జిల్లాలో విరివిగా కల్తీ మద్యం | widely adulterated alcohol in district | Sakshi
Sakshi News home page

జిల్లాలో విరివిగా కల్తీ మద్యం

Published Tue, Aug 12 2014 1:42 AM | Last Updated on Wed, Sep 5 2018 8:43 PM

widely adulterated alcohol in district

సాక్షి ప్రతినిధి, వరంగల్ :  మద్యం ప్రియులకు నిఖార్సైన సరుకు దొరకడంలేదు. లక్షల రూపాయల లెసైన్స్ ఫీజుతో కొత్తగా షాపులు పెట్టిన పలువురు మద్యం వ్యాపారులు... వీలైనంత త్వరగా ఆదాయం రాబట్టుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. నీళ్లు కలిపిన మద్యం విక్రయిస్తూ మద్యం ప్రియులకు కిక్ లేకుండా చేస్తున్నారు. కిక్ ఎక్కకపోవడంతో మద్యం ప్రియులు మరింత తాగుతూ జేబులు గుల్ల చేసుకుంటున్నారు.
 
ఇలా వచ్చిన అదనపు ఆదాయూన్ని మద్యం వ్యాపారులు... పలువురు ఎక్సైజ్ అధికారులకు వాటాగా ముట్టచెబుతూ యథేచ్ఛగా దందా సాగిస్తున్నారు.  ఈ ఏడాది 2014-15 మద్యం సీజన్‌లో వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం లక్ష్యంగా ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా 234 (వైన్స్ షాపు) మద్యం దుకాణాలు ఏర్పాటు చేసింది. లాటరీలో షాపు దక్కిన వారు ప్రభుత్వం నిర్దేశించిన మేరకు లెసైన్స్ ఫీజు చెల్లించారు. జూలై 1 నుంచి మద్యం అమ్మకాలు మొదలుపెట్టారు. పెట్టుబడి త్వరగా రావాలనే ఉద్దేశంతో పలువురు మద్యం వ్యాపారులు అక్రమాలకు పాల్పడుతున్నారు. మద్యం సీసాల్లో నీళ్లు కలిపి విక్రయిస్తున్నారు. వైన్ షాపుల్లో పెగ్గుల రూపంలో (లూజ్)  మద్యం విక్రయించకూడదనే ఎక్సైజ్ శాఖ ప్రాథమిక నిబంధనలను ఉల్లంఘిస్తూ బహిరంగంగానే ఈ పనిచేస్తున్నారు.
 
ఎక్సైజ్ శాఖ అధికారుల ప్రోత్సాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని కొందరు వ్యాపారులు వైన్ షాపు ఆవరణలో డ్రమ్ముల్లో మద్యాన్ని పోసి పెగ్గుల రూపంలో అమ్ముతున్నారు. ఇష్టం వచ్చినట్లుగా  నీళ్లు కలిపి మద్యం ప్రియులను దోపిడీ చేస్తున్నారు. ఈ అక్రమాలను ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ఎవరైనా ఒకట్రెండుసార్లు ఫిర్యాదు చేస్తే మాత్రం వచ్చి తనిఖీలు చేస్తున్నారు. ఇలాంటి మొక్కుబడి తనిఖీల్లోనే భారీగా కల్తీ మద్యం పట్టుబడుతోంది. ఏ కంపెనీకి చెందిన మద్యం సీసాలో అయినా... ప్రమాణాల ప్రకారం మద్యం మోతాదు (ఆల్కహాల్ స్ట్రెంత్) 25 శాతం ఉంటుంది.
 
వాతావరణంలోని మార్పులను బట్టి ఈ మోతాదు శాతం 24.5 నుంచి 25.5 వరకు ఉండవచ్చు. సీసాను ఓపెన్ చేసి నీళ్లు కలిపితే ఇది తక్కువగా ఉంటుంది. ఇది ఎక్సైజ్ శాఖ పరీక్షల్లో తేలుతుంది. కొత్త మద్యం సీజన్ మొదలై 42 రోజులే అయింది. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా కల్తీ మద్యం కేసులు నమోదుయ్యాయి. ఫిర్యాదుల ఆధారంగానే ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అన్నింటా కల్తీ మద్యమేనని నిర్ధారించారు. ఇలా అన్ని కేసుల్లోనూ నీళ్లు కలిపినట్లు విశ్లేషణ పరీక్షల్లో తేలింది. ఎక్సైజ్ అధికారులు 27 షాపుల్లో సేకరించిన శాంపిల్స్‌లో 17దుకాణాల్లో కల్తీ మద్యమని తేలడం గమనార్హం.
 
 మచ్చుకు కొన్ని ఘటనలు..
* జూలై చివరవారంలో భూపాలపల్లిలోని కళ్యాణి వైన్స్‌లో ఎక్సైజ్ అధికారులు ఆరు మద్యం సీసాల నుంచి శాంపిల్స్ తీసి పరీక్షించారు. రెండు శాంపిల్స్ కల్తిగా తేలాయి. ఇదేప్రాంతంలోని గాయత్రి వైన్స్‌లో ఐదు శాంపిల్స్ సేకరించగా... ఒకటి కల్తీగా నిర్ధారణ అయింది.  
* ములుగు మండలం మల్లంపల్లిలోని దుర్గా వైన్స్‌లో ఐదు శాంపిల్స్ సేకరిస్తే అన్నీ కల్తీగా నిర్ధారణ అయ్యాయి. ఇక్కడ కల్తీ మద్యం తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. 42 కల్తీ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. గణపురం(ఎం)లోని దుర్గా వైన్స్‌లో ఆరు శాంపిల్స్ తీసుకుని పరీక్షలు నిర్వహించారు. అన్ని శాంపిల్స్ కల్తీగానే తేలాయి.
* కొత్తగూడలోని కనకదుర్గ వైన్స్‌లో నాలుగు శాంపిల్స్ సేకరించారు. ఇక్కడ కల్తీ అని తేలలేదు. అయితే మద్యాన్ని సీసాల్లోంచి తీసి పెగ్గుల రూపంలో విక్రయిస్తున్నట్లు గుర్తించి  కేసు నమోదు చేశారు.
 
ఈ నెల 8న వర్ధన్నపేటలోని సన్ని వైన్స్‌లో శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపారు. ఎక్సైజ్ అధికారులు దాడుల జరిపిన సమయంలో సన్ని వైన్స్‌లో నీటి జగ్గుల్లో మద్యం ఉండడం, గ్లాసుల్లో మద్యం పోసేందుకు అవసరమైన గౌరలు ఉన్నాయి. వర్ధన్నపేటలోని తిరుమల వైన్స్‌కు చెందిన రూ.3 లక్షల విలువైన మద్యం సీసాలను ఒక గుర్తింపులేని గోదాంలో నిల్వ చేస్తే స్వాధీనం చేసుకున్నామని ఎక్సైజ్ అధికారులు ప్రకటించారు. వాస్తవంగా అధికారులు రూ.8 లక్షల విలువైన మద్యం పట్టుకున్నారని.. ఉద్దేశపూర్వకంగానే మద్యం నిల్వలను తక్కువ చేసి ప్రకటించినట్లు తెలుస్తోంది. వర్ధన్నపేటలోని ఎక్సైజ్ అధికారులు ఇక్కడి వైన్స్ షాపులతో కుమ్మక్కై నేరుగా బెల్ట్ షాపులకు తరలించేందుకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement