
కొనసాగుతున్న ‘ఉస్మానియా’ రగడ
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రిలో సూపరింటెండెంట్ నియామకంపై రగడ కొనసాగుతోంది. డీఎంఈ డాక్టర్ శాంతారావు జారీ చేసిన ఉత్తర్వుల మేరకు సూపరింటెండెంట్‌గా డాక్టర్ శివరామిరెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. సీనియారిటీ లిస్టులో ముందున్న నయాపూల్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సువర్ణను కాదని, శివరామిరెడ్డిని నియమించడంపై తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీడీఏ), ఉస్మానియా మెడికల్ జేఏసీ ప్రతినిధులు మండిపడ్డారు. మీకన్నా సీనియర్ అయిన డాక్టర్ సువర్ణ ఉండగా, మీరు ఈ పదవిలో ఎలా కొనసాగుతారంటూ శివరామిరెడ్డితో వాగ్వాదానికి దిగి, డాక్టర్ సువర్ణను సూపరింటెండెంట్ సీట్లో కూర్చోబెట్టారు.
సోమవారం సాయంత్రం వరకు డాక్టర్ సువర్ణ సూపరింటెండెంట్ సీట్లోనే గడిపారు. మంగళవారం ఉదయం డాక్టర్ శివరామిరెడ్డి సూపరింటెండెంట్ సీట్లో ఆసీనులు కాగా, డాక్టర్ సువర్ణ ఆయన పక్కనే ఉన్న సీట్లో కూర్చున్నారు. సుమారు రెండు గంటలపాటు సూపరింటెండెంట్ చాంబర్‌లో ఇద్దరూ కూర్చోవడంతో కొంత గందరగోళం నెలకొంది. సిబ్బంది సైతం ఎవరు సూపరింటెండెంటో.. ఎవరి మాట వినాలో.. ఎవరి మాట వినకపోతే ఏమవుతుందోననే సందిగ్ధంలో పడిపోయారు. కొద్దిసేపటి తర్వాత డాక్టర్ సువర్ణ డీఎంఈ కార్యాలయానికి వెళ్లడంతో డాక్టర్ శివరామిరెడ్డి పాలనా వ్యవహారాలను నిర్వహించారు.
‘ఉస్మానియూ’ ఘటనలు ప్రభుత్వం దృష్టికి
మంగళవారం ఉస్మానియా జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ దంతవైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ల స్థానంలో తెలంగాణ ఉద్యమకారులు వేరొకరిని కూర్చోబెట్టిన సంఘటనలను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు వారు ఇచ్చిన నివేదిక ప్రస్తుతం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. జరిగిన పరిణావూలపై నిర్ణయం తీసుకోవాలని, తావుు సీనియారిటీ ప్రాతిపదికనే పదోన్నతులు కల్పించామని అధికారులు తవు నివేదికలో తెలిపారు. ఢఇదిలా ఉండగా ప్రభుత్వ ఆదేశాల మేరకే తాను ఉస్మానియూ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా నియమితులయ్యానని డాక్టర్ శివరామిరెడ్డి పేర్కొన్నారు.
అల్వాల్ ఆస్పత్రికి ‘అనంత’ వైద్యుడా?
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని అల్వాల్ ప్రభుత్వాస్పత్రికి అనంతపురంకు చెందిన డాక్టర్‌ను నియమించడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ తెలంగాణ డాక్టర్ల అసోసియేషన్ నాయకులు మంగళవారం అల్వాల్ ప్రభుత్వాస్పత్రి వద్ద ఆందోళన నిర్వహించారు. అల్వాల్ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ సోమశేఖర్ కర్నూలుకు బదిలీపై వెళ్లడంతో అనంతపురానికి చెందిన డాక్టర్ విష్ణువర్ధన్ సోమవారం అల్వాల్ ఆస్పత్రి ప్రధాన వైద్యుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న అసోసియేషన్ నాయకులు మంగళవారం ఆస్పత్రికి వచ్చారు. ఈ సమయంలో డాక్టర్ ఆస్పత్రికి రాలేదు. బదిలీని నిలిపివేయాలంటూ తెలంగాణ ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ సుధాకర్, ప్రధాన కార్యదర్శి నాగార్జున, శామీర్‌పేట్, మేడ్చల్, కుత్బుల్లాపూర్ ప్రభుత్వాస్పత్రుల డాక్టర్లు, తదితరులు ఆస్పత్రి ప్రధాన గేటు వద్ద బైఠాయించి నియామకాన్ని నిలిపివేయాలంటూ ఆందోళన నిర్వహించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కీలకదశలో ఉన్న సమయంలో సీమాంధ్రకు చెందిన వైద్యుడిని అల్వాల్‌లో ఎలా నియమిస్తారంటూ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ విషయమై డాక్టర్ విష్ణువర్ధన్‌ను సంప్రదించగా... తన భార్య ఉస్మానియా ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్నందున ఈ బదిలీ అవకాశం లభించిందని, తాను ఎలాంటి పొరపాటు చేయలేదని తెలిపారు.