మామూళ్లు పెంచేశారు! | Increased mamullu | Sakshi
Sakshi News home page

మామూళ్లు పెంచేశారు!

Published Mon, Jul 6 2015 1:02 AM | Last Updated on Wed, Sep 5 2018 8:43 PM

Increased mamullu

  మద్యం తయారీ సంస్థల నుంచి డిపోలకు..డిపోల నుంచి రిటైలర్లకు మద్యం పంపిణీ వ్యవహారంలో రూ.లక్షలు చేతులు మారుతున్నాయి. కొత్త మద్యం పాలసీ ప్రారంభం నేపథ్యంలో గతం కంటే భారీగా ఎక్సైజ్ సిబ్బంది మామూళ్లు పెంచేయడాన్ని వ్యాపారులు సహించలేకపోతున్నారు. కొత్తగా వ్యాపారంలో అడుగుపెట్టిన వాళ్లకు ఈ వ్యవహారం వింతగా కనిపిస్తోంది. అయితే కొత్త దుకాణాల వ్యవహారం కావడంతో సిబ్బంది అడిగే మామూళ్లకు కాదనలేకపోతున్నారు. పాత వ్యాపారులూ చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు.  
 
 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :మద్యం తయారీ సంస్థల నుంచి గతంలో ఏపీబీసీఎల్ కార్యాలయానికి మద్యం వచ్చేది. ఏపీబీసీఎల్ నుంచి కోట్లాది రూపాయల పన్ను ఆదాయపన్నుశాఖకు బకాయి పెరిగిపోవడంతో డిపోల్ని సీజ్ చేశారు. కేసు నమోదు అనంతరం ఆ వ్యవహారం అంతటితో ఆగిపోయింది. కొత్త పాలసీ నేపథ్యంలో పన్ను భారం నుంచి తప్పించుకోవడానికి ప్రభుత్వం ఏపీబీసీఎల్ స్థానంలో ఏపీఎస్‌బీసీఎల్ (ఏపీ రాష్ర్ట బెవరేజెస్ కార్పోరేషన్ లిమిటెడ్.)ను తెరమీదకు తెచ్చింది. కార్పొరేషన్  సిబ్బందితో పాటు ఎక్సైజ్ సిబ్బంది కీలకంగా వ్యవహరించే ఈ డిపోల్లో మద్యం తయారీ సంస్థల నుంచి మద్యం తెప్పించి పన్నులు వేసి రిటైలర్లకు ప్రభుత్వమే విక్రయించేలా ఏర్పాట్లు చేస్తోంది.
 
 సర్వసాధారణమే!: గతంలో డిపోల్లో నడిచే వ్యవహారం ఇకపై ఉండబోదని ప్రకటించినా అది సర్వసాధారణమే అయిపోయింది. డిపోలకు మద్యం లోడు రాగానే టీపీ (రవాణా పర్మిట్), సమయానికే వచ్చిందా, పర్చేజ్ ఆర్డర్ ఉందా, ఎక్సైజ్ డ్యూటీ/ఎడిసివ్ డ్యూటీ చెల్లించారా అన్న విషయాల్ని ఎక్సైజ్ సిబ్బంది పరిశీలించాలి. అనంతరం కంప్యూటర్ సెక్షన్‌లో ఆన్‌లైన్ లోడింగ్ చేయించాలి. ఇలా రోజుకు కనీసం పది లోడ్లు (బీర్ అయితే ఒక్కో లోడ్‌కు కనీసం 1200 నుంచి 1250 కేసులు, లిక్కర్ అయితే సు మారు 1150 కేసులు) వస్తుంటాయి. డిమాండ్ అధికంగా ఉంటే ఆ సంఖ్య ఇంకా పెరుగుతుంది. అన్‌లోడింగ్ సమయంలో మద్యం బాటిళ్లు విరిగిపోతే దానికీ సర్టిఫై చే యా లి. నిబంధనల ప్రకారం మద్యం కంపెనీ ప్రతినిధి, ఎక్సైజ్ సిబ్బంది, డిపో సి బ్బంది సమక్షంలో నిర్ణయించాలి.
 
 బ్రేకేజ్ ఎక్కువగా ఉంటే మద్యం సంస్థలకు ఇవ్వాల్సిన సొమ్ములో కోత విధిస్తారు. ఇక్కడే వ్యవహారం పక్కదారి పడుతోంది. బ్రేకేజీల్ని అధికంగా చూపించి మద్యం బాటిళ్లను పక్కదారి పట్టించేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.  రేట్లు పెంచేశారు: డిపోల్లో జరుగుతున్న వ్యవహారంలో గతంలో కొద్దిశాతమే మామూళ్లు తీసుకుంటే ఇప్పుడు దాన్ని భారీగా పెంచేశారనే విమర్శలు వస్తున్నాయి. అధికారులు తమకు అనుకూలంగా ఉన్న సిబ్బందిని డిపోల్లో నియమించి సొమ్ము వసూళ్లకు పాల్పడుతున్నారన్న విమర్శలున్నాయి. డిపోల నుంచి సరుకు రీటైలర్లకు పంపిణీ చేసే వ్యవహారంలో వ్యాపారులు ఏ స్థాయిలోనూ చేయి తడపందే పని కాదనే విమర్శలున్నాయి. డీడీలు తీసుకువచ్చి, తమవంతు వచ్చేవరకు వేచి చూడడం ఓ తంతు అయితే డిమాండ్‌ను బట్టి తమకు కావాల్సిన సరుకు తీసుకువెళ్లేందుకు మరో తంతు. వీటన్నింటికీ ధర పెట్టేశారు.
 
 అలాగే కొత్త దుకాణం తెరిచే సమయంలో నిబంధనల ప్రకారం ఆధార్/పాన్ కార్డు, నౌకరు నామా, లెసైన్సీ వివరాలు పరిశీలించి కంప్యూటర్లలో డేటా నమోదు చేసేందుకు జరిగే తంతుకు (రిజిస్ట్రేషన్)కు కూడా భారీగా మామూళ్లు పెంచేయడంతో వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. ఈ వ్యవహారంలో అన్ని స్థాయిల సిబ్బందికీ వాటాలు వెళ్తుంటాయని, జిల్లా అధికారులు దృష్టిసారించాల్సిన అవసరం ఉందని ఎక్సైజ్ శాఖ సిబ్బందే చెబుతున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement