ధరల ‘కిక్కు’
ధరల కిక్కుతో మద్యం వ్యాపారులు దండుకుంటున్నారు. ప్రివిలేజ్ ఫీజు పేరుతో అదనపు వసూళ్లకు దిగారు. వ్యాపారులంతా సిండికేటై దోపిడీకి పూనుకున్నారు. షాపుల్లో ఉన్న ధరల పట్టికను సైతం పక్కకు పడేసి యథేచ్ఛగా అదనపు ధరలకు విక్రయాలు సాగిస్తున్నారు. మామూళ్ల మత్తులో ఉన్న ఎక్సైజ్ అధికారులు ఏమీ పట్టనట్టే వ్యవహరిస్తున్నారు. కళ్లెదుటే అదనపు ధరల దోపిడీ కనబడుతున్నా ఏప్రిల్ నుంచి ఎక్సైజ్ అధికారులు ఒక్క కేసు కూడా నమోదు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : మద్యం వ్యాపారులు బరి తెగించారు. లెసైన్స్ గడువు ముగుస్తుండటంతో అంతా సిండికేట్ అయ్యి ధరలు పెంచేశారు. ఏ బ్రాండ్ అయినా ఒక్కో ఫుల్‌బాటిల్‌కు రూ.20 నుంచి 30 వరకు అదనంగా రేటు పెంచి అమ్ముతుండటంతో మందుబాబుల జేబుకు భారీగానే చిల్లు పడుతోంది.
దండిగా మామూళ్లు అందుకుంటున్న ఎక్సైజ్ అధికారులు రెట్టింపు వ్యాపారానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని ఆరోపణలు వినపడుతున్నాయి. జిల్లాలో ప్రతినెల రూ.50 కోట్ల మద్యం వ్యాపారం జరుగుతోంది. ఈ అదనపు బాదుడుతో మందుబాబులు మరో రూ.10 కోట్లు వదిలించుకోక తప్పదు. జూన్ 30వ తేదీతో వైన్ షాపుల లెసైన్స్ గడువు ముగియనుండటంతో మద్యం దుకాణాలు రెట్టింపు ధరలతో ఊగిపోతున్నాయి.
‘ప్రివిలేజ్’ దెబ్బకు సిండికేట్ విరుగుడు
జిల్లాలో మొత్తం 148 లెసైన్స్‌డ్ వైన్ షాపులున్నాయి. వీటి ద్వారా ప్రతినెలా రూ.50 కోట్ల మద్యం వ్యాపారం నడుస్తోంది. ప్రభుత్వం ఏడాది కాలపరిమితో జారీ చేసిన లెసైన్స్ గడువు వచ్చే నెలాఖరుతో ముగస్తుంది. ప్రభుత్వం షాపుల యజమానుల అదనపు ఆదాయానికి గండి పెడుతూ ప్రివిలేజ్ (నిర్దేశించిన దానికన్నా ఎక్కువ వ్యాపారం చేస్తే ప్రభుత్వానికి చెల్లించేది) ఫీజు విధించింది. దీని ప్రకారం మద్యం అమ్మకాలపై లాభాల రేటు కాస్తా అటు ఇటుగా 17 శాతం లభించనుంది.
లెసైన్స్‌ల జారీ సమయంలో నిర్ణీత లెసైన్స్ ఫీజుకు ఏడు రెట్లు అమ్మకాలు సాగించినా షాపు యజమానులకు లాభాల్లో కోత పెట్టే సరికొత్త నిబంధనను దీంట్లో చేర్చారు. జిల్లాలో ఇప్పటికే అన్ని వైన్ షాపులు ఈ ప్రివిలేజ్ ఫీజు పరిధిలోకి వచ్చాయి. ఒక్కసారిగా లాభాలు పడిపోయాయనుకున్న వ్యాపారులు ఈ అదనపు అమ్మకాల వ్యవహారానికి ప్లాన్ వేసి సిండికేట్ అయ్యారు. ఎక్సైజ్ అధికారులతో కుమ్మక్కై చివరి మూడు నెలల పాటు తాము ఇష్టమొచ్చినట్లు అమ్ముకునే ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆరోపణలున్నాయి.
అంటే 40 రోజుల తర్వాత తమ లెసైన్స్ ఉంటుందో..? ఊడుతుందోనన్న ఆలోచనకు వచ్చిన వైన్స్ యజమానులు అదనపు రేట్లకు ప్రణాళిక చేశారు. ఇప్పటికే రెండు నెలల నుంచి ఈ వ్యవహారం నడుస్తున్నా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. బ్రాండ్ ఏదైనా రూ.20 నుంచి 30 వరకు, బీర్లకు రూ.10 నుంచి రూ.15 వరకు అదనంగా వసూళ్లు చేస్తున్నారు.
యథేచ్ఛగా అమ్మకాలు
లెసైన్స్ పొందిన వ్యాపారులు మార్చి వరకు జిల్లాలో ఎమ్మార్పీ రేట్లకు మద్యం విక్రయించారు. ఎక్సైజ్ అధికారులు కూడా ఎమ్మార్పీ ధరలకే మద్యం అమ్మకాలు జరిగేలా దుకాణాల ముందు ధరల పట్టికను ఏర్పాటు చేయించారు. ఏప్రిల్ నుంచి ఏకంగా ఈ ధరల పట్టికను దుకాణదారులు తీయించి వేయటం గమనార్హం. నగరంలోనే యథేచ్ఛగా ఈ వ్యవహారం నడుస్తున్నా ఎక్సైజ్ సిబ్బంది మాత్రం తమ దృష్టికి ఫిర్యాదులు రాలేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. వచ్చే లెసైన్స్ జారీలో ప్రభుత్వం ఇదే తరహా లాటరీ ద్వారా కేటాయిస్తుందో..?
ప్రభుత్వమే అమ్మకాలకు దిగుతుందో..? తెలియని పరిస్థితుల్లో మద్యం వ్యాపారులు దీపం ఉండగానే ఇల్లుచక్క బెట్టుకునే పనిలో పడ్డారు. గత ఏడాది ఏప్రిల్, మే నెలల్లో సాధారణ ఎన్నికలు, ఫలితాలు ఉండటంతో తారా స్థాయిలో అమ్మకాలు సాగాయి. ఇప్పుడు అలాంటివేవి లేకపోవడం.. పైగా ప్రివిలేజ్ ఫీజు విధించటంతో మద్యం వ్యాపారులు సిండికేట్‌కు తెరదీశారు.
ఏప్రిల్ నుంచి కేసులే లేవట..!
ఎమ్మార్పీ రేట్ల కన్నా అధిక ధరకు వైన్స్ యజమానులు మద్యం విక్రరుుస్తున్నా ఏప్రిల్ నుంచి ఎక్సైజ్ అధికారులు ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. గత ఏడాది జూలై 1 నుంచి మార్చి చివరి వరకు 37 కేసులు నమోదైనట్లు పేర్కొంటున్నారు. అన్ని దుకాణాల్లో ఎమ్మార్పీ రేట్ల అమ్మకాలను యజమానులు భేఖాతర్ చేస్తున్నా ఎక్సైజ్ అధికారులు కనీసం దాడులు కూడా చేయకపోవడం గమనార్హం. పట్టణాల్లో సిండికేట్‌తో అదనంగా వసూళ్లు చేస్తుండగా గ్రామాల్లోని బెల్టు షాపులోనూ రూ.10 అదనంగా తీసుకుంటున్నారు. లెసైన్స్ ముగింపు గడువు సమీపిస్తుండడంతో వచ్చే నెలలో రూ.5 అదనంగా ఫుల్‌బాటిల్, బీరుకు పెంచాలన్న యోచనలో మద్యం వ్యాపారులు ముందడుగు వేస్తున్నారు.
ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు
మహేష్‌బాబు, డిప్యూటీ కమిషనర్, ఎక్త్సెజ్ శాఖ
జిల్లాలో ఎమ్మార్పీ రేట్ల కన్నా మద్యం అధిక ధరలకు విక్రయిస్తే సదరు షాపు యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటాం. మద్యం కొనుగోలు చేసేవారు ఏ షాపులోనైనా ఎక్కువ ధరకు విక్రయిస్తే ఆయా సర్కిల్ పరిధిలోని ఎక్సైజ్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలి. ఇప్పటికే జిల్లాలో అన్ని స్టేషన్లను ఈ మేరకు ఆదేశించాం.