సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని పర్యాటక ప్రాంతాల గురించి ప్రపంచానికి తెలియాల్సి ఉందని పర్యాటక– సాంస్కృతిక మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు. తెలంగాణ టూరిజం ప్రమోషన్‌లో భాగంగా మహిళా బైక్ రైడర్లు చేపట్టిన సాహస ర్యాలీని ఆదివారం బేగంపేట్‌లో మంత్రి ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి మేకాంగ్ వరకు 7 దేశాల్లో 17 వేల కిలోమీటర్ల మేర తెలంగాణ ఆడబిడ్డలు తలపెట్టిన సాహస ర్యాలీ విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
రాష్ట్ర పర్యాటకంపై అంతర్జాతీయంగా ప్రచారం పొందాలన్నారు. యునెస్కో గుర్తింపు పొందిన 19 ప్రపంచ హెరిటేజ్ కట్టడాల వద్ద వీరు తెలంగాణ టూరిజం ప్రమోషన్‌తో పాటు, మహిళల భద్రతపై పర్యాటక ప్రదేశాల గురించి ప్రచారం నిర్వహిస్తారని చెప్పారు. టూరిజం కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ.. నేటి నుంచి 50 రోజుల పాటు సాహస యాత్ర చేస్తున్న తెలంగాణ మహిళా బైక్ రైడర్లను ఆయన అభినందించారు.
బైక్ రైడర్స్ జైభారతి, ప్రియా బహదూర్, శిల్ప బాలకృష్ణన్, సుజన్ శాంతిలు మాట్లాడుతూ.. 7 దేశాలను 50 రోజుల్లో చుట్టి వస్తామన్నారు. వీరు మయన్మార్, బంగ్లాదేశ్, లావోస్, కాంబోడియా, వియత్నాం, థాయిలాండ్ దేశాల్లో పర్యటించనున్నారు. కార్యక్రమంలో టీఎస్‌టీడీసీ ఈడీ కె.లక్ష్మి, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ పురుందర్ తదితరులు పాల్గొన్నారు. మహిళా రైడర్లు చేపట్టిన యాత్ర ఆదివారం సాయంత్రానికి ఆంధ్రప్రదేశ్‌లోని సీతానగరం కృష్ణా తీరంలో ఉన్న ఏపీ టూరిజం ప్రాంతానికి చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment