నరసరావుపేటవెస్ట్: జిల్లాలో సగభాగానికి మద్యం సరఫరా చేసే నరసరావుపేట ఏపీ బేవరేజెస్ గోడౌన్లు గురువారం నుంచి మూత పడ్డాయి. గోడౌన్లకు మద్యం తీసుకువచ్చిన లారీలు రోడ్లపైనే పడిగాపులు కాస్తున్నాయి. గోడౌన్ల నుంచి సరఫరా లేక దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లలో మద్యం నిల్వలు తగ్గుతున్నాయి.
ఇప్పటికే మద్యం దొరకటం లేదనే సాకుతో ఫుల్‌బాటిల్‌పై రూ.25 నుంచి రూ.50 వరకు పెంచి విక్రయిస్తున్నారు. షాపులకు కావాల్సిన స్టాక్ ఇవ్వలేని ప్రభుత్వం వారి వద్ద నుంచి లెసైన్స్ ఫీజును మాత్రం ముందుగానే గుంజుకుంది. దీంతో మద్యం సరఫరా లేక, మద్యం ప్రియులు అడిగిన బ్రాండ్లు అందించలేక బేరాలు పోగొట్టుకుంటూ దుకాణ యజమానులు నష్టాలపాలవుతున్నారు. వారితో పాటు గోడౌన్లకు వచ్చిన మద్యం లారీల నుంచి దిగుమతి, ఎగుమతి చేసే హమాలీలకు రోజువారి పనిలేక ఇబ్బందులు పడుతున్నారు.
వివరాలను పరిశీలిస్తే..మద్యానికి సంబంధించి సుమారు రూ.8వేల కోట్లు ఆదాయ పన్ను చెల్లించాలని ఆ శాఖ జారీ చేసిన నోటీసులను రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఖాతరు చేయకపోవటంతో బేవరేజెస్ గోడౌన్లను అధికారులు మూసేశారు.దీంతో నాలుగురోజుల నుంచి షాపులకు మద్యం సరఫరా నిలిచిపోయింది. నరసరావుపేటలోని గోడౌన్ల ద్వారా మాచర్ల, గురజాల, వినుకొండ, చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లోని మద్యం దుకాణాలు, బార్లకు రూ. కోట్ల విలువైన మద్యం సరఫరా జరుగుతోంది. ప్రస్తుతం సరఫరా నిలిచిపోవడం, ఇదే పరిస్థితి మరో రెండు మూడురోజులు కొనసాగితే మద్యం నిల్వలు పూర్తిగా ఖాళీ అవుతాయని ఆయా షాపుల యజమానులు ఆందోళన చెందుతున్నారు. ముందుగానే బార్ల నిర్వాహకులు లెసైన్స్ ఫీజులను గత డిసెంబర్ చివరికే చెల్లించగా, వైన్స్‌షాపుల యజమానులు ఫిబ్రవరి 20వ తేదీతో చెల్లించేశారు. కాగా గోడౌన్ల వద్ద సరుకు ఎగుమతి, దిగుమతికి సంబంధించి 50 మంది హమాలీలు పనిచేస్తున్నారు. వీరందరికీ రోజువారీ కూలి దక్కుతుంటుంది. నాలుగురోజుల నుంచి పనులు దొరకక పోవటంతో ఇబ్బందిపడుతున్నారు.
ఎక్సైజ్ కార్యాలయాలకు వెళ్లి గోడౌన్లు ఎప్పుడు తెరుస్తారంటూ అధికారులను అడుగుతున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్త సమస్య కావటంతో తామేమీ ఇప్పుడే చెప్పజాలమంటూ వారు సమాధానమిస్తున్నారు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం ఆదాయ పన్నుశాఖ మూసేసిన గోడౌన్లను అలానే ఉంచి, నూతన గోడౌన్లను చూసి వాటిలోకి సరుకు దిగుమతిచేసి షాపులకు తరలించాలనే ఆలోచనతో అధికారులు ఉన్నట్లు సమాచారం. ఏమౌతుందో మరో రెండురోజులు వేచి చూడాల్సిందే.
మందు బందీ!
Published Mon, Mar 9 2015 2:38 AM | Last Updated on Sat, Sep 2 2017 10:31 PM
Advertisement
Advertisement