం గమనార్హం. మచ్చుకు కొన్ని ఘటనలు.. * జూలై చివరవారంలో భూపాలపల్లిలోని కళ్యాణి వైన్స్‌లో ఎక్సైజ్ అధికారులు ఆరు మద్యం సీసాల నుంచి శాంపిల్స్ తీసి పరీక్షించారు. రెండు శాంపిల్స్ కల్తిగా తేలాయి. ఇదేప్రాంతంలోని గాయత్రి వైన్స్‌లో ఐదు శాంపిల్స్ సేకరించగా... ఒకటి కల్తీగా నిర్ధారణ అయింది. * ములుగు మండలం మల్లంపల్లిలోని దుర్గా వైన్స్‌లో ఐదు శాంపిల్స్ సేకరిస్తే అన్నీ కల్తీగా నిర్ధారణ అయ్యాయి. ఇక్కడ కల్తీ మద్యం తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. 42 కల్తీ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. గణపురం(ఎం)లోని దుర్గా వైన్స్‌లో ఆరు శాంపిల్స్ తీసుకుని పరీక్షలు నిర్వహించారు. అన్ని శాంపిల్స్ కల్తీగానే తేలాయి. * కొత్తగూడలోని కనకదుర్గ వైన్స్‌లో నాలుగు శాంపిల్స్ సేకరించారు. ఇక్కడ కల్తీ అని తేలలేదు. అయితే మద్యాన్ని సీసాల్లోంచి తీసి పెగ్గుల రూపంలో విక్రయిస్తున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. ఈ నెల 8న వర్ధన్నపేటలోని సన్ని వైన్స్‌లో శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపారు. ఎక్సైజ్ అధికారులు దాడుల జరిపిన సమయంలో సన్ని వైన్స్‌లో నీటి జగ్గుల్లో మద్యం ఉండడం, గ్లాసుల్లో మద్యం పోసేందుకు అవసరమైన గౌరలు ఉన్నాయి. వర్ధన్నపేటలోని తిరుమల వైన్స్‌కు చెందిన రూ.3 లక్షల విలువైన మద్యం సీసాలను ఒక గుర్తింపులేని గోదాంలో నిల్వ చేస్తే స్వాధీనం చేసుకున్నామని ఎక్సైజ్ అధికారులు ప్రకటించారు. వాస్తవంగా అధికారులు రూ.8 లక్షల విలువైన మద్యం పట్టుకున్నారని.. ఉద్దేశపూర్వకంగానే మద్యం నిల్వలను తక్కువ చేసి ప్రకటించినట్లు తెలుస్తోంది. వర్ధన్నపేటలోని ఎక్సైజ్ అధికారులు ఇక్కడి వైన్స్ షాపులతో కుమ్మక్కై నేరుగా బెల్ట్ షాపులకు తరలించేందుకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. -
లక్కు.. కిక్కు..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఈ ఏడాది కూడా లక్కున్నోళ్లకే కిక్కెక్కించే మద్యం దుకాణాలు దక్కనున్నాయి. లాటరీ పద్ధతినే దుకాణాలను కేటాయించనున్నారు. 2014-15 సంవత్సరానికి గాను ఫిక్స్డ్ లెసైన్స్డ్ పద్ధతిపై మద్యం షాపులు కేటాయించేందుకు ఎక్సైజ్ అధికారులు సోమవా రం నోటిఫికేషన్ విడుదల చేశారు. జిల్లాలో మొత్తం 142 మద్యం దుకాణాలకు గానూ గత ఏడాది కేటాయించిన 130 దుకాణాలకు ఈ నెల 21వరకు దరఖాస్తులు చేసుకోవచ్చ ని చెప్పారు. జిల్లాలోని నిజామాబాద్, కా మారెడ్డి ఎక్సైజ్ సూపరింటెండెంట్ల(ఈఎస్) కార్యాలయాల పరిధిలోని ఈ దుకాణాలను 23న ఉదయం 11గంటల నుంచి లాటరీ పద్ధతిన కేటాయించనున్నారు. 2014-15 ఎకై ్సజ్ పాలసీని ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఈమేరకు ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాల ప్రకారం జిల్లా అధికారులు ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. జనాభా ప్రాతిపదికన ఆరు స్లాబుల్లో ఫిక్స్డ్ లెసైన్స్డ్ పద్ధతిని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీని ప్రకారం.. 1. పదివేల వరకు జనాభా ఉండే ప్రాంతంలో ఒక్కో దుకాణానికి రూ.32.50 లక్షలు లెసైన్స్ ఫీజు చెల్లించాలి. 2. పదివేల నుంచి యాభైవేలలోపు జనాభా ప్రాంతానికి రూ.34లక్షలు 3. యాభైవేల నుంచి మూడు లక్షల జనాభా వరకు రూ.42లక్షలు 4. మూడు లక్షల నుంచి ఐదులక్షల లోపు జనాభా ఉంటే రూ.50 లక్షలు 5. ఐదు లక్షల నుంచి ఇరవై లక్షల లోపు జనాభా ఉంటే రూ.68 లక్షలు 6. ఇరవై లక్షలు ఆపైన జనాభా ఉండే ప్రాంతాల్లో ఒక్కో దుకాణానికి రూ.90 లక్షలు లెసైన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో జిల్లాల్లో నాలుగు స్లాబుల్లోనే మద్యం దుకాణాలు కేటాయించే అవకాశం ఉంది. అత్యధికంగా మూడులక్షల నుంచి ఐదులక్షల లోపు జనాభా ఉన్న నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలోని 22 దుకాణాల ద్వారా సర్కారుకు లాభం చేకూరనుంది. ఒక్కో దుకాణానికి రూ.50 లక్షల చొప్పున లెసైన్స్ ఫీజు సర్కారు ఖజానాకు చేరనుంది. యాభైవేల నుంచి మూడులక్షల లోపు జనాభా కలిగిన బోధన్, కామారెడ్డిలలో 12 దుకాణాలకు రూ.42 లక్షల చొప్పున రూ.5.04 కోట్ల ఆదాయం ఫీజు రూపేణా రానుంది. అలాగే పదివేల నుంచి యాభైవేల లోపు జనాభా ఉన్న 40 దుకాణాలకు రూ.34 లక్షల చొప్పున రూ.13.60 కోట్లు, పదివేల జనాభా ఉన్న 56 దుకాణాలపై రూ.32.50 లక్షల చొప్పున రూ.18.20 కోట్లు లెసైన్స్ ఫీజు రానుంది. లాటరీ ద్వారానే కేటాయింపు ఈ ఏడాది కూడా మద్యం దుకాణాల ఎంపికను లాటరీ పద్ధతి ద్వారానే కేటాయించనుండటంతో ఎక్సైజ్ కొత్త పాలసీలో అధిక లాభాలు చూపే షాపులు ఎవరికీ దక్కుతాయోననే చర్చ ఇప్పటి నుంచే సాగుతోంది. గత ఏడాది జూన్ 27న టెండర్లు నిర్వహించిన అధికారులు లాటరీ ద్వారానే దుకాణాలను కేటాయించారు. ఈ ఏడాది నిజామాబాద్ ఈఎస్ పరిధిలోని 93, కామారెడ్డి యూనిట్ కింద ఉన్న 37 దుకాణాలను పొందాలనుకునే వారు ఈనెల 21న సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. దరఖాస్తులను పరిశీలించిన తర్వాత ఈనెల 23న జిల్లాకేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో ఉదయం 11 గంటల నుంచి లాటరీ ద్వారా దుకాణాలను కేటాయించనున్నారు. ఈ నెలాఖరులోగా లెసైన్స్‌లు మంజూరు చేస్తారు. జులై 1 నుంచి దుకాణాలు పొందిన యజమానులు మద్యం విక్రయించుకోవచ్చని అధికారులు తెలిపారు.మద్యం టెండర్లకు పకడ్బందీగా ఏర్పాట్లు -ఎ. అరుణ్‌రావు, ప్రొహిబిషన్, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సుభాష్‌నగర్ : జిల్లాలో 2014-15 సంవత్సరానికి గాను 130 దుకాణాలకు లాటరీ ద్వారా కేటాయించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ప్రొహిబిషన్, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఎ.అరుణ్‌రావు తెలిపారు. మద్యం దుకాణాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాల మేరకు నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. జిల్లాకేంద్రంలోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మొత్తం 142మద్యం దుకాణాలకు గానూ గత ఏడాది పిలిచిన 130దుకాణాలకే ఈసారి కూడా టెండర్లు పిలుస్తున్నట్లు చెప్పారు. ఆసక్తి గల వ్యాపారులు దరఖాస్తు చేసుకొని లాటరీ ద్వారా దుకాణాలు పొందవచ్చన్నారు. ఒక్కొక్కరు దుకాణానికి ఒకే దరఖాస్తు చేసుకోవచ్చని, దరఖాస్తులను దాఖలు చేసేందుకు జిల్లాకేంద్రంలోని ఈఎస్ కార్యాలయంతో పాటు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బాక్సులను ఏర్పాటు చేశామన్నారు.మద్యం దుకాణాలను పొందిన వారు రూ.2లక్షలు చెల్లించి పర్మిట్రూం లెసైన్స్‌లు పొందాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో నిజామాబాద్, కామారెడ్డిల ఎక్సైజ్ సూపరింటెండెంట్లు ఎం.గంగారాం, కె.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.