ఓ యాక్సిడెంట్...17 లక్షల సెటిల్‌మెంట్ !!
►మృతుని కుటుంబానికి రూ.6.5 లక్షలు
► ఒప్పించిన వారికి రూ.5లక్షలు
► మధ్యవర్తులకు మరో రూ.5లక్షలు
► సిండికేటు నుంచే డబ్బులు వసూలు
తాను గీసిన గీత దాట వద్దని లక్ష్మణుడు అడవిలో తన వదినకు చెప్పి గీసిన లక్ష్మణరేఖ మాటేమిటోగాని.. ఇప్పుడు శ్రీకాకుళం పట్టణంలో ఆ ‘గీత’ను అధికారులు జవదాటలేక పోతున్నారు. ఉన్నతాధికారులు మొదలు సిండికేట్ల వరకు అన్నింటా తానై వ్యవహరిస్తున్న ఓ మహిళ అధికార పార్టీలోనే కాదు అధికారుల్లోనూ చక్రం తిప్పుతున్నారు. ఇటీవల సాగుతున్న సెటిల్‌మెంట్లలో తలదూర్చేస్తూ ఏదో చేయాలనుకుని ఇంకేదో చేసేస్తున్నారు. దీంతో అందరిలోనూ ఇప్పుడు అదే చర్చ సాగుతోంది.
శ్రీకాకుళం టౌన్ : మూడు రోజుల కిందట డేఅండ్‌నైట్ జంక్షన్ సమీపాన కొత్త బ్రిడ్జి వద్ద ఓ విద్యార్థి మృతికి కారకుడైన ఎక్సైజ్ ఉన్నతాధికారిని పూర్తిగా ఆ కేసు నుంచే తప్పించే క్రమంలో ఓ ‘గీత’ చక్రం తిప్పిన తీరు పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతుంది. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఈమె ఈ కేసు విషయంలో ఇటు మృతుని బంధువులను, అటు పోలీసులను ఒప్పించి మెప్పించడంలో లక్షల రూపారుులు చేతులు మారినట్టు తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రమాదానికి కారకుడైన ఉన్నతాధికారి తప్పతాగి ఓ విద్యార్థిని తన కారుతో చంపేస్తే ఏమి కాదన్నట్టు నేనున్నాలే అన్నట్టు.. మొత్తం చక్రం తిప్పి ఇందులో ఎటువంటి సంబంధం లేని ఓ డ్రైవర్‌ను ఒప్పించి కేసు మొత్తాన్ని నీరుగార్చేశారు. చివరకు మృతుని బంధువులకు కేసు వల్ల వచ్చే ప్రయోజనమేమి లేదని, ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగడమే ఉంటుందని.. మీరు ఒప్పుకుంటే లక్షలు ఇప్పిస్తానని ఒప్పించి బంధువులకు ఇచ్చిన దానికంటే సెటిల్ చేసినందుకు, మధ్యవర్తులకు అంతకంటే ఎక్కువ మొత్తం వసూలు చేసేందుకు అంగీకరించేటట్టు చేశారు.
తీరా చూస్తే మృతుని బంధువునికి ఇచ్చేందుకు అంగీకరించిన రూ.6.5 లక్షల కంటే మధ్యవర్తులు, ఆమెకే అంతకంటే ఎక్కువ మొత్తం వసూలుకు ఒప్పందం కుదిరినట్టు చర్చ నడుస్తోంది. మొత్తం సెటిల్‌మెంటుకు ఒక బృందమే ఏర్పాటు చేసి చక్రం తిప్పారు. ఇదిలా ఉంటే మొత్తం డబ్బులు సిండికేట్ల నుంచి వసూలు చేసేందుకు పక్కా స్కెచ్ గీసేశారు. దీంతో తప్పు చేసిన ఉన్నతాధికారి తడిగుడ్డ వేసుకుని నిద్రిస్తుంటే చక్రం తిప్పిన మహిళ అటు ఎక్సైజ్ శాఖలో, ఇటు పోలీసు శాఖలో అంతా తానై వ్యవహరించి తాను కూడా కొంత మొత్తం మింగేసినట్టు వార్తలు వినిపిస్తున్నారుు. మృతుని బంధువులతో మాట్లాడిన మధ్యవర్తుల వాటాకు రూ.5 లక్షలు ముట్టజెప్పాలని సదరు నాయకురాలు చెప్పేశారు.
మొత్తం సెటిల్ చేసేశాం కదా... మరి మాకేంటి అంటూ మరో రూ.5లక్షలు కొట్టేసినట్టు తెలిసింది. చేయని తప్పులో డ్రైవర్‌ను పెట్టినందుకు ఓ కానిస్టేబుల్ బంధువును ఒప్పించి ఆయనకు కొంత మొత్తం ఇప్పించేందుకు అంగీకరింపజేశారట. ఇంత మొత్తం ఎవరిస్తారనుకుంటే పొరపాటే.. అంతా సిండికేట్ల నుంచి వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేసేశారట.