14న టెట్, 15న ఎంసెట్? | telangana tet, eamcet new schedule | Sakshi
Sakshi News home page

14న టెట్, 15న ఎంసెట్?

Published Sat, Apr 30 2016 2:45 AM | Last Updated on Wed, Sep 26 2018 3:23 PM

14న టెట్, 15న ఎంసెట్? - Sakshi

14న టెట్, 15న ఎంసెట్?

లేదంటే 21, 22 తేదీల్లో నిర్వహణ
రెండు మూడు రోజుల్లో ఖరారు: పాపిరెడ్డి

సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు విద్యా సంస్థల సహాయ నిరాకరణ నేపథ్యంలో మే 2న జరగాల్సిన తెలంగాణ ఎంసెట్ నిర్వహణను వాయిదా వేసిన ప్రభుత్వం, వాటిని తిరిగి ఎప్పుడు నిర్వహించాలన్న అంశంపై కసరత్తు చేస్తోంది. ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష మే 22న ఉన్నందున మే 15లోగా ఎంసెట్‌ను నిర్వహించాలని భావిస్తోంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌తోపాటు ఇతర రాష్ట్రాల ప్రవేశ పరీక్షలూ రాసే విద్యార్థులుంటారు గనుక వాటికి కూడా సన్నద్ధమయ్యేందుకు సమయమివ్వాలన్న నిర్ణయానికి వచ్చింది.

ఎంసెట్‌ను మే రెండో వారంలోనే నిర్వహించాలని భావించినా పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసుకున్న విద్యార్థులు ఇంజనీరింగ్ సెకండియర్‌లో చేరేందుకు (లేటరల్ ఎంట్రీ) నిర్వహించే ఈసెట్-2016 పరీక్ష మే 12వ తేదీన్నే ఉంది. అందుకే మే 15వ తేదీన ఎంసెట్‌ను నిర్వహిస్తే ఎలా ఉంటుందని ఉన్నత విద్యా మండలి యోచిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 2.46 లక్షల మంది ఎంసెట్‌కు హాజరు కానున్నందున ప్రభుత్వ విద్యా సంస్థల్లో వారందరికీ సరిపడ పరీక్ష కేంద్రాల ఏర్పాటుపై ఎంసెట్ కమిటీ దృష్టి సారించింది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత రానుంది. ఆది లేదా సోమవారాల్లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో చర్చించి ఎంసెట్ నిర్వహణ తేదీని ఖరారు చేస్తామని ఉన్నత విద్యా మండలి చైర ్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి పేర్కొన్నారు.
 
టెట్‌పైనా తర్జనభర్జన
మే 1న నిర్వహించాల్సిన టెట్‌ను కూడా వాయిదా వేసిన ప్రభుత్వం, దాని నిర్వహణపైనా దృష్టి సారించింది. దీన్ని మే 14న నిర్వహిస్తే ఎలా ఉంటుందనివిద్యా శాఖ ఆలోచిస్తోంది. మే 14న జరిగే డిపార్ట్‌మెంటల్ పరీక్షకు ఎక్కువ మంది టీచర్లు, లెక్చరర్లు హాజరయ్యే పక్షంలో టెట్‌ను మే 21 లేదా 22న నిర్వహించే అవకాశముంది. పరీక్ష కేంద్రాల ఏర్పాటుకు అనువైన ప్రభుత్వ విద్యా సంస్థల లెక్కలు తేల్చే పని రెండు మూడు రోజుల్లో పూర్తవనుంది. ప్రభుత్వ విద్యా సంస్థలతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లోనూ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందని యోచిస్తోంది. జూనియర్, డిగ్రీ కాలేజీలు, నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు, పాలిటెక్నిక్, బీఎడ్, డీఎడ్ కాలేజీల వంటి ప్రభుత్వ విద్యా సంస్థలనూ సంప్రదిస్తోంది.

సెట్లన్నీ ప్రభుత్వ కేంద్రాల్లోనే: పాపిరెడ్డి
ఎంసెట్, టెట్ నిర్వహణకు ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇతర ప్రవేశ పరీక్షల కేంద్రాలను కూడా ప్రభుత్వ సంస్థల్లోకే మార్చాలని నిర్ణయించినట్టు పాపిరెడ్డి తెలిపారు. పీజీఈసెట్, ఈసెట్, పీఈసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, లాసె ట్ తదితర పోటీ పరీక్షలన్నింటి కేంద్రాలనూ ప్రైవేటు విద్యా సంస్థల నుంచి తొలగించి ప్రభుత్వ సంస్థల్లోనే ఏర్పాటు చేయాలని ఆయా సెట్స్ కన్వీనర్లను ఆదేశించారు. పీజీఈసెట్, ఈసెట్, పీఈసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, లాసెట్ నిర్వహణకు సమయమున్నందున వాటి నిర్వహణ తేదీల్లో మార్పేమీ ఉండబోదని, అవన్నీ ముందుగా ప్రకటించినట్టుగానే జరుగుతాయని వెల్లడించారు.
 
యథాతథంగా మిగతా సెట్స్
12-5-2016     ఈసెట్
19-5-2016     ఐసెట్
27-5-2016     ఎడ్‌సెట్
29-5-2016     పీజీఈసెట్
24-5-2016     లాసెట్ (మూడేళ్లు, ఐదేళ్లు)
3-6-2016 నుంచి     పీఈసెట్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement